Home జాతీయ వార్తలు జమ్మూ కశ్మీర్‌కు ముర్ము, లడఖ్‌కు మాథూర్

జమ్మూ కశ్మీర్‌కు ముర్ము, లడఖ్‌కు మాథూర్

Lieutenant Governors

 

కొత్త లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించిన కేంద్రం

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుతున్న జమ్మూ, కశ్మీర్. లడఖ్‌లకు కొత్త లెఫ్టెనెంట్ గవర్నర్లను కేంద్రం శుక్రవారం నియమించింది. జమ్మూ, కశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్‌గా మాజీ ఐఎఎస్ అధికారి గిరీశ్ చంద్ర ముర్ము, లడఖ్ లెఫ్టెనెంట్ గవర్నర్‌గా రాధాకృష్ణ మాథుర్‌లను నియమించింది. ప్రస్తుతం జమ్మూ, కశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్‌ను గోవా గవర్నర్‌గా బదిలీ చేసింది. దీనితో పాటుగా మిజోరం గవర్నర్‌గా శ్రీధరన్ పిళ్లైను కేంద్రం నియమించింది. జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ నెల 31న ఈ నిర్ణయం అమలులోకి రానుండడంతో ఈ నియామకాలు చేపట్టింది.

జమ్మూ, కశ్మీర్‌కు కొత్త లెఫ్టెనెంట్ గవర్నర్‌గా నియమితులైన గిరీశ్ చంద్ర ముర్ము ఆర్థిక శాఖలో వ్యయ నిర్వహణ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన 1985 బ్యాచ్‌కు చెందిన గుజరాత్ కేడర్ ఐఎఎస్ అధికారి. నరేంద్ర మోడీ గుజరాత్ సిఎంగా ఉన్న సమయంలో ముర్ము ఆయన వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పని చేశారు. ఇక లడఖ్ లెఫ్టెనెంట్ గవర్నర్‌గా నియమితులైన మాథుర్ 1977 బ్యాచ్ త్రిపుర కేడర్ ఐఎఎస్ అధికారి. ఆయన గతంలో రక్షణ శాఖ కార్యదర్శిగా, ముఖ్య సమాచార కమిషన్ (సిఐసి)గా పని చేశారు. గత ఏడాది నవంబర్‌లో ఆయన పదవీ విరమణ చేశారు.

J&K, Ladakh UTs get new Lieutenant Governors