Home ఆఫ్ బీట్ ఏనాటి జోగిని ఈనాడు కూడా..?

ఏనాటి జోగిని ఈనాడు కూడా..?

Jogini

‘మెడలో ఆ గవ్వల గొలుసులు ఎందుకు? తీసెయచ్చు కదా!’ అంటే, ‘అమ్మో! తీస్తే ఎల్లమ్మ తల్లి మాకు రోగాలు తెప్పిస్తుంది. మేం చచ్చిపోతాం.’ ఇదీ ఇప్పుడు కూడా జోగినులు ఇచ్చిన సమాధానం. మూఢాచారాల మరుగులో మగ్గిపోతున్న జోగిని వ్యవస్థ ఇంకా సమాజంలో కొనసాగడం తలదించుకోవాల్సిన విషమయే. రెండు వేల సంవత్సరాల క్రితం నుంచే జోగిని వ్యవస్థ ఉంది. 

జోగిని వ్యవస్థ అంటే అమ్మాయి చిన్నప్పుడు, ఆమెకు అర్థం చేసుకునే వయసులో చేసే సంప్రదాయం. ముందామె చనిపోతే ఆ కుటుంబంలో మళ్లీ ఒక జోగిని చెయ్యాలె. వాళ్లింట్లో అందరూ ఆడపిల్లలే ఉండి మగపిల్లలు లేకపోతే ఆడపిల్లని దేవునికిచ్చి పెళ్లి చేస్తరు. కొన్ని ఇళ్లల్లో సాంప్రదాయంగా జోగిని వ్యవస్థ ఉందని చేస్తరు. వేరే జోగిని ఉండి, ఆమె చనిపోతే ఆమె స్థానంలో ఇంకొకామెను జోగిని చెయ్యకపోతే నష్టం వస్తుందని చేస్తరు. లేకపోతే ఆ ఊరికి ఏమన్నా జరుగుతదని కూడా చేస్తరు. ఆడపిల్లకి చిన్నప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే దేవునికాడ తీసుకుని పోయి మొక్కుకుని వస్తే ఆ పిల్ల పెద్దైన తర్వాత ఆ ఎల్లమ్మకిడుస్తనని కూడా మొక్కుకుంటరు. అట్ల రకరకాల ఉద్దేశ్యాల తోని జోగినిగా చేస్తరు.

పేరు ఏదయితేనేం.. జీవితాలు ఒకటే
తరమెక్కడం అంటే వేపాకుతో చీర తయారు చేసి నగ్నంగా గుడి ముందర జోగినిని నుంచోబెట్టి కడతరు. దాన్ని పుట్టం కట్టడం అంటరు. అది ఫిబ్రవరిలో వచ్చే ఎల్లమ్మ జాతరకి చేస్తరు. అది చాలా ఏళ్ల నుంచి వస్తున్న ఆచారం. వేపాకు కొమ్మలు తీసుకుని తాడుతోన కట్టేసి కేవలం ముందు వైపే కట్టి నగ్నంగా గుడి చుట్టు తిప్పుతరు. వేపాకు చీర ఐదు వేలుంటది. కుల పెద్దలతో కలిసి పంచాంగం చూస్తరు. అన్నీ సాంప్రదాయాలు చేస్తరు. ఈ జిల్లాలో ఐదువేల మంది అట్లాంటి వాళ్లుంటరు. ఎల్లమ్మ దగ్గరకు తీసుకపోయి పెళ్లి తంతు ఎట్ల ఉంటదో అట్లనే ఉంటది. తాళి ఎవరైనా కడతారు. పూజర్లు కడతరు. ఆడవాళ్లు కడతరు. మేనబావ తాళి కడతడు. పాత జోగిని, కొత్త జోగినికి తాళి కడతరు. రకరకాల పద్ధతులు. ఎల్లమ్మ దగ్గర పెళ్లిచేసేవాళ్లనంతా జోగిని, అంటరు. కురుమూర్తి దేవుని దగ్గర, పడమటి హనుమక్క దగ్గర చేసేవాళ్లని బస్విని అంటరు. మేనబావతో పెళ్లి చేస్తే ఇంటికి చేసుకున్నరు అంటరు. అందరి జీవితమూ ఒకటే. వీళ్లకి భర్త ఉండడు. దేవుని పేరు మీదనే జీవితాంతం ఉంటరు.

రోగాలు వచ్చినంత ఈజీగా పోవు కదా!
అక్కడ సొసైటిలోనే ఊరి పెద్దలు, డబ్బున్నవారు, ఆమెకిష్టం లేకపోయినా ఎవరైనా వీళ్లని వాడుకునే ఊరుమ్మడి ఆస్తిగా ఉంటరు. తండ్రి ఎవరో తెలీదు కాని వీళ్లకి పిల్లలు పుడతరు. అందరికీ పిల్లలుంటరు. వాళ్లు తండ్రెవరో చెప్పగలుగుతారా. బడిలో తండ్రి పేరు అడుగుతరు. మరి జోగిని పిల్లలు తండ్రి పేరు ఏమని చెప్తరు? మొన్నీమధ్య వరకు జోగిని పిల్లల్ని బడిలో జాయిన్ చేసుకునేందుకు మస్తు ఇబ్బంది పడినం. యాభైమంది జోగిని పిల్లలు కార్పొరేటు విద్యకు సెలెక్ట్ అయినరు. తండ్రి పేరు కావాలని వాళ్లు తప్పనిసరి చేస్తే అప్పుడు దమయంతి అనే కలెక్టర్ ఉండె. ప్రపోజల్ పెట్టి ఒక జీఓ తెప్పించింది. అంత పోరాటం చేస్తే ఇప్పుడు తల్లి పేరు రాస్తున్నరు. జోగినిలకు హెచ్‌ఐవి, టిబి లాటి రోగాలెన్నో వస్తయ్. నలభై ఐదు మంది మా ముందే మా కళ్ల ముందే చచ్చిపోయిన్రు. ఎయిడ్స్ వచ్చిన తర్వాత తిననీకి తిండి కావాలె. వచ్చేటప్పుడు రోగాలు ఈజీగా వస్తున్నయ్. పోయేటప్పుడు ఈజీగా పోవు కదా.

అసభ్యకరమైన భాషతో తిడతరు
జోగినిలు పాత మట్టి ఇళ్లలో దుర్భర జీవితాలు గడుపుతరు. వాళ్లకి, చిన్నప్పుడు జోగిని చేసేటప్పుడే, శుక్రవారం, మంగళవారం బిచ్చమెత్తుకోవాల. ఇల్లిల్లు తిరిగి అడుక్కోవాల. అడుక్కోని తింటేనే మంచిగ ఉంటది. లేకపోతే చెడు జరుగుతది అని చెప్తరు. జోగిని అయిన తర్వాత గ్రామదేవతల పూజ చేయడానికి పోతరు. ఊళ్లో పెళ్లిళ్లు జరిగితే సాక అని ఉంటది. దానికి వాడుకుంటరు. బుట్ట, కుండ తీసుకుని పెళ్లి దగ్గరకి, చావు దగ్గరికి వెళ్తరు. పెద్దకులం వాళ్లు చేసిన అరాచకం ఇది. పిల్లలకు సంబంధాలు వచ్చినప్పుడు తండ్రి ప్రస్తావన వస్తుంది. ఏం పని చేస్తాడు అని అడిగితే ఎవరి పేరు చెప్పాలి? దేవుడి పేరు చెప్పచ్చా. ఎనభైశాతం మాదిగ కులంలోనే జోగిని వ్యవస్థ ఉంది. బిసిలు ఒక ఇరవైశాతం ఉంటరు. పెద్ద కులంలో అసలు ఈ వ్యవస్థ లేదు. మగపిల్లాడే పుట్టాలి. ఆడపిల్ల పుడితే మల్ల జోగిని చెయ్యాల. అయినా మగపిల్లాడికైనా పెళ్లి చేయడం సమస్యనే. సొసైటీలో చాలా చిన్న చూపు చూస్తారు. మర్యాద, గౌరవం ఏం ఉండవు. వాళ్ల గురించి చాలా అసభ్యకరమైన భాషతో వాళ్లని తిడతారు. ఇప్పటి తరం అమ్మాయిలు కూడా జోగినిలుగా ఉన్నారు. ఇంకా ఈ వ్యవస్థ నడుస్తూనే ఉంది.

ముసలిగయిన తర్వాత ముట్టుకోరా..
సిడె అనే ఒక ఆచారం పోలేపల్లి జాతరలో జరుగుతది. అది రెండు కంబాలంత కట్టెకు జోగినిని కట్టి తిప్పుతరు గుడి చుట్టూ. ఆమె పసుపు, పూలు, గవ్వలు తీసి మంది మీనకి ఇసరాలె. జనానికి మంచి జరుగుతదని నమ్మకం. ఆ గవ్వలు దొరికించుకోవడం కోసం ఆ ఊరంతా పాకులాడతరు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చినోళ్లు కూడ పాకులాడతరు. అరవై సంవత్సరాల నుంచి ఆమె దేవుడిగా మొక్కినామె ఈరోజు ఆ ఊళ్లో అడక్క తింటుంది. దేవుడిప్పుడు ఎక్కడికిపోయిండు? అంటే వయసులో ఉన్నప్పుడు దేవుళ్లకి, సమాజంకి ఉపయోగపడతరు. ఆమె కాళ్లు మొక్కుతరు. ముసలిగయిన తర్వాత ఆమెనెవరూ ముట్టుకోరంటే అదెట్లా కరెక్ట్ అయితది.

జోగిని అంటే చులకన
జాతరల్లో ఏనుగుని తీసుకరావడానికి నలబైవేల రూపాయలు కిరాయి కడతరు. మనిషిని తిప్పితే రెండు వందలిస్తరు సంవత్సరానికి. మరి జోగినిలంటే అంత చులకనా. బొమ్మరాసుపల్లి మండల్‌లో పోలేపల్లి, ఈ జిల్లాలో జాతర్లు చాలా ఉన్నయ్. పోలేపల్లి ఎల్లమ్మ జాతర, గురుమూర్తి జాతర, పడమటి ఆంజనేయస్వామి జాతర, కరుకులమ్మ జాతర. ఇట్ల జాతరలకి, జోగినిలకి సంబంధం. అక్కడ కార్యక్రమాలు చెయ్యడానికి. పెద్ద గుడయితేనేమో బాపనాయన్ని పెడతరు. చిన్న గుడి అయితే జోగోళ్లే పూజలు చేసుకుంటరు. మేం ఏం అంటం అంటే నగ్నంగా వేపాకు కట్టే కన్నా ఆత్మగౌరవంతో ఏమన్నా చేసుకో. పోరాటం చేస్తున్నందుకు మాకు సపోర్ట్ చెయ్యాల అందరు అని అడుగుతం.

హైదరాబాద్‌లో కవితమ్మని కలుద్దామన్నా
గతంలో జోగిని ల కందరికీ విడో పెన్షన్ వచ్చేది. తెలంగాణ వచ్చిన తర్వాత సమగ్ర సర్వే జరిగింది. భర్త ఉంటే భర్త పేరు చెప్తరు. మరి జోగిని ఏం చెప్పాలె? ఎల్లమ్మకు చేసినరు, మల్లయ్యకు చేసినరు, కరుపూరు మంత్రయ్యకు చేసినరు, అని రికార్డులో రాసుకున్నరు. దాంతో మొత్తం పెన్షన్లు ఆగిపోయినయ్. దేవుడు చనిపోయినట్టు సర్టిఫికేటు తెమ్మంటరు. ఒంటరి స్త్రీలు, జోగినిలు, ఆదివాసీలకి కలిపి ఒక పేరు పెట్టి పెన్షన్ ఇస్తామని రెండేండ్ల ముందు చెప్పిన్రు. ఇప్పటివరకు ఏది లేదు. హైదరాబాద్‌లో కవితమ్మని కలుద్దామన్నా మాకు ఇంతమందికి చార్జీలు పెట్టుకుని, ఆడ ఏడ ఉంటం. ఎవరిని కలుస్తరు?వీళ్లని తీసుకుని ట్రెయిన్లలో పోతే ఎట్లుంటది వాళ్ల పరిస్థితి? ముఖ్యమంత్రి గారికి, కవితమ్మకి ఇవ్వని పేపర్ లేదు. వాళ్లు వన్ మాన్ కమీషన్ ఏసిన్రు. 2009 లో కమిషన్ ఏస్తే 2013 లో కమిషన్ రిపోర్టు సబ్‌మిట్ చేసింది గవర్నమెంటు. మళ్లీ దాన్ని బయటకు తియ్యాల్సి ఉంది. జోగినులు నిరంతరం వాళ్లకి గుర్తు చేస్తూనే ఉన్నరు. వాళ్లు పోయి ఎవరినడగాలి? సెక్రటేరియట్లో, పర్సనల్‌గా కూడ ఇచ్చినం. జోగిని వ్యవస్థ బాగుందని ఎవరిని అడిగిన బాలేదనే చెప్తరు. అవమానాలు భరించలేక అందరూ విసిగిపోయిన్రు.

బంగారు తెలంగాణలో స్థానం కోసం
కర్నాటకలో జోగిని కార్పొరేషనే ఉంది. నిర్మూలన చెయ్యాలని. వాళ్లకి రెండు వేల పెన్షన్ ఇస్తున్నరు. ఇళ్లు ఇవ్వాలని చూస్తున్నరు. ప్రతి కుటుంబానికి యాభై వేలు లోనిచ్చి ఆదుకున్నరు. అక్కడ జీఓ ఉంది. సెపరేట్ వింగ్ ఉంది. ఇప్పుడు అక్కడ జోగిని వ్యవస్థ ఆగిపోతుంది. ఎందుకంటే అందరూ కలిసికట్టుగా దీనిపై పని చేస్తున్నరు. అక్కడ ప్రత్యేక కార్పొరేషన్ పెట్టినరు. తెలంగాణ మూమెంట్‌లో చాలామంది జోగినిలు పాల్గొన్నరు.

బంగారు తెలంగాణలో మేము స్థానం
సంపాయించుకుంటమనుకున్నరు. కాని ఏం లాభం లేదు. ముసలామె అయినంక పెన్షన్ ఇవ్వడానికి కూడ అరవై ఐదు దాటాలె. అప్పటిదంక ఏడ ఉంటరు మావోల్లు. సచ్చే పోతరు. సచ్చిపోతే పందిరేస్తరు. డెకరేషన్ చేస్తరు. అన్నం పెడ్తరు అందరికీ. ఆమె కొడుకు బోనం ఎత్తుతడు. మల్ల ఇంట్లో కొడుకు పెండ్లానికి చనిపోయిన జోగిని వేసుకున్న పూసలు, గవ్వలు గొలుసులు అన్నీ ఆమె మెడలో ఏస్తరు. కోడలెయ్యాలె. లేకుంటె తమ్ముని పెండ్లం ఎయ్యాలె. మళ్లీ వాళ్లు తరమెక్కాలి. ఆమె తరమెక్కాలి అంటె మేకను కొనాలె. కమిటీవాళ్లను తీసకొచ్చి, పాటలు పాడిచ్చి, పూనకం తెప్పిచ్చి, ఆమెకి కడతరు. వేపాకు చీర కట్టి నగ్నంగ గుడి చుట్టు తిరగాలె. మళ్లీ వాళ్లు కూడ శుక్రవారం, మంగళవారం ఇళ్లెంట అడుక్కోవాలె. అట్ల జోగిని సంప్రదాయాన్ని తరతరాలు కొనసాగిస్తరు.

తరమెక్కకపోతే మంచి జరగదు
ఇంకా సంప్రదాయం జరుపుతునే ఉన్నరు ఇప్పడున్న జోగినిలు. కొత్త జోగిని రాకుండ చూస్తున్నరు అంతే కాని, సంప్రదాయం విడవడానికి భయం. మంచి జరగదని. తరమెక్కకపోతే అయ్యో! ఆ ఇంట్లో పిల్లలే బతకరు అంటరు. అట్ల తరతరాల సంప్రదాయం. అవి ఆమె బతికుండగ తియ్యదు. తీస్తే కండ్లు పోతయ్, గడ్డలొస్తయ్, పుండ్లు పడతయ్. ఎల్లమ్మ కల్లో కన్పించి అట్ల చేస్త అని చెప్తదట వాళ్లకి. అని నమ్ముతరు. వీళ్లు బతికున్నంత వరకు నిండు ముత్తయిదువులు. మేం ఇప్పుడు ఏమని కొట్లాడుతున్నమంటే. ఇది నెమ్మదిగ పోవాలని చెప్పి, తెల్లచీర, ఎర్ర చీర కట్టుకోండమ్మ, నగ్నంగ వేపాకు కట్టుకోవద్దని చెప్తే ఇప్పుడు ఎనభైశాతం తగ్గింది. వేపాకు చీర ఐదు వేలకు ఒక చీర. పుట్టం కడుతుంటె, ఆమె వెనక వచ్చేవాళ్లకి జాకెట్టు ముక్కలు పెట్టాలె. తిండి పెట్టాలె. వీటన్నిటికీ మళ్లీ చాలా ఖర్చు ఉంటుంది. దానికి అప్పు చేస్తరు. దానికి జీవితాంతం వడ్డీలు కడతరు. అందరి మైండ్లలో మనుధర్మశాస్త్రం నిండిపోయింది.

జోగిని వ్యవస్థలో చాలా తులుంటయ్
ఒకాయన రైల్వే స్టేషన్ మాస్టర్ ఆయన. భార్యను తీసుకొచ్చి ఎల్లమ్మకు పుట్టం కట్టిచ్చిండు. ఆయన బిడ్డలు ఎమ్ టెక్‌లు చదివారు. వాళ్లని మట్టిలో దొర్లాడిపిచ్చి భార్యకు పుట్టం కట్టిండు. చదువుకున్నవాళ్లే అట్లుంటె, వీళ్లు చదువులేని వాళ్లు ఏం చేస్తరు? పోలేపల్లి దగ్గరయితే ఎవరికయినా ఆరోగ్యం బాగలేకపోతే వెళ్లి ఎల్లమ్మకి ఇడిచొస్తరు. ఆమె తెల్ల జాకెటెయ్యాలె. భార్య, భర్త దూరంగ ఉండాలె. ఇట్ల చాల నియమాలుంటయ్. వాస్తవానికి జోగిని చాలా పెద్ద సబ్జెక్టు.

ధన్వాడలో పొడుగ్గా ఉందని జోగినిగ ఇడిచిన్రు.
పొట్టిగుందని ఒకళ్లు ఇడిచిపెడతరు. అమ్మాయి పొడుగు, పొట్టి లేకుండా సమంగా ఉండాలె. తెల్లగా ఉండాలె అని చూస్తరు ఇళ్లల్లో.

 జోగిని వ్యవస్థ మీదనే  నా తిరుగుబాటు: మా ఇంట్లో మా అవ్వ జోగిని. మా అమ్మ జోగిని. 1985లో నన్ను కూడా పన్నెండేళ్ల పిల్లగా ఉన్నప్పుడు జోగినిగానే చేశారు. మా అమ్మ నాన్న పరిస్థితి బాలేదు. మా అక్క వికలంగురాలు. అందుకే వలసకు ముంబయ్ వెళ్లిపోయినం మట్టిపని చేయడానికి. నేను చాలా చిన్న పిల్లని. అయినా సొసైటి ఏం అనుకుంటుంది. దేవునికి పెళ్లి చేశారు. అదే పెళ్లయితే భర్త వెంట వస్తడు. కాని నావెంట దేవుడు రాడు కదా. ఎవరైనా వాడుకోవచ్చు అనే ఉద్దేశ్యమే ఉండేది. ముంబయ్‌లో కూడా మస్తు కష్టాలు పడిన. ఇక్కడ జోగినిలకు ఇళ్లిస్తారంటే మళ్లీ ఇక్కడికి వచ్చినం. దానికి వ్యతిరేకంగా నేను 95 లో పెళ్లి చేసుకున్నాను. అప్పటికే నాకు ఇద్దరు పిల్లలున్నారు. నేను పెళ్లి చేసుకుంటుంటే చాలామంది వద్దన్నారు. ఎందుకు వద్దంటున్నారో అడిగాను. జోగినిగా అవమానాలు భరించలేక మా ఊరి అబాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటే, మాకు, మా ఊరికి చెడు జరుగుతుందని నాతో అంతా గొడవ పెడుతుంటే ఆర్‌డిఓ అనితా రామచంద్రన్, ‘అందరినీ జైల్లో పెట్టిస్తా. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంటే సపోర్ట్ చెయ్యట్లేదు. ’అని వారిని హెచ్చరించి అక్కడే నాకు సోషల్ మ్యారేజ్ చేశారు.

అప్పుడే తిరుగుబాటు ఆరంభించాలని నిర్ణయించుకున్నా. తర్వాత మా ఆయన హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతే జోగిని పెళ్లి చేసుకున్నందుకు చనిపోయిండని అన్నరు. చాలా అవమానాలు, బాధలు పడ్డా నేను. అందుకే జోగిని వ్యవస్థ లేకుండా చెయ్యాలని అప్పటి నుంచి నేను చాలా ప్రయత్నం చేస్తున్న. సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్, జెనీవా సదస్సులల్లో, డబ్లు ఎస్ ఎఫ్, ఎస్ ఎఫ్‌లలో కూడా నేను పాల్గొన్నా. దేవదాసీ వ్యవస్థ మీదనే మాట్లాడిన. వేపాకు చీర ఆచారం మేం ఇప్పుడు చాలా తగ్గించినం. అప్పట్లో అయితే గుడి నిండ వేపాకే ఉండేది. మేం అక్కడ క్యాంప్ ఆఫీసు పెట్టి, అవేర్‌నెస్ ఇప్పించినం. మేం ఆరువందలమంది జోగినిల కేస్‌స్టడీస్ చేస్తే ముస్లిమ్‌లకు సంబంధించిన లింక్‌లు చాలా దొరికాయి. నైజాం పరిపాలనలో ఉన్నప్పుడు చాలామంది జోగినిలు తయారయ్యారు. ఒకామె చెప్పింది. ‘ఒక ముస్లిం ఆయన మమ్మల్ని బాగా చూసేవాడు. డబ్బులిచ్చేవాడు. అది చూసి ఒక కుటుంబం బాగుంటే వెయ్యిమంది తయారయినరు.’ అప్పట్లో పొలంలో జోగిని పోయి గింజలు తీసుకుంటే ఏం అనేవారు కాదు. ఇప్పుడు ఇంటింటికి తిప్పి ఒక రూపాయి, లేదా బియ్యం వేస్తరు.

జోగిని, దేవదాసి, బస్వమ్మ, మాతమ్మ, దేవుడమ్మ ఇలాటివీన్న ఒకేరకమైనవి. ఆంధ్రలో మాతమ్మ అంటారు. మెదక్‌లో దేవుడమ్మ అంటారు. ఒక్కో చోట ఒక్కో పేరు కాని వ్యవస్థ మొత్తం ఒకటే. దేవుళ్లయితే మాకు భర్తలు కారు కదా. చాలామందిని ఆపగలిగినం. ఇంత వరకు ఇక్కడ మేం ఆపకపోతే ఇంకో పది ఇరవై జోగిని పెళ్లిళ్లు జరిగేవి. అయినా ఇంకా అయితున్నయ్. గతంలో దేవరకద్ర మండలంలో కూడ ఒక పాప టెన్త్ క్లాస్ పాపకు సర్పంచ్ తాళి కట్టిండు. ఆయన్ని జైల్లో పెట్టిచ్చినం. పూజారి కూడా కడుతుంటాడు. కాని పూజారి పేరు ఎవరు చెప్తరు? అతని పేరు బయటకి రాదు. ఊరి బయట చాన రాత్రి పూట జరిగింది. అక్కడ యువకులు చానమంది వద్దని వ్యతిరేకించిన్రు. నేను హైదరాబాద్ మీటింగ్‌లో ఉంటే తెలిసి వచ్చి గద్దెగూడం సర్పంచ్ సహకారంతో తల్లి, తండ్రి మీన కేసు పెట్టినం. చట్టం అట్లుంది. ఎమ్ ఆర్ ఓ మీద, సర్పంచ్, ఎస్‌ఐ మీద కేసు పెట్టేట్లు ఉండాలి కాని లేదు. కేవలం కుటుంబ సభ్యులు, సర్పంచ్ మీద మాత్రమే కేసు పెట్టగలం. అక్కడున్న ప్రజాప్రతినిధులను దీనికి బాధ్యులను చెయ్యాలి. అంతేకాని చదువురాని వీరి మీద కాదు కదా. ఇంకో పద్ధతి ఏంటంటే, మేనబావతో అంటే ముసలాయన ఉంటడు. ఆ పిల్లకొచ్చి తాళి కడతడు. అరవై సంవత్సరాలాయన, పది సంవత్సరాల పిల్లని పెళ్లి చేసుకుంటే ప్రేమించుకున్నరని పోలీసోళ్లు అంటరు కొన్నిసార్లు మేం కేసు పెట్టినప్పుడు. అది సరియైనదేనా! మన హిందూ సాంప్రదాయం ప్రకారం పదమూడు సంవత్సరాల కంటే ఎక్కువ తేడా ఉండరాదు.

ఇటువంటి పెళ్లినెట్ల ప్రోత్సహిస్తరు. ఎవరన్నా డబ్బులు తినిపిస్తే పోలీసోళ్లు కూడా రివర్స్ అయి మాట్లాడతరు. ఒక పూజారి మీన కూడ నేను కేసు ఫైల్ చేసిన. కోర్టుకి తిరిగుతున్నడట్లే. అప్పుడు మీనా కుమారి, ఎస్‌పిని, కలెక్టర్లని అందర్నీ పట్టుకుని మేం ఆ సిడెని కూడా రద్దు చేసినం. మేం ఎక్కడైతే జోగిని వ్యవస్థ మీద ప్రచారం చేస్తమో అక్కడకొచ్చి మామీద దాడి చేస్తరు. మాకు అటువంటి హింసలు కూడా జరుగుతయ్. ఇది రద్దు చేస్తే ఆడవాళ్లని వాడుకునేవాళ్లకి అన్యాయం జరుగుతది. అందుకే జరగనివ్వరు. వాళ్లు కూడా పెళ్లి చేసుకుని సంసార జీవనం గడుపుతారు కదా. పుణ్యానికి ఆడోళ్లు దొరికారని వాళ్లకి పిల్లలు పుట్టించి పోతే వీళ్ల జీవితాలెట్ల? ఈ వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తుంటె పెద్ద కులాల వాళ్లు మామీద దాడులు చేయడానికి వచ్చిరి. మమ్మల్ని చంపడానికి వచ్చిరి. ఎన్నో హింసలు ఎదుర్కున్నం. ఇరవై ఏళ్ల నుంచి కొట్లాడినం. మమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తలేరు.