Home తాజా వార్తలు మార్కెట్ పై జెట్ నీలి నీడలు…

మార్కెట్ పై జెట్ నీలి నీడలు…

Jet-Airways
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాల ప్రకటన ప్రారంభమైన నేపథ్యంలో గత వారం దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రధాన సూచీలు ఒక శాతానికి పైగా వృద్ధి చెందాయి. క్రితం వారం మహావీర్ జయంతి, గుడ్‌ఫ్రైడే కారణంగా స్టాక్‌మార్కెట్లకు రెండు రోజులు సెలవులు రావడంతో కేవలం మూడు రోజులు మాత్రమే మార్కెట్లు పని చేశాయి. ఈ నేపథ్యంలో బిఎస్‌ఇ సెన్సెక్స్ 373 పాయింట్లు వృద్ధి చెంది 39,140 పాయింట్లకు చేరుకుంది. మరో వైపు జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 109 పాయింట్లు లాభపడి 11,752 పాయింట్లకు చేరుకుంది.ఇప్పటివరకు ఫలితాలు ప్రకటించిన టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రోలాంటి టెక్ దిగ్గజాలు మార్కెట్ అంచనాలను మించి లాభాలను నమోదు చేసిన నేపథ్యంలో మదుపరులు మార్కెట్లలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఫలింతగా గత రెండు వారాలుగా మార్కెట్లు లాభాల బాటలో పరుగులు పెడుతున్నాయి. గత వారం మార్కెట్లో వార్తల్లో నిలిచిన కొన్ని స్టాక్స్‌ను ఇప్పుడు చూద్దాం.
జెట్ షేర్లు 37 శాతం పతనం
జెట్ ఎయిర్‌వేస్ పూర్తిగా విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆ కంపెనీ షేరు గత వారంలో దాదాపు 37 శాతం పతనమయింది. కాగా రాబోయే రెండు వారాల్లో కొత్తగా మరో 27 విమానాలను సంస్థలోకి చేర్చనున్నట్లు బడ్జెట్ ఎయిర్‌లైన్స్ స్పైస్ జెట్‌‌ర పకటించడంతో ఆ సంస్థ షేర్లు ఏకంగా 23.97 శాతం పెరిగాయి. జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులు నిలిచిపోయిన నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేసేందుకు స్పైస్ జెట్ అదనపు సర్వీసులను నడపాలని భావిస్తోంది. తమ వ్యాపార విస్తరణకు ఇదే సరయిన సమయంగా భావిస్తున్న ఆ సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన దాదాపు 500 మంది పైలట్లను కూడా తమ సంస్థలోకి చేర్చుకుంది. అంతేకాదు జెట్ పైటల్లకే తమ తొలి ప్రాధాన్యత అని స్పైస్‌జెట్ సిఎండి కూడా ప్రకటించడం తెలిసిందే. జెట్ సంక్షోభం నేపథ్యంలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు చెందిన షేర్లు కూడా 8.55 శాతం పెరిగాయి.
29.7 శాతం పెరిగిన పిసిజె షేరు
బంగారు అభరణాల తయారీ సంస్థ అయిన పిసిజె షేర్లు గత వారం దాదాపు 29.7 శాతం పెరిగాయి. పెట్టుబడుల సంస్థ అయిన కర్లినా ఈ కంపెనీకి చెందిన 47 లక్షల షేర్లను ఒక్కో షేరు రూ.140.50 చొప్పున కొనుగోలు చేసింది. గత వారం కూడా ఈ సంస్థ పిసిజెకి చెందిన 46.5 లక్షల షేర్లను కొనుగోలు చేసింది.
టాటా మోటార్స్‌పై మాతృసంస్థ ప్రేమ?
టాటా మోటార్స్‌ను ఆదుకోవడానికి దాని ప్రమోటర్లు ముందుకు రావచ్చన్న వార్తల నేపథ్యంలో ఆ సంస్థ షేర్లు 9 శాతం పెరిగాయి. మూడో త్రైమాసిక ఫలితాల అనంతరం టాటా మోటార్స్‌ను ఆదుకోవడాలని మాతృసంస్థ అయిన టాటా సన్స్ నిర్ణయించినట్లు కనిపిస్తోంది. టాటా మోటార్స్‌కు చెందిన సుమారు రూ.250 కోట్ల విలువైన షేర్లనుటాటా సన్స్ ఈ మధ్యకాలంలో కొనుగోలు చేసింది. కంపెనీతో పాటుగా దాని వాటా పడిపోకుండా చూడడానికి మాతృసంస్థ రంగంలోకి దిగుతుందన్న నమ్మకం కలగడమే టాటా మోటార్స్ షేరు పెరగడానికి కారణంగా కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
కొనసాగుతున్న అదాగ్ పతనం
కాగా, అనిల్ అంబానీకి చెందిన అదాగ్ గ్రూపు కంపెనీల షేర్ల పతనం కొనసాగుతూనే ఉంది. గత వారం రిలయర్స్ క్యాపిటల్ షేర్లు 17 శాతం పతనం కాగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ షేర్లు13.75 శాతం, రిలయన్స్ పవర్ షేర్లు 13 శాతం పతనమైనాయి. ఆదే గ్రూపునకు చెందిన రిలయన్స్ నేవల్ షేర్లు 11.93 శాతం, రిలయన్ష్ హోమ్ షేర్లు 9.33 శాతం పతనమైనాయి. మిడ్‌క్యాప్ విభాగంలో అత్యంత దారుణంగా పతనమైన షేర్లు ఈ గ్రూపునకు చెందినవే కావడం గమనార్హం.
లాభాలతో మొదలు
కాగా, ఈ వారం మార్కెట్లో లిస్టింగ్ అయిన రెండు కంపెనీల షేర్లు కూడా ఇష్యూ ధరకన్నా ఎక్కువగానే ముగియడం విశేషం. పాలీక్యాబ్ ఇండియా షేరు లిస్టింగ్ ధర రూ.538 కాగా, 20.06 శాతం అధికంగా రూ.645.95 వద్ద ట్రేడ్ అయింది. ఏప్రిల్ 59 తేదీల వద్ద విక్రయం అయిన రూ.1345 కోట్ల విలువైన ఈ కంపెనీ ఐపిఓ 52 రెట్లు ఓవర్‌సబ్‌స్ర్కైబ్ అయింది. కాగా మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ షేరు కూడా ఇష్యూ ధర రూ.880కన్నా 10.56 శాతం ఎక్కువ ప్రీమియంతో రూ.973 వద్ద ట్రేడ్ అయింది.

Jet Airways shares Decreased 37 percentage