Home కలం అక్కినేని జీవన సాఫల్య అవార్డుకు భగీరథ ఎంపిక

అక్కినేని జీవన సాఫల్య అవార్డుకు భగీరథ ఎంపిక

Journalist Bhagiratha select for Akkineni Life Achievement Award

హైదరాబాద్: పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరావు పేరిట శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసిన ఉత్తమ పాత్రికేయ జీవన సాఫల్య పురస్కారానికి ఈ సంవత్సరం సీనియర్ పాత్రికేయుడు భగీరథను ఎంపిక చేశామని అవార్డు కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ తెలిపారు. శృతిలయ ఆర్ట్స్ అకాడమీ గత రెండు దశాబ్దాలుగా ప్రతి నెల హైదరాబాద్ రవీంద్రభారతిలో సినీ సంగీత విభావరిలు నిర్వహిస్తూ ఎందరో సినీ ప్రముఖులను, సేవా మూర్తులను సత్కరిస్తూ యువతరానికి స్ఫూర్తినిస్తోందని, ఈ సంస్థ నిర్వాహకురాలు, గాయకురాలు ఆమని తెలంగాణ ప్రభుత్వ బిసి సంక్షేమ శాఖలో ఉన్నతాధికారిణిగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.

2001వ సంవత్సరంలో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంస్థను డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు రవీంద్రభారతిలో ప్రారంభించారని, అందుచేత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పేరిట వారి పుట్టిన రోజు సెప్టెంబర్ 20న పాత్రికేయులను సత్కరిస్తూ వస్తున్నామని, ఈ ఏడాది అక్కినేని శృతిలయ ఉత్తమ పాత్రికేయ జీవన సాఫల్య పురస్కారం కోసం, సినిమా పాత్రికేయునిగా నాలుగు దశాబ్దాల అనుభవం, ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ భగీరథని ఎంపిక చేయడం జరిగిందని మహ్మద్ రఫీ తెలిపారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే అక్కినేని జయంతి ఉత్సవాల్లో భగీరథని సత్కరించి అక్కినేని జీవన సాఫల్య అవార్డును ప్రదానం చేస్తామని డాక్టర్ మహ్మద్ రఫీ తెలిపారు.

Journalist Bhagiratha select for Akkineni Life Achievement Award