Friday, April 19, 2024

కబ్జాలో జవహర్‌నగర్ హెచ్‌ఎండిఏ భూములు

- Advertisement -
- Advertisement -
Jawahar Nagar HMDA lands under occupation
 ఇద్దరు, ముగ్గురురి చేతులు మారిన 500 ఎకరాల భూమి.  పట్టించుకోని అధికారులు

హైదరాబాద్ : జవహర్‌నగర్‌లోని హెచ్‌ఎండిఏ భూములు అ న్యాక్రాంతం అవుతున్నాయి. 1,767 ఎకరాల్లో భూముల్లో చాలావరకు ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. స్థానికంగా రాజకీయ పార్టీల నాయకులతో పాటు పలువురు స్థానికులు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఎకరం భూమి ధర రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల ధర పలుకుతోంది. అయితే 1,767 ఎకరాల్లో ఇప్పటికే 500 ఎకరాల భూమిని కబ్జాదారులు ప్లాట్లుగా చేసి విక్రయించినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం నవంబర్, 2009లో పంచనామా నిర్వహించి హెచ్‌ఎండిఏకు 2370.05 ఎకరాల భూమిని అప్పగించింది. అప్పటి నుంచి హెచ్‌ఎండిఏ అధికారులు వాటిపై దృష్టి సారించకపోవడంతో ఇప్పటికే 500 ఎకరాల భూమి ఇద్దరు, ముగ్గురు చేతులు మారినట్టుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

684.03 ఎకరాల భూమిపై కోర్టు కేసులు..

2012, 13 సంవత్సరంలో జవహర్‌నగర్‌లోని భూములను సద్వినియోగం చేసుకునే క్రమంలో ప్రత్యేకంగా ‘ఎడ్యుకేషన్ హబ్’ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. హెచ్‌ఎండిఏకు 2370.05 ఎకరాల భూమిలో నుంచి ప్రభుత్వం జిఓ 95, తేదీ 06.03.2006వ తేదీన బిట్స్ పిలానీకి 200 ఎకరాలను, ఎకరం ధర రూ.1.50లక్షలుగా కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు 2008లో జెన్‌పాక్ట్ సంస్థకు 50 ఎకరాలను (ఎకరాకు రూ.25లక్షల ధర)కు విక్రయించింది. దీంతోపాటు ఎపి సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘానికి 100 ఎకరాల భూమిని కేటాయించింది. పర్యాటన విభాగానికి 160 ఎకరాలను, ట్రాన్స్‌కో సంస్థకు 40 ఎకరాలు, రాజీవ్ గృహకల్పకు 50 ఎకరాలు, 2.20 ఎకరాలు ఎఆర్‌పిఓకు హెచ్‌ఎండిఏ సంస్థ భూములను కేటాయించింది. వీటితో పాటు 684.03 ఎకరాల భూమిపై కోర్టు కేసులు నడుస్తున్నాయి.

భూములు కేటాయించాలని అనేక సంస్థల విజ్ఞప్తి..

ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించిన కేసులు గెలవడానికి హెచ్‌ఎండిఏ అధికారులు విశ్వప్రయత్నం చేస్తుండగా, కబ్జారాయుళ్లు మాత్రం తమపని తాము చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న 1083.82 ఎకరాల భూమిలో ఇప్పటికే 500 ఎకరాలు అన్యాక్రాంతం కాగా మిగతా భూమిపై కబ్జాదారుల కన్నుపడింది. ప్రస్తుతం ఆ భూమి హద్దులను కూడా తొలగించి యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. జవహర్‌నగర్‌లోని భూములను ఢిల్లీ తరహాలో ఎడ్యుకేషన్ ఏరియాగా తీర్చిదిద్దనున్నట్టు ప్రభుత్వం ప్రకటించినా కొందరు కబ్జారాయుళ్లు వాటిని తెగనమ్ముకుంటున్నారు.

జంషెడ్‌పూర్‌కు చెందిన ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ అనే విద్యాసంస్థ 100 ఎకరాలను కేటాయించాలని గత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 100 ఎకరాలను, సింగరేణి కాలరీస్ కూడా 30 ఎకరాలను కేటాయించనున్నట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. వీటితోపాటు ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ స్కూల్స్ అసోసియేషన్ 10 నుంచి 25 ఎకరాల భూమిని కేటాయించాలని విజ్ఞప్తి చేశాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్న భూములు సైతం అన్యాక్రాంతం కావడం దీనిపై కమిటీ వేసి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News