Friday, March 29, 2024

పారిశుద్ధ్య కార్మికురాలికి జిహెచ్‌ఎంసిలో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్‌గా ఉద్యోగం

- Advertisement -
- Advertisement -

Job as an Assistant Entomologist at GHMC for sanitation worker

ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియామక పత్రాన్ని అందించిన మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎమ్మెస్సీ ఫస్ట్ క్లాస్ చదివి జీహెచ్‌ఎంసిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రజనీ సోమవారం ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ను కలిసింది. ఎమ్మెస్సీ ఫస్ట్ క్లాస్ పాసైన ఆమె ప్రస్తుతం స్వీపర్ ఉద్యోగం చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో మంత్రి కెటిఆర్ స్పందించారు. ఆమెకు జీహెచ్‌ఎంసిలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్‌గా ఉద్యోగం ఇచ్చారు. మంత్రి కెటిఆర్‌ను కలిసిన సందర్భంగా రజనీ భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. అర్భన్ డెవలప్‌మెంట్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని షేర్ చేశారు. మంత్రి కెటిఆర్ ఆ ట్వీట్‌ను కోట్ చేస్తూ, ‘విరామం లేకుండా గడుపుతున్న నాకు ఇదొక ఉత్తమమైన సందర్భం. మీరు పోషించబోయే కొత్త పాత్రకు ఇవే నా శుభాకాంక్షలని’ ట్వీట్ చేశారు.

భర్తకు గుండెజబ్బు

వరంగల్ జిల్లా పరకాల ప్రాంతానికి చెందిన రజనీది పేద కుటుంబం. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. అయినా ఆమెను చదివించారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఐచ్ఛికాంశంగా రజనీ ఎమ్మెస్సీ ఫస్ట్‌క్లాస్‌లో పాసైంది. 2013లో పిజి పూర్తయ్యాక, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్‌డికి అర్హత సాధించింది. అదే సమయంలో తల్లితండ్రులు ఆమెకు వివాహం చేయడంతో న్యాయవాది అయిన భర్తతో హైదరాబాద్ వచ్చారు. కొంతకాలం సాఫీగానే గడిచింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. కుటుంబాన్ని చూసుకుంటూనే పోటీ పరీక్షలు రాస్తూ రజనీ ఉద్యోగం కోసం ప్రయత్నించింది. 30 ఏళ్లు కూడా లేని భర్తకు గుండె జబ్బు వచ్చింది. ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించారు. ఏకంగా మూడుసార్లు స్టెంట్లు వేయాల్సి వచ్చింది. ఈ కారణంగా ఆయనకు ఉపాధి దూరమైంది. కుటుంబపోషణ భారం రజనీపై పడింది. ఇద్దరు ఆడపిల్లలు, అత్త, భర్త బాగోగులు చూసుకుంటూనే ఆమె ఉద్యోగాన్వేషణ చేశారు. ముందుగా సంతల్లో కూరగాయల వ్యాపారం చేశారు. అది కూడా కలిసి రాక గత్యంతరం లేక జీహెచ్‌ఎంసిసీలో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికురాలిగా చేరారు. రూ. పది వేల జీతంతో ఆమె ప్రస్తుతం కుటుంబాన్ని నెట్టుకొస్తుండగా మంత్రి కెటిఆర్ అందించిన ప్రోత్సాహాంతో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్‌గా ఆమె విధుల్లో చేరనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News