Home జాతీయ వార్తలు కింగ్ మేకర్ కాదు….. కింగే

కింగ్ మేకర్ కాదు….. కింగే

కాంగ్రెస్ మద్దతుతో సిఎం పీఠానికి చేరువలో కుమార స్వామి

Kumara-Swamy

బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి, జెడి (ఎస్) నాయకుడు కుమారస్వామిని నిన్నటి వరకూ అంతా కింగ్‌మేకర్ అంటూ అభివర్ణించారు. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం అటు కాంగ్రెస్‌కుగానీ, ఇటు బిజెపికిగానీ రాకపపోవడంతో, కింగ్‌మేకర్ స్థానం నుంచి కింగ్‌గా ప్రమోషన్ కొట్టేశారు. కనీస మెజారిటీకి బిజెపి ఎనిమిది సీట్ల దూరంలో నిలిచిపోయింది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావలని కలలుగన్న కాంగ్రెస్ 78 సీట్లకే పరిమితమైంది. దీనితో, 37 సీట్లు దక్కించుకున్న జెడి (ఎస్) కీలక పార్టీగా తెరపైకి వచ్చింది. మిత్రపక్షమైన బిఎస్పీతో కలిసి ఈ పార్టీ సాధించిన సీట్లు 38. కర్నాక అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్దీ, హంగ్ తప్పదన్న అభిప్రాయం బలపడుతూ వచ్చింది. ఓటింగ్ సరళిని కూడా దిశగా కొనసాగింది. ఎగ్జిట్ పోల్స్‌లోనూ హంగ ఖాయమన్న ఎక్కువ శాతం విశ్లేషణలు స్పష్టం చేశాయి. బిజపి, కాంగ్రెస్ పోటాపోటీగా సీట్లను గెల్చుకుంటే, ప్రభుత్వం ఏర్పాటుకు జెడి (ఎస్) మద్దతు అవసరమవుతుందని, ఫలితంగా కుమారస్వామి కింగ్ మేకర్ అవుతారని బలమైన వాదన వినిపించింది. కానీ, ఫలితాలు వెల్లడైన తర్వాత పరిస్థితి కొత్త మలుపు తిరిగింది.

అతి పెద్ద సింగిల్ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ, బిజెపికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కనీస మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ సమీపానికికైనా రాలేదు. అందుకే, అందరి దృష్టి జెడి (ఎస్)పై పడింది. బిజెపిని అధికారంలోకి రాకుండా నిరోధించాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ బేషరతుగా జెడి (ఎస్)కు మద్దతు ప్రకటించింది. ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కినా అభ్యంతరం లేదని తేల్చిచెప్పింది. ఏదో ఒక పార్టీకి మద్దతునిచ్చి, ఎన్నోకొన్ని మంత్రి పదవులను దక్కించుకోవచ్చనుకున్న కుమారస్వామికి జాక్‌పాట్ దక్కింది. కాంగ్రెస్ నిర్ణయం ఆయనకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి మార్గాన్ని సుగమమం చేసింది. మద్దతునిస్తున్నట్టు కాంగ్రెస్ చేసిన ప్రకటన ఆధారంగా ఆయన గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిసి, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. తానిప్పుడు కింగ్‌మేకర్‌ని కానని, కర్నాటక కింగ్‌నని నిరూపించుకున్నారు.

తండ్రిచాటు బిడ్డకాడు..

కుమారస్వామికి చాలాకాలం తండ్రిచాటు బిడ్డగానే అంతా అనుకునేవారు. మొదట్లో మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ కుమారుడిగానే ఆయన పేరు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొట్టింది. అయితే, తనకంటూ ప్రత్యేక వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు ఉన్నాయని నిరూపించుకోవడానికి కుమారస్వామి చాలాకాలం శ్రమించారు. 2006లో బిజెపి మద్దతుతో అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత కర్నాటక రాజకీయాలపై ఆయన తనదైన ముద్ర వేశారు. తండ్రి అడుగుజాడల్లో నడవకుండా, సొంత నిర్ణయాలతో ముందుకు దూసుకెళ్లారు. బిజెపితో కుదిరిన ఒప్పందం ప్రకారం 2007లో తన పదవికి రాజీనామా చేశారు. పదవిలో ఉన్నకాలంలో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టి, పథకాలను ప్రవేశపెట్టి తనను తాను నిరూపించుకున్నారు. ‘ప్రజల ముఖ్యమంత్రి’ అని పేరు తెచ్చుకున్నారు.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో రామనగరం, చిన్నపట్న నియోజకవర్గాల నుంచి పోటీచేసి, రెండింటిలోనూ విజయాలను సాధించారు. కాంగ్రెస్ మద్దతు ప్రకటన వెలువడిన వెంటనే, ఎంతో వేగంగా స్పందించి, గవర్నర్‌కు అప్పాయింట్‌మెంట్ కోసం లేఖరాసి, బిజెపిని ప్రభుత్వ ఏర్పాటు రేసులో వెనక్కు నెట్టేశారు. రాజకీయాల్లో రాటుదేలిన కుమారస్వామి ఇప్పుడు తండ్రిచాటు బిడ్డకాడు.. అసలుసిసలైన నాయకుడు. నిజానికి కర్నాటక రాజకీయాలను శాసిస్తున్న ఆయనకు రాజకీయాలకంటే సినిమాలంటేనే చాలా ఇష్టం. చిన్నతనంలో తన అభిమాన హీరో రాజ్‌కుమార్‌ను అనుకరించేవారు. ఆయన మాదిరిగానే డ్రెస్సులు వేసుకునేవారు. తర్వాతికాలంలో నిర్మాతగా మారారు. ఎన్నో విజయవంతమైన కన్నడి సినిమాలు తీశారు. సినీ రంగంలోనేకాదు.. రాజకీయ రంగంలోనూ తాను సమర్థుడినేనని నిరూపించుకుంటున్నారు.