Friday, April 19, 2024

నిజాంను ఎదిరించిన అక్షర వీరుడు

- Advertisement -
- Advertisement -

Journalist Shoebullah Khan Birth Anniversary

బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. షోయబుల్లాఖాన్ 1920, అక్టోబరు 17 న ఖమ్మం జిల్లా సుబ్రవేడులో జన్మించారు. తండ్రి హబీబుల్లాఖాన్. నిజాం ప్రభుత్వంలో రైల్వేలో పనిచేశారు. తల్లి లాయహున్నీసా బేగం. షోయబుల్లాఖాన్ వీరికి ఏకైక సంతానం. వీరి కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి నిజాం ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడింది. షోయబ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బిఎ, జర్నలిజం డిగ్రీ చేశాడు. విశాల భావాలు కలవాడు, అభ్యుదయవాది.ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిరంకుశ నిజాం పాలనను, నిజాం వ్యతిరేక ప్రజాపోరాటాలను బలపరిచారు. షోయబుల్లాఖాన్ విద్య పూర్తి చేసుకున్నాక జీవితాన్నంతా పత్రికావృత్తిలో గడిపారు. షోయబుల్లాఖాన్ రచనా జీవితం తేజ్ పత్రికలో ప్రారంభమైంది. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలు రచించారు.

అటువంటి రచనల్ని ప్రచురిస్తున్న కారణంగా నిజాం ప్రభు త్వం తేజ్ పత్రికను నిషేధించింది. ఆ సమయంలోనే ప్రసిద్ధ కాంగ్రెస్ నాయకుడు ముందుముల నరసింగరావు సంపాదకత్వంలో వెలువడుతున్న రయ్యత్ పత్రికలో ఉప సంపాదకునిగా బాధ్యతలు చేపట్టారు. రయ్యత్ పత్రిక కూడా నిజాం నిరంకుశత్వాన్ని విధానపరంగా విభేదించింది. అప్పటికే ముమ్మరంగా తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతోంది.ఆ సందర్భంలో రయ్యత్ పత్రికలో నిజాం ప్రభుత్వం అమలుచేస్తున్న దమనకాండ, ప్రజాఉద్యమాన్ని అణచివేసేందుకు రజ్వీని ఉసిగొలుపుతున్న పద్ధతులను వ్యతిరేకిస్తూ రచనలు చేశారు. ఆ పత్రికను కూడా నిజాం ప్రభుత్వం నిషేధించింది. రయ్యత్ నిషేధానికి గురయ్యాకా షోయబుల్లా ఖాన్ స్వంత నిర్వహణలో ఇమ్రోజ్ అనే దినపత్రికను స్థాపించారు. ఆ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు షోయబుల్లా స్వీకరించారు.హైదరాబాద్ రాజ్యానికి చెందిన ఏడుగురు ముస్లిం పెద్దలు ఒక పత్రా న్ని తయారు చేశారు.

నిజాం రాజుకీ, ఆయన ప్రజలకీ హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్‌లో రాజ్యాన్ని విలీనం చేయడమే సరైన నిర్ణయమని ఆ పత్రం సారాంశం. ఈ పత్రాన్ని ఇమ్రోజ్ పత్రికలో యధాతథంగా షోయబుల్లా ఖాన్ ప్రచురించారు. ఈ పరిణామాలే చివరకు ఆయన దారుణ హత్యకు కారణమయ్యాయి. 1948 ఆగస్టు 22న తెల్లవారుజామున షోయబ్ తుది శ్వాస విడిచాడు. నిజాం సర్కార్ షోయబ్ అంతిమయాత్రను నిషేధించింది. అంతిమయాత్ర పోలీసు పహార మధ్య జరిగింది.గోషామహల్ మాలకుంట శ్మశాన వాటికలో ఆయన ఖననం జరిగింది. నేడు ప్రతీ రచయిత, పాత్రికేయులు వారిని ఆదర్శంగా తీసుకోవాలి. అవినీతి, అక్రమాలు వెలికి తీయాలి. సమాజంలో పాత్రికేయ వృత్తి గౌరవాన్ని మరింత ఇనుమడింప చేయా లి. వారి జయంతిని నిర్వహించుకుని షోయబుల్లాఖాన్ సేవలను స్మరించుకుందాం.

* కామిడి సతీష్ రెడ్డి, 9848445134

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News