Home తాజా వార్తలు జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు

జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు

KTRహైదరాబాద్ : జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు జారీ చేస్తున్నామని తెలంగాణ మంత్రి కెటిఆర్ తెలిపారు. మంగళవారం శాసనమండలిలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం 20 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. జర్నలిస్టుల ఫండ్ కోసం మొత్తం వంద కోట్లు కేటాయించామని చెప్పారు. హెల్త్‌కార్డులు తీసుకున్న జర్నలిస్టులకు ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించేందుకు మార్గదర్శకాలు జారీ చేసినట్టు వెల్లడించారు. జర్నలిస్టుల ఇళ్ల కోసం బుద్వేల్‌లో స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. జిల్లాల్లో ఉన్న జర్నలిస్టులకు కూడా హెల్త్‌కార్డులు వర్తిస్తాయని కెటిఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు 2556 అక్రిడేషన్ కార్డులు, జిల్లాల్లో 11,831 అక్రిడేషన్ కార్డులను ఇచ్చామని వెల్లడించారు. జిల్లాల్లోని జర్నలిస్టులకు కూడా డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తామన్నారు. హౌసింగ్ సొసైటీలో రూ.2లక్షలు కట్టిన జర్నలిస్టులకు ఆ డబ్బును రిఫండ్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో జర్నలిస్టుల హెల్త్ కార్డులు పని చేయడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షభ్బీర్ అలీ అడిగిన ప్రశ్నకు కెటిఆర్ సమాధానమిస్తూ, ఆ మాట నిజమేనని కెటిఆర్ పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో కార్పొరేట్ ఆస్పత్రులతో సమావేశః నిర్వహించి, ఆ అంశాన్ని కూడా స్పష్టం చేస్తామని మంత్రి పేర్కొన్నారు.