Home తాజా వార్తలు తెలంగాణలో సంక్షేమ పథకాలు భేషు

తెలంగాణలో సంక్షేమ పథకాలు భేషు

Jayaprakash hegde congratulated ts welfare schemes

 

హైదరాబాద్ : రాష్ట్రంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలు, బిసి కమిషన్ పని తీరును కర్ణాటక బిసికమిషన్ చైర్మన్ జయప్రకాష్ ప్రశంసించారు. తెలంగాణ బిసి కమిషన్ అనుసరిస్తున్న చట్టపరమైన విధివిధానాల పట్ల ఆయన అభినందనలు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర బిసి.కమిషన్ కార్యాలయంలో చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులు సిహెచ్ ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్ నూలి, కె.కిషోర్‌గౌడ్, కార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆయన కలిశారు. ఈ సందర్భంగా కర్ణాటక బిసి కమిషన్ చైర్మన్, సభ్యులను ఘనంగా సన్మానించారు.జయప్రకాష్‌హెగ్డే మాట్లాడుతూ తెలంగాణలో అమలులో ఉన్న అనాధల రిజర్వేషన్లపై ఆయన ప్రత్యేకంగా అడిగి వివరాలు సేకరించారు. కర్ణాటకకు చెందిన ప్రామాణికమైన బిసి కమిషన్‌లు ఓ చిన్నపరెడ్డి, హవనూర్ కమిషన్ నివేదికల తెలుగు అనువాద ప్రతులను ఆయన అందజేశారు.

ప్రభుత్వం ఇచ్చిన టిఓఆర్ పై జరుగుతున్న అధ్యయనంలో భాగంగా తెలంగాణ రాష్ట బిసి కమిషన్ కర్ణాటక రాష్ట్రాన్ని సందర్శించాలని ఆయన కోరారు. సభ్యులు రాజశేఖర్, ఎస్‌హెచ్ కళ్యాణ్‌కుమార్, అరుణ్ కుమార్, సువర్ణలు కర్ణాటక మిషన్ చట్టం, అక్కడి సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ త్వరలో దక్షిణాది రాష్ట్రాల బిసి కమిషన్‌ల సమావేశం ఏర్పాటు దిశగా కార్యాచరణ చేపట్టమన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తమకు అందజేసిన ప్రాధాన్యతల (టిఓఆర్) ఆధారంగా నిర్దిష్టమైన అధ్యయనం మొదలు పెట్టినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ ఆరంభించి నివేదిక సమగ్రంగా ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. బిసిలకు బాసటగా తెలంగాణ దేశానికి మార్గదర్శకం గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. సభ్యులు సిహెచ్ ఉపేంద్ర మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఎంబిసి కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

మరో సభ్యుడు శుభప్రదపటేల్ మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలలో తొలిసారిగా కులగణన చేపట్టాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రాన్ని కోరిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని అన్నారు. మరోసభ్యుడు కిషోర్ గౌడ్ ప్రసంగిస్తూ దేశంలోకెల్లా నాణ్యమైన విద్యను మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలల ద్వారా ఉత్తమంగా అందిస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. సభ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ వేలాది కోట్లు వెచ్చించి దేశంలోని అనేక పథకాలతో తెలంగాణ అగ్రభాగాన ఉందని పేర్కొన్నారు.కల్యాణ లక్ష్మి, రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమశాఖ అమలు చేస్తున్న పలు పథకాలపై ఆయన సమగ్రంగా వివరించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర కమిషన్ చైర్మన్‌లు, సభ్యులు వర్గల్‌లోని మహాత్మ జ్యోతిరావు పూలే డిగ్రీ కళాశాలను శుక్రవారం సందర్శించనున్నారు.

Jayaprakash hegde congratulated ts welfare schemes