Friday, April 19, 2024

జపాన్ బిలియనీర్ అంతరిక్షయాత్ర విజయవంతం

- Advertisement -
- Advertisement -

Japanese billionaire space mission successful

యాత్రలో బిలియనీర్ మెజవాతో పాలుపంచుకున్న మెజవా ప్రొడ్యూసర్, రష్యా కాస్మోనాట్
12 రోజులు రోదసీలో గడిపి సురక్షితంగా భూమికి చేరిక

మాస్కో : జపాన్ బిలియనీర్, ఫ్యాషన్ రంగ దిగ్గజం యుసాకు మెజవా (46) రోదసీ యాత్ర దిగ్విజయంగా ముగిసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 12 రోజులు గడిపి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. మెజవాతోపాటు ఆయన ప్రొడ్యూసర్ యొజో హిరానో (36) , రష్యా కాస్మోనాట్ అలెగ్జాండర్ మిసుర్కిన్ కూడా ఈ యాత్రంలో పాలుపంచుకున్నారు. ఈనెల 8న కజకిస్థాన్ లోని బైకనూర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరిన వీరు 12 రోజుల తరువాత కజకిస్థాన్ లోని జెజ్కాగర్ ప్రాంతానికి 148 కి.మీ దూరంలో సోమవారం ఉదయం 9.13 గంటలకు నేలపై దిగారు. 2009 తరువాత స్వంత ఖర్చులతో రోదసీకి బయలుదేరిన వీరి పర్యటన కోసం మెజవా భారత కరెన్సీలో రూ. 600 కోట్లు చెల్లించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోని వ్యోమగాములకు ఊబర్ ఈట్స్ సంస్థ ఆహార పదార్ధాలను పంపించగా, మెజవా వాటిని చేరవేశారు. గత వారం ది అసోసియేటెడ్ ప్రెస్‌కు ఆయన ప్రత్యక్షంగా ఇచ్చిన ఇంటర్వూలో ఒకసారి అంతరిక్షంలో మీరున్నట్టయితే ఆ అనుభవం ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేమని తన అనుభూతిని తెలియచేశారు.

రోదసీ 12 రోజుల యాత్రకు 80 మిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ గానే చెల్లించానని చెబుతూ ఎంత మొత్తానికి కాంట్రాక్టు కుదిరిందో మాత్రం వెల్లడించలేదు. అంతరిక్షంలో ఎదురైన ఇబ్బందులు వివరిస్తూ కాస్త తాను అస్వస్థతకు గురయ్యానని, నిద్రపోవడం కొద్దిగా ఇబ్బంది అయిందని చెప్పారు. ఈ యాత్రంతా తనకు ఎంతో ఆనందం కలిగించిందని చెప్పారు. అంతరిక్ష కేంద్రంలో బ్యాడ్మింటన్, టేబిల్ టెన్నిస్, గోల్ఫ్ వంటి క్రీడలతో పాటు వంద పనులు చేయవచ్చని తెలిపారు. చంద్రుడి పైకి వెళ్లేందుకు కూడా మెజవా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. 2023 లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ‘డియర్ మూన్ ’ అని పేరు పెట్టారు. స్టార్‌షిప్ రాకెట్‌లో చంద్రుడి మీదకు వెళ్లే తొలి ప్రయాణికుడిగా మెజవా పేరును స్పేస్ ఎక్స్ సీఈఒ ఎలాన్ మస్క్ 2018 లోనే ప్రకటించారు. ఆ రాకెట్‌లో చంద్రుడి పైకి వెళ్లేందుకు ఎనిమిది మందిని మెజవా ఆహ్వానించారు. గత అక్టోబర్‌లో రష్యా నటుడు యులియా పెరెసిల్డ్ , ఫిలిం డైరెక్టర్ క్లిమ్ షిపెంకో అంతరిక్ష కేంద్రంలో 12 రోజులు గడపడమే కాకుండా కక్షలో మొట్టమొదటి సారి మూవీని చిత్రీకరించ గలిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News