Home ఎడిటోరియల్ సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగ అభద్రత

సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగ అభద్రత

Job-Cartoon

 

చదువంటే ఇంజినీరింగ్, ఉద్యోగమంటే సాఫ్ట్‌వేర్ రంగమే అనుకునే రోజులివి. సుమారు 25 ఏళ్లుగా కంప్యూటర్ సర్వాధికారి అయింది. అన్నింటిని తన వశం చేసుకొని, వ్యవహారాలను సులభతరం చేసి ప్రపంచాన్ని తన బానిస చేసుకుంది. ఇలా అభివృద్ధి చెందిన దేశాల్లో వందలాదిగా పుట్టుకొచ్చిన సాఫ్ట్‌వేర్ కంపెనీలు ప్రపంచంలోని పరిశ్రమలను, వ్యాపారాలను తమగుప్పిట్లో పెట్టుకొన్నాయి. క్రమంగా సాఫ్ట్‌వేర్ రంగంలో వేలాది ఉద్యోగాల కల్పనకు అవకాశం కలిగింది. వందలాది ఇంజినీరింగ్ కాలేజీలు వెలిసి ఇంజినీర్లను ఉత్పత్తి చేసి అంగట్లో నిలబెట్టాయి. నచ్చినవారి మెడకు పలుపుతాడేసి కంపెనీలు లాక్కుపోయాయి.

ముందు రోజుల్లో ఓ మెరుపు మెరిసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పట్టభద్రుల సంఖ్య పెరగడంతో కళతప్పాయి. ప్యాకేజీలు తగ్గాయి. పనిగంటలు పెరిగాయి. కాదు పొమ్మనే రోజులు వచ్చాయి. బెంచిలు, పింక్‌స్లిప్‌లు పుట్టుకొచ్చాయి. నోటీసు పీరియడ్‌లు వచ్చాయి. బలవంతపు రాజీనామాలు, బలవంతుల బెదిరింపులు అన్నీ చోటుచేసుకున్నాయి. రోజులు బాగా గడిచినప్పుడు ఏదీ గుర్తుకు రాలేదు. నెట్టివేతలు మొదలయ్యేసరికే గందరగోళం మొదలైంది. ఉద్యోగ భద్రతకు దేశంలోని చట్టాలు పనికిరావా అనే అలోచన పుట్టుకొచ్చింది. ప్రభుత్వాలు సాఫ్ట్‌వేర్ కంపెనీల రాక, తమరాష్ట్రంలో వారు కార్యకలాపాలు నడపడమే గొప్పగా భావించక తప్పలేదు. ఉద్యోగాల కల్పనకు అది ప్రైవేటు రంగంపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. కంపెనీలు కోరిన రాయితీలు ఇచ్చివాటికి ఎర్రతివాచీ స్వాగతాలకు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఐటి కంపెనీలకు పన్ను మినహాయింపు, విద్యుత్తు సరఫరాలో రాయితీ, వాటి ఏర్పాటుకు సకల సదుపాయాలు ఇస్తున్నాయి అయితే వాటిలో పనిచేసే ఉద్యోగుల భద్రత విషయంలో, అన్వయించబడే కార్మిక చట్టాల విషయంలో మిన్నకుంటున్నాయి. వాటి రాకనే మహాభాగ్యంగా భావిస్తున్న చోట నిలదీసే ధైర్యం కొరవడింది. దీనిని ఆసరాగా తీసుకొని దేశంలో ఐటి కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఉద్యోగనియామకాల్లో కూడా కంపెనీల మాటే శిరోధార్యం.

ఇంజినీరింగ్ కాలేజీల్లో కొచ్చి కంపెనీలు ప్రాంగణ నియామకాలు నిర్వహించడం తెలిసిందే. వాటి రాక కోసం కాలేజీలు సకల మర్యాదలు చేసి తమ కాలేజీని క్యాంపస్ ప్లేస్‌మెంట్లున్న విద్యా సంస్థల జాబితాలో చేర్చుకోవాలని తహతహలాడుతాయి. ప్లేస్‌మెంట్లు ఎక్కువగా ఉంటే విద్యార్థుల నుండి ఫీజును అవి ఇష్టానుసారంగా వసూలు చేసుకోవచ్చు.అయితే ప్లేస్‌మెంటు కోసం వచ్చిన కంపెనీలు ఎంపికైన విద్యార్థులకు ఆఫర్ లెటర్ చేతిలో పెడతాయి. ఆఫర్‌లెటర్‌కు అపాయింట్‌మెంట్ లెటర్‌కు చాలా వ్యత్యాసం ఉంది. ఆఫర్ అంటే ఉద్యోగం ఖాయమని కాదు. ఒక కంపెనీ నుండి ఆఫర్ లెటర్ చేతికందిన విద్యార్ధిని కాలేజీ వాళ్లు మరో కంపెనీ పరీక్షకు అనుమతించరు. మిగతా విద్యార్థులకు కూడా అవకాశం రావాలని తద్వారా ప్లేస్‌మెంట్ అయిన విద్యార్థుల సంఖ్య పెరగాలని కాలేజీ యాజమాన్యం ఆరాటపడుతుంది. ఆఫర్‌లెటర్ ఇచ్చిన కంపెనీలు విద్యార్ధి చదువు పూర్తయ్యాక ఉద్యోగం ఈయని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లేదా మళ్లీ మళ్లీ పరీక్ష పెట్టి అనర్హులుగా ప్రకటించాయి కూడా. ఆఫర్ లెటర్‌పై కోర్టుకు పోలేరు. అపాయింట్‌మెంట్ ఆర్డర్‌పై వ్యాజ్యం వేయవచ్చు. తెలివిగా కంపెనీలు విద్యార్థుల జీవితాలతో క్రూరమైన ఆట ఆడుకుంటున్నాయి.

వచ్చిన ఉద్యోగం ఎంత కాలముంటుందోననేది మరో భయం. తొలగించిన కంపెనీపై గొడవకు దిగితే మరో కంపెనీ వద్ద ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. తొలగించిన సంస్థ అనుభవ ధ్రువీకరణ పత్రం రాబోయే ఉద్యోగానికి ఎంతో అవసరం. ఇలా ఇబ్బందులకు గురవుతున్నా వారి సమస్యలు వ్యక్తిగతమవుతున్నాయి. సాటి ఉద్యోగుల సానుభూతి మాత్రమే దొరుకుతుంది కానీ సమిష్టిగా వెళ్లి అడగడానికి ఎవరూ ముందుకురారు.సాఫ్ట్‌వేర్‌లో వస్తున్న కొత్త సాంకేతిక విధానాలు ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ ఉధృతంగా ముందుకొస్తున్నాయి. వీటి దెబ్బ చాలా మంది ఉద్యోగులపై పడనుంది.దేశంలో మిగతా ఉద్యోగులకున్నట్లు కార్మిక చట్టాల సంరక్షణ తమకెందుకు లేదనే ప్రశ్న గాలిలో దీపంగానే మిగిలిపోతోంది. తమది వేరే గ్రహమన్నట్లు తమకు ఏ దేశ చట్టాలు వర్తించవన్నట్లు వ్యవహరిస్తున్న ఐటి కంపెనీలకు కళ్లెం వేసే శక్తి ప్రభుత్వాలకు లేదు. చివరకు ఉండబట్టలేక ఉద్యోగులే ఇందుకు ఉపక్రమించారు.

2014లో టిసిఎస్ సుమారు 25000 మంది ఉద్యోగులను తొలగించింది. అదే సంవత్సరంలో 50,000 మంది కొత్త వారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ప్రతిభాధారంగా తొలగింపులు, చేర్పులు ఉండడం ఉద్యోగుల పాలిట శాపమే. దేశంలో ఉద్యోగం ఉంచి తీసేయడానికి ఓ విధానం ఉంది. చట్టాలున్నాయి. కంపెనీ లే ఆఫ్ ప్రకటించినా పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం అది నష్టాల్లో ఉండాలి. ఉద్యోగాల్లోంచి ముందు కొత్తగా చేరిన వారిని తొలగించి సీనియర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత తొలగించబడిన ఉద్యోగులకు ప్రాధాన్యతనీయాలి. వీటిలో దేనినీ పాటించకుండా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. కనీసం ఉద్యోగ పరిస్థితులనైనా చక్కదిద్దుకునే లక్షంతో 2014 డిసెంబర్‌లో చెన్నైలో కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల యూనియన్‌కు శ్రీకారం చుట్టారు. ఫోరం ఫర్ ఇన్‌ఫార్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ అని నామకరణం చేసి కార్మిక శాఖ వద్ద నమోదుకు వెళ్లారు.

ఎమ్.సతీష్ కార్యదర్శిగా కార్యవర్గం ఏర్పడింది. కర్నాటకలో బెంగళూరు లేబర్ కమిషన్ కర్నాటక ఐటి ఉద్యోగుల యూనియన్‌ను రిజిస్ట్రేషన్ చేసుకుంది. ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1947, కర్నాటక ట్రేడ్ యూనియన్ రెగులేషన్స్ యాక్ట్ 1958 దీనికి వర్తిస్తాయి. వినీత్ వాల్కట్ దీనికి కార్యదర్శి, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లలో యూనియన్లు ఏర్పడ్డాయి. సుమారు 50,000 మంది సభ్యులుగా చేరారు. ఉద్యోగులకు కనీసం చట్టాల అవగాహన అయినా ఉండాలని దాని వల్ల ముందుముందు సమిష్టి ఉద్యమానికి అవకాశం ఉంటుందని వారి ఆశ. పొడిగిస్తున్న పనివేళలపై, అనారోగ్యకర వసతుల గురించి, నైట్ షిప్ట్‌ల క్రమబద్ధత గురించి యూనియన్లు ప్రస్తుతం కంపెనీలను ప్రశ్నిస్తున్నాయి. మే 2018లో మొదటిసారిగా హైదరాబాద్‌లో సంఘం ఏర్పడింది. ఉద్యోగుల పట్ల కంపెనీల పట్ల అమానవీయ ఆచరణను గురించి ఈ సంఘాలు జాతీయ మానవ హక్కల కమిషన్‌కు, అవసరమైతే కోర్టుకు వెళుతున్నాయి.

ఫిబ్రవరి 2018లో వెరిజోన్ డాటా సర్వీసెస్ ఇండియా అనే సంస్థ ఒకేసారి 900 మందిని ఉద్యోగంలోంచి తొలగించింది. ఆ విధానాన్ని ఎత్తి చూపిస్తూ సంఘాలు, మానవ హక్కుల సంఘాల తలుపు తట్టాయి. ఉద్యోగానికి రాజీనామా చేయమని ఒత్తిడి తేవడానికి గూండాలను రప్పించారని ఫిర్యాదు చేసింది. నోటీస్ పీరియడ్‌ను లెక్కలోకి తీసుకోలేదని చెప్పంది. కంపెనీని హక్కుల సంఘం పిలిపించి గూండాల విషయంలో హెచ్చరిక చేసింది. నోటీస్ పీరియడ పూర్తయ్యేదాకా ఉద్యోగులను తీసుకుని జీతభత్యాలు ఈయమని ఆదేశించింది. టిసిఎస్‌లో తొలగించిన వారిలో మూడు నెలల గర్భం మోస్తున్న ఉద్యోగిని ఉన్నారు. ఆమె తరఫున యూనియన్ మద్రాస్ హైకోర్టులో పిటీషన్ వేసింది. కొర్టుకొచ్చిన సంస్థ అధికారులకు ఆమె గర్భిణి అన్న విషయం తెలియక తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. మెయిన్‌టెనెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ బర్త్ యాక్ట్ ప్రకారం ఆ ఉద్యోగిని తిరిగి ఉద్యోగంలోకి వెళ్లింది. సమ్మెలు, ఆందోళనలు చేయకున్నా సంఘటితంగా తమ భద్రత చట్టాలను, రాజ్యాంగమిచ్చిన హక్కులనైనా వర్తింపజేసుకొనే అవకాశం ఇలా ఐటి ఉద్యోగులకు దక్కుతుంది.

Job insecurity for Software