Home అంతర్జాతీయ వార్తలు టాటాకు నానా తంటాలు

టాటాకు నానా తంటాలు

Boris Johnson

 

బ్రెగ్జిట్‌పై బ్రిటన్ ప్రధానికి చిక్కుముళ్లు
సంతకం లేకుండా ఇయూకు లేఖ
డీల్ కోసం సంతకంతో ఓ లెటర్

లండన్: బ్రెగ్జిట్‌తో బ్రిటన్‌లో తిరిగి రాజకీయ సంక్షోభం తలెత్తింది. యూరోపియన్ యూనియన్ (ఇయూ)తో తెగతెంపుల వ్యవహారం ప్రఢాని బోరిస్ జాన్సన్‌కు తలపోటును తెప్పించింది. బెగ్జిట్ గడువును పెంచాలని ప్రధాని జాన్సన్ ఇయూ అధికార మండలికి సంతకం లేకుండా లేఖ రాయడంపై ప్రతిపక్షాలు ఆదివారం విరుచుకుపడ్డాయి. ఇది చిన్న పిల్లల చేష్టగా ఉందని వారు మండిపడ్డారు. బ్రెగ్జిట్‌కు మరో మూడు నెలల గడువు కోసం ఆయన అయిష్టంగానే ఇయూ వేదికకు సంతకం చేయకుండా బ్రిటన్ తరఫున ఒక లేఖ పంపించారు. ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని , ఆయన ఆ తరువాత విమర్శించారు. బ్రెగ్జిట్ ఖరారుకు ఉన్న గడువు ఈ నెల 31వ తేదీతో ముగుస్తుంది. తాను ఇయూతో కుదుర్చుకున్న బ్రెగ్జిట్ డీల్‌ను ప్రధాని శనివారం అనుకున్నట్లుగానే పార్లమెంట్ ముందుంచారు.

అయితే దీని ఆమోదానికి ఓటింగ్ బదులుగా రాజకీయ పార్టీలు బ్రెగ్జిట్ తుది గడువును పెంచాలని పేర్కొంటూ చేసిన సవరణలకు ఆమోదం తెలిపారు. దీనితో జాన్సన్ బ్రెగ్జిట్ ఆశలకు బ్రేక్ పడింది. తాను బ్రెగ్జిట్ గడువును పొడిగించాలని కోరనే కోరబోనని, దీనికి బదులుగా తాను గుంటలో పడి చావనైనా చస్తానని ఆయన తొలుత మొండికేశారు. మరోవైపు హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రధాని ఇక బ్రెగ్జిట్ పొడిగింపునకు దిగబోరనే తీర్మానానికి అనుకూలంగా ఓట్లు పడ్డాయి. అయితే గత నెలలో ఎంపిల ఆమోదం పొందిన బెన్ యాక్ట్‌తో, మిత్రపక్షాల ఎంపిలు, ప్రతిపక్షాల మద్దతుతో బ్రెగ్జిట్ కాల పరిమితి పొడిగింపునకు పట్టుపట్టడం, ఇందుకు అనుకూలంగా పార్లమెంట్‌లో ఆమోదం దక్కించుకోవడంతో ఇప్పుడు అనివార్యంగా ప్రధాని ఇందుకు సంబంధించిన లేఖను పంపించాల్సి వచ్చింది. దీని మేరకు బ్రెగ్జిట్‌ను 2020 జనవరి 31 వరకూ పొడిగించాల్సి ఉంటుంది.

ఈలోగా అన్ని పక్షాలూ బ్రెగ్జిట్‌కు అనుకూలంగా రాజీకి వస్తే ఈ గడువు వర్తించకుండానే బ్రెగ్జిట్ అమలు కావడానికి వీలేర్పడుతుంది. ప్రధాని సంతకం లేకుండా పంపిన లేఖను ఇయూ కౌన్సిల్ అధ్యక్షులు డోనాల్డ్ టస్క్‌కు శనివారం రాత్రి హుటాహుటిన పంపించారు. అయితే దీనికే జతచేసిన సంతకంతో కూడిన లేఖలో ప్రధాని స్వయంగా ఈ నెల 31వ తేదీ తుదిగడువుకు కట్టుబడి ఉంటామని తెలిపారు. ఇందుకు అనుగుణంగా పార్లమెంట్ ఆమోదం పొందేందుకు వచ్చే వారం ప్రయత్నిస్తామని తెలిపారు.ఇక బ్రిటన్ నుంచి అందిన బ్రెగ్జిట్ గడువు పొడిగింపు అభ్యర్థనపై పరిశీలిస్తున్నామని ఇయూ కౌన్సిల్ వర్గాలు ఆదివారం తెలిపాయి.

సభా ధిక్కారం సహించం: లేబర్ పార్టీ
మరో వైపు బ్రిటన్ ప్రధాని చర్యలు మరింత గందరగోళానికి దారితీస్తున్నాయని ప్రతిపక్ష లేబర్ పార్టీ విమర్శించింది. బ్రెగ్జిట్ గురించి ప్రధాని సంతకం లేకుండా లేఖ పంపించడం పార్లమెంట్‌ను కించపర్చడమే అవుతుందని, దీనికి ప్రతిఫలంగా ఆయన పార్లమెంట్ ధిక్కారం పరిధిలోకి వస్తారని, న్యాయస్థానాల నుంచి కూడా చర్యలు తప్పవని లేబర్ పార్టీ హెచ్చరించింది.

Johnson sends EU unsigned letter seeking Brexit delay