Home అంతర్జాతీయ వార్తలు కరోనాతో బతకడం కాదు.. చావడం నేర్చుకున్నారు

కరోనాతో బతకడం కాదు.. చావడం నేర్చుకున్నారు

Joe Biden delivers remarks on corona in delaware

 

ట్రంప్‌పై ఎదురుదాడికి దిగిన బిడెన్

వాషింగ్టన్ : అమెరికా ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేనంతగా తీవ్రసంక్షోభాన్ని ఎదుర్కొంటోందని జో బిడెన్ విమర్శించారు. దేశ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం స్వరాష్ట్రం డెలావారేలో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా తీవ్రతను ప్రస్తావించారు. ప్రజలు కరోనా వైరస్‌తో సహజీవనం ఎలా అనేది నేర్చుకోవడం లేదని, ముంచుకొచ్చిపడుతున్న కరోనాకాటుతో ఏ విధంగా చనిపోవాలనేది తెలుసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ మహమ్మారి దేశాన్ని చాలా తీవ్రస్థాయిలో దెబ్బతీసిందని తెలిపారు. ఇప్పటికీ వైరస్ తగ్గుముఖం పడుతున్న దాఖలాలు ఏమీ లేవని అన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 2,20,000 మంది అమెరికన్లు కరోనాతో మృతి చెందారని , ఇది ప్రపంచవ్యాప్త కరోనా మరణాల శాతంలో అత్యధికం అన్నారు. ఇక్కడ జరిగిన ఎన్నికల సభలో బిడెన్ ప్రధానంగా దేశంలో కరోనా పరిస్థితి గురించే ఎక్కువగా మాట్లాడారు.

దేశాధ్యక్షులుగా ఉన్న ట్రంప్ పాలసీలతోనే వైరస్ శీఘ్రగతిన వ్యాపించిందని, దీనితో అత్యధిక మరణాలే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందని విశ్లేషించారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన మాటల్లోనే అమెరికన్లు అంతా కరోనా వైరస్‌తో సహజీవనం చేయకతప్పదని డిబెట్‌లో తెలిపారని, అయితే ఇక్కడ తాను ఓ సవరణ చేశానని కలిసి జీవించడం కాదు కరోనాతో మరణించడం గురించి తెలుసుకుంటున్నట్లుగా ఉందని చెప్పానని అన్నారు. ఇప్పటికే కరోనా కరకు పరిస్థితి ఏర్పడిందని, రాబోయే చలికాలం మరింతగా దారుణ పరిస్థితి ఉంటుందని బిడెన్ హెచ్చరించారు. మరో రెండు మూడు లక్షల మంది కరోనాతో చనిపొయ్యే అవకాశం ఉందని ఇటీవలే కొలంబియా యూనివర్శిటీ తాజా అధ్యయనంలో తెలిపిందన్నారు. అన్ని రాష్ట్రాలలో వైరస్ ప్రబలుతోందని, తగ్గుముఖం దాఖలాలు లేవని అన్నారు. ఇప్పటికే దేశంలో నాలుగుకోట్ల మందికి పైగా వైరస్ బారిన పడ్డారని అన్నారు.

కరోనా విషయంలో తానేమీ చేయలేకపోతున్నట్లు ట్రంప్ బహిరంగంగానే అంగీకరించారని బిడెన్ గుర్తుచేశారు. కరోనావైరస్‌తో తలపడే ఎటవంటి విధానం ట్రంప్ వద్ద లేదని, ఆయన ఎంతకాలం అధ్యక్ష పదవిలో ఉంటారో అంతగా అరాచకవాది అవుతారని తేల్చిచెప్పారు. ట్రంప్ అధికార యంత్రాంగ వైఫల్యాల మధ్య మనం ఎంతకాలం ఈ బాదరబందీల బందీఖానాలో ఉండాలని ప్రశ్నించారు. వారి వైఫల్యం మనకు సంకటంగా మారిందన్నారు. మనం ఇప్పటి ఈ పంథానువీడి వేరే విధంగా వ్యవహరించాల్సి ఉందని, ఇంతవరకూ అమెరికన్లు ఏ విధంగా ఉంటూ వచ్చారో అదే బాటన నడిస్తే చాలునని తెలిపారు. ఈ విధంగా మనం చేసి చూపించవచ్చునని అన్నారు. మనమంతా సమిష్టిగా ధృఢసంకల్పంతో సవాళ్లను ఎదుర్కొందామని పిలుపు నిచ్చారు.

Joe Biden delivers remarks on corona in delaware