Home ఎడిటోరియల్ తంపుల నుంచి తెగతెంపులు

తంపుల నుంచి తెగతెంపులు

Article about Modi china tour

జమ్మూ కశ్మీర్‌లో పిడిపి బిజెపి మూడేళ్ల అసహజ అలయెన్స్ అర్ధాంతర మరణం పొందింది. పిడిపి నాయకురాలు మెహబూబ ముఫ్తి ప్రభుత్వానికి బిజెపి ఆకస్మికంగా మద్దతు ఉపసంహరణ ప్రకటించటంతో ఆమె గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రాను కలిసి రాజీనామా సమర్పించారు. ఇదంతా సోమవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత చకచకా జరిగిపోయిన పరిణామాలు. ప్రత్యామ్నాయ పొత్తులు, ప్రభుత్వ ఏర్పాటులో ఏ పార్టీకి ఆసక్తిలేనందున జమ్మూ కశ్మీర్ మరోసారి రాష్ట్రపతి పాలనలోకి వెళ్లనుంది. ఆ రాష్ట్రానికి ఇదేమీ కొత్తకాదు. ఇది 2008 నుంచి నాల్గవ పర్యాయం, 1977 నుంచి 8వ పర్యాయం అవుతుంది. 2014 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ లభించకపోవటంతో జమ్మూలో 25 సీట్లు గెలిచిన బిజెపి, కశ్మీర్ లోయలో 28 సీట్లు గెలిచిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, రెండు మాసాల అనంతరం సు దీర్ఘ చర్చల అనంతరం ‘అజెండా ఫర్ అలయెన్స్’ ప్రాతిపదికగా ముఫ్తి మహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. తండ్రి మరణానంతరం ఆయన కుమార్తె మెహబూబ ముఖ్యమంత్రి అయినారు.
ఈ రెండు పార్టీలు సిద్ధాంతాలరీత్యా పరస్పర విరుద్ధ శక్తులు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి భారత్ యూనియన్‌లో విలీనం సందర్భంగా ఇచ్చి హామీ మేరకు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 370 రద్దు బిజెపి ఎజండాలోని ముఖ్యాంశాల్లో ఒకటి. ముస్లిం వ్యతిరేకత ప్రాతిపదికగా, హిందువులు మెజారిటీగా ఉన్న జమ్మూకే పరిమితమైన పార్టీ. భద్రతా దళాలతో కశ్మీర్‌లో మిలిటెన్సీని అణచివేయటం దాని విధానం. కాగా కశ్మీర్‌లోయ ప్రాంతంలో రాడికల్ భావాలకు ప్రాతినిథ్యం వహించే పార్టీ పిడిపి. వేర్పాటు వాదులతో, పాకిస్థాన్‌తో చర్చల ద్వారా భారత రాజ్యాంగ పరిధిలో కశ్మీర్ సమస్యకు పరిష్కారం కోరుకుంటున్న పార్టీ. సామాన్య ప్రజలపై, మిలిటెంట్లపై కేంద్ర భద్రతా దళాల బల ప్రయోగాన్ని ఏనాడు అంగీకరించని పార్టీ. ఇటువంటి రెండు పార్టీల మధ్య సయోధ్య ఎలా సాధ్యం? అధికార దాహంతో అసహజమైన పొత్తు ఏర్పరుచుకున్ననాడే ఇది సాగే సంసారం కాదని రాజకీయ పండితులు వ్యాఖ్యానించారు.
ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకై కాల్పుల విరమణ అమలు జరపటానికి మెహబూబ ఒత్తిడిపై కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఇటు లోయలో కొన్ని ఘటనలు, వాస్తవాధీన రేఖ వెంట పాకిస్థాన్ సైన్యం కాల్పులు, టెర్రరిస్టుల చొరబాట్లు, భద్రతా దళాలు వాటిని తిప్పికొట్టటం వంటి ఘటనలు కొన్ని జరిగాయి. రైజింగ్ కశ్మీర్ పత్రిక సంపాదకుడు షుజాత్ బుఖారీ హత్య, ఈద్‌కు సెలవుపై ఇంటికి వెళుతున్న జవాన్ ఔరంగజేబును మిలిటెంట్లు కిడ్నాప్ చేసి హత్య చేయటం ఈ నెల రోజుల్లో నెలకొన్న సున్నితమైన శాంతికి తీవ్ర విఘాతం కలిగించాయి. కేంద్ర ప్రభుత్వం ఆశించినట్లు హురియత్ నాయకులు చర్చలకు సుముఖత చూపలేదు. అయినా కాల్పుల విరమణ పొడిగించటం క్రమంగా ప్రశాంతతకు దారి తీస్తుందని, శాంతికి మరికొంత అవకాశమువ్వాలని మెహబూబ కేంద్రాన్ని కోరారు. అయినా కేంద్రం కాల్పుల విరమణను ఎత్తివేసి సైన్యానికి తిరిగి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది.
కశ్మీర్ లోయలో ప్రధానంగా నాలుగు జిల్లాల్లో మిలిటెన్సీ బలంగా ఉంది. హతులైన మిలిటెంట్ల అంత్యక్రియల వద్ద నుంచి మరి కొంతమంది యువకులు మిలిటెంట్లలో చేరుతున్నారు. వీరు పాకిస్థాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు కారు. భద్రతా దళాల శృతిమించిన హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్న కశ్మీరీయువత, వారిపై బలప్రయోగ విధానాన్ని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి మెహబూబ ముఫ్తి. గత సంవత్సర కాలంలో పలుమార్లు ఢిల్లీ వచ్చి ప్రధానిని, హోంమంత్రిని కలిసి హురియత్‌తో, పాకిస్థాన్‌తో చర్చలు ప్రారంభించాలని విజ్ఞప్తులు చేశారు. వాజ్‌పేయి ప్రభుత్వ విధానాన్ని పాటించాలని కోరారు. హింసకు బదులు కశ్మీరీయులకు ఉపశమన చర్యలను కోరుతున్నారు. “జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమన్న విషయాన్ని మనసులో ఉంచుకుని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని అదుపు చేసే నిమిత్తం, రాష్ట్ర పాలనను గవర్నర్‌కు అప్పగించాలని మేము నిర్ణయించుకున్నాం” అని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ ప్రకటన చేసిన బిజెపి ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ చెప్పారు.
అందువల్ల, ఈ ప్రభుత్వం కూలిపోవటంపట్ల విచారించే వారెవరూ లేరు.