Friday, March 29, 2024

‘అన్నం పెట్టిన చేతులనే నరుకుతున్నారు’.. కంగన, రవికిషన్‌పై జయా బచ్చన్..

- Advertisement -
- Advertisement -

అన్నం పెట్టిన చేతులనే నరుకుతున్నారు
ఇదే ‘మురికిగుంట’ మీకు డబ్బు, పేరు ఇచ్చింది
కంగన, రవికిషన్‌పై జయా బచ్చన్ విసుర్లు

Jaya bachchan fires on Kangana and Ravi Kishan

న్యూఢిల్లీ: సినీ పరిశ్రమకు చెందిన వారే ఆ రంగాన్ని అప్రతిష్ట పాల్జేస్తున్నారని, అన్నం పెట్టిన చేతులనే నరికివేస్తున్నారని అలనాటి నటి, రాజ్యసభ ఎంపి జయా బచ్చన్ ఆరోపించారు. సినీ పరిశ్రమలో మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతోందని సినీనటుడు, బిజెపి ఎంపి రవికిషన్ సోమవారం లోక్‌సభలో చేసిన ఆరోపణలు, మరో సినీ నటి కంగనా రనౌత్ బాలీవుడ్‌ను మురికిగుంటగా అభివర్ణిస్తూ ఇటీవల చేసిన వ్యాఖ్యలను జయా బచ్చన్ పేర్లు ప్రస్తావించకుండా విమర్శించారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో జయా బచ్చన్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సినీ పరిశ్రమపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయని, సినీ పరిశ్రమను ప్రభుత్వం రక్షించాలని కోరారు. సినీ పరిశ్రమను మురికి గుంటగా కొందరు అభివర్ణించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని ఆమె చెప్పారు. ఇదే పరిశ్రమలో పేరు సంపాదించుకున్న వారు దాన్ని మురికి గుంటగా పిలుస్తున్నారని ఆమె కంగనను పరోక్షంగా ప్రస్తావించారు. బాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగంపై బిజెపి ఎంపి రవికిషన్ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా, సిగ్గుపడే విధంగా ఉన్నాయని ఆమె చెప్పారు. అన్నం పెట్టిన చేతులనే నరికివేయడంలా ఇది ఉందని, ఇది మంచి పని కాదని ఆమె హితవు చెప్పారు. సినీ పరిశ్రమ ద్వారా దేశంలో ప్రత్యక్షంగా 5 లక్షల మందికి, పరోక్షంగా 50 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆమె తెలిపారు. దేశంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న పరిస్థితిలో, ఉపాధి దొరకక ప్రజలు అల్లాడుతున్న తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి సోషల్ మీడియా ద్వారా సినీ పరిశ్రమపై దాడి జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సినీ పరిశ్రమ ద్వారా డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించుకుని అదే పరిశ్రమను తిడుతున్న వారిని ప్రభుత్వం అదుపు చేయాలని ఆమె కోరారు. దేశంలో అత్యధికంగా ఆదాయం పన్ను కడుతున్న వారిలో సినీరంగానికి చెందిన వారు ఉన్నారని ఆమె చెప్పారు. అటువంటి వారు కూడా వేధింపులకు గురవుతున్నారని జయా బచ్చన్ చెప్పారు. ఆపత్కాకాలంలో ప్రభుత్వానికి అండగా నిలబడే సినీ పరిశ్రమకు ప్రభుత్వ తోడ్పాటు అవసరమని ఆమె అన్నారు. విపత్తుల కాలంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ధనాన్ని, సేవలను అందచేసేది సినీ పరిశ్రమకు చెందిన వారేనని ఆమె తెలిపారు. తనకే కాదు, సినీ పరిశ్రమకు ప్రభుత్వ రక్షణ కావాలని ఆమె రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు సమక్షంలో విజ్ఞప్తి చేశారు.

Jaya bachchan fires on Kangana and Ravi Kishan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News