Home తాజా వార్తలు సుగుణాల నేరేడు పండ్లు…

సుగుణాల నేరేడు పండ్లు…

Jamun Fruit

 

సిద్దిపేట టౌన్ : చిన్నగా ఉదా రంగులో ఉండి, నోరూరించే నేరేడు పండ్ల సీజన్ ఇది. వేసవి సెలవులకు గ్రామాలకు చేరుకునే పిల్లలు ఈ చెట్ల కింద చేసే సందడిలో నేరేడు పళ్లను రాల్చడం వంటి ముచ్చట కూడా ఒకటి. ఈ ముచ్చట్లను పక్కన పెడితే … నేరేడు చెట్టు, ఫలం వల్ల ఉపయోగాలు కోకొల్లలని ఆయుర్వేదం చెబుతోంది. నేరేడు పండ్లు, ఆకులు, కాండపు బెరడును కూడా ఆయుర్వేద ఔషదాల తయారీలో విరివిగా వినియోగిస్తారు. మధుమోహానికి ఇది దివ్య ఔషదం, మొత్తంగా నేరేడులో ఉన్న సుగుణాలు ఏమిటో తెలుసుకుందాం.

జంబూ ఫలమంటే నేరెడే…

నేరేడును సంస్కృతంలో జంబూ ఫలం అంటారు. మన దేశంలో ఇది అధికంగా లభ్యమవుతుంది. దీని శాస్త్రీయ నామం షైజీజియం క్యూమిస్. ఇవి సీజనల్‌గా లభ్యమవుతాయి. సాధారణంగా వేసవి ప్రారంభం నుంచి వర్షాకాలం మొదలైన రెండు మూడు వారాల వరకూ ఇవి లభ్యమవుతాయి. నేరేడు పండ్ల తొక్క పలుచగా ఉంటుంది. అందుకే వాటిని జాగ్రత్తగా కోస్తారు. ముగ్గురు రోజంతా కష్టపడితే 30 కిలోలు కోస్తారు. వీటిలో అల, చిట్టి, బంబో తదితర రకాలున్నాయి.

నేరేడులో రకాలు
నేరేడు పండ్లు మూడు రకాలుగా గుండ్రంగా పెద్దవిగా ఉండేవి ఒక రకం. కోలగా పెద్దవిగా ఉండేవి ఇంకో రకం. వీటినే అల్ల నేరేడు అని కూడా అంటారు. గుండ్రంగా ఉండి చిన్నవిగా ఉండేవి మూడో రకం. వీటినే చిట్టి నేరేడు అని అంటారు. ఇందులో కొన్ని హైబ్రీడ్ రకాలున్నాయి. ఇవి భారీ సైజులు ఉండి తియ్యగా ఉంటాయి.

ఈ జాగ్రత్తలు తప్పనసిరి …
నేరేడు వగరుగా ఉంటుంది. జీర్ణానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల కొద్దిగా ఉప్పుతో తీసుకుంటే రుచితో పాటు వగరు, అరుగుదల సమస్య ఉండదు. అధికంగా తింటే మలబద్దకంతో పాటుగా నోరు వగరుగా ఉంటుంది. అతి దేనిలోనైనా ప్రమాదమనే విషయం గుర్తుంచుకోవాలి. ఇక నేరేడుపండ్లను తోపుడు బండ్లపై బహిరంగంగా విక్రయిస్తుండడంతో వాటిపై దుమ్ము, దూళి చేరతాయి. కాబట్టి కచ్చితంగా నీటితో శుభ్రం చేసుకుని తినాలి.

ఆరోగ్యానికి నేరేడు జ్యూస్…
నేరేడు పండ్లతో జ్యూస్ తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యం కూడా. నేరేడు పండ్లు వగరుగా ఉంటాయని, నోరంతా నీలంగా మారుతుందని పిల్లలతో సహా చాలా మంది వీటిని ఇష్టపడరు. నేరేడు జ్యూస్‌లో వగరు మాట ఉండదు. కాబట్టి చక్కగా తాగేయవచ్చు.

నేరేడు జ్యూస్ తయారీ విధానం…
ముందుగా నేరేడు పండ్లను కడిగి నీటిలో వేసి పిసికి గింజలను తీసి ఒక కప్పు రసాన్ని తయారు చేసుకోవాలి. రాగి పిండిని ఒక కప్పు నీటిలో ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు స్టవ్‌పై పెట్టాలి. అవి మరుగుతుండగా రాగి పిండి మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ కలపాలి. లేకుంటే ఉండలు కట్టేస్తుంది. రెండు, మూడు నిమిషాల తర్వాత స్టవ్ నుంచి పూర్తిగా చల్లారనివ్వాలి. ఖర్జూర ముక్కలు, చాక్లెట్ ముక్కలు, రోజు వాటర్ మిక్సిలో వేసి మిక్స్ చేసుకోవాలి. అందులో నేరేడు పండ్ల రసం, చల్లారిన రాగి మిశ్రమం వేసి మరోసారి తిప్పాలి. అంతే పోషకాల గని నేరేడు జ్యూస్ రెడీ. పిల్లలు దీన్ని ఇష్టంగా తాగుతారు. వగరు మాట ఉండదు.

నేరేడు పండ్లలో పోషకాలివే …
నేరేడు పండ్లలో అధిక మోతాదులో సోడియం, పోటాషియం, కాల్షియం, పాస్ఫరస్, మాంగనీస్, జింక్, ఐరన్, విటమిన్ సి, రైబోఫ్లైవిన్, నికోటిన్ ఆమ్లం, కొలైన్, పోలిక్ ఆమ్లం లభిస్తాయి. నేరేడు రక్తంలోని ఎర్ర రక్త కణాలను శుద్ది చేస్తుంది.

నెలసరి సమస్యలకు …
కొందరు మహిళలు నెలసరి సమయంలో పొత్తి కడుపులో వీపరితమైన నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారు నేరేడు బెరడు కషాయాన్ని 25 రోజల పాటు 30 ఎంఎల్ చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకుంటే మార్పు గమనించవచ్చు.

ఆరోగ్యప్రదాయిని…
* వేసవిలో జీర్ణవ్యవస్థ నెమ్మ దిచండంతో సమస్యలు వస్తాయి. వీటిని అదుపు చేసే గుణం నేరేడు పండ్ల ఆకులకు ఉంది.
* కాల్షియం, ఐరన్, పోటాసియం, విటమిన్ సి పుష్కలంగా లభ్యమయ్యే నేరేడు తింటే వ్యాధి నిరోధక శక్తి వృద్ధి అవుతుంది. ఎముకలకు గట్టితనం వస్తుంది.
* నేరేడు ఆకులతో చేసే కషాయం బాక్టీరియల్, వైరల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తాయి. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి. ఎనీమియా, డయాబిటిస్ వ్యాధులకు మంచి ఔషదం .

* గుండె సంబంధ వ్యాధులను అడ్డుకునే శక్తి నేరేడుకు ఉంది. క్యాన్సర్ రాకుండా చేస్తాయి. ఆకుల్ని దంచి కషాయంగా చేసి పుక్కిలిస్తే దంతాలు కదలడం, చిగుళ్ల వాపులు, నోటిలో పుండ్లు లాంటి తగ్గుముఖం పడతాయి.
* ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మేస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. ఆకు రసంతో పసుపు కలిపి పురుగులు కుట్టిన చోట, దురదలు, సాధారణ దద్దుర్లకు లేపనంగా రాస్తే ఉపశమనం ఉంటుంది.

* జిగట విరేచనాలతో బాధపడేవారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు, మూడు చెంచాలు చొప్పున ఇవ్వొచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. దీంతో రోగికి శక్తి అందడంతో పాటుగా పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి.
* కాలేయం పనితీరు క్రమబద్దీకరించడానికి, శుభ్రపరచడానికి నేరేడులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు, గుండెకు దివ్య ఔషదంగా పనిచేస్తుంది.
* నేరేడు గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి.

Jamun Fruit with Medicinal Properties