Home తాజా వార్తలు ఆది నుంచీ అక్రమాలే

ఆది నుంచీ అక్రమాలే

Jubilee Hills Society turned into real estate

 

జూబ్లీ కొండల వెనుక ఆకాశమంత అవినీతి
రియల్ ఎస్టేట్‌గా మారిన సొసైటీ
బ్రోకర్లే కోటీశ్వరులు
విచారణలన్నీ తూతూ మంత్రాలే

మన తెలంగాణ/ పంజాగుట్ట: జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీలో ప్లాట్ల కేటాయింపు ఆది నుంచే వివాదాస్పదంగా మారింది. ఈ సొసైటీ ఏర్పాటై ఐదు దశాబ్దాలు దాటినా ఇక్కడ జరిగే అవినీతి అక్రమాలను అడ్డుకునే నాథుడే కరువయ్యారు. ఎన్ని కమిటీలు విచారణలు జరిపి నివేదికలు ఇచ్చినా అవి చర్యలు లేక తూతూ మంత్రంగా మారాయి. చివరకు జూబ్లీహిల్స్ సొసైటీని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చారు. దీన్ని అడ్డుపెట్టుకుని బ్రోకర్లు కోటీశ్వరులయ్యారు. ఇక్కడ అధికారం చెలాయించే ప్రముఖుల డ్రైవర్లు కూడా బినామీలుగా కోటీశ్వరులయ్యారంటే ఈ కొండల వెనుక ఆకాశమంత అవినీతి, సముద్రం లోతంతా అక్రమాలు ఉన్నట్లు అధికారుల విచారణ కమిటీలు తేల్చి చెప్పాయి. ఇక్కడ జరిగిన అక్రమాల్లో మచ్చుకు కొన్ని ఈ దిగువన నిర్దిష్టంగా అందిస్తున్నాం. ఇలాంటివి కోకొల్లలుగా ఉన్నాయి. తవ్వే కొద్దీ అవినీతి అక్రమాలు తరగని గనిలా బయటపడుతున్నాయి.

వందల కోట్ల విలువ చేసే భూములను అర్హులైన వారికి సహకార పద్ధతిలో సొసైటీ ఏర్పాటు చేసుకొని ప్రజలకు పద్ధతిగా పంచుతాం, నగరాన్ని అభివృద్ధి చేస్తామని అప్పట్లో కొందరు పెద్దలు చెప్పడంతో ప్రభుత్వం నమ్మి సొసైటీకి భూములు కేటాయించింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సొసైటీ పరిధిలోని వేల ఎకరాలతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. సొసైటీలో పదవులను అడ్డుపెట్టుకొని నేడు కోటీశ్వర్లుగా ఎదిగారు. ఇక్కడ ప్లాట్ల కేటాయింపులకు ఎలాంటి నియమ నిబంధనలు లేకపోవడమే ఇందుకు కారణం అని చెప్పవచ్చు. విదేశాల్లో ఉన్నవారి పేర్ల పేరిట స్థలాలు కేటాయించడం, తర్వాత బినామీల పేరిట బదలాయింపులు చేయడం సర్వసాధారణంగా మారింది. ఈ సొసైటీ భూకుంభ కోణాలపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్నో విచారణలు జరిగాయి. కిరణ్మయి కమిటీ, సిఐడి విచారణ సైతం జరిగింది. చివరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ కుంభకోణాలపై అసెంబ్లీలో హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కానీ ఏ ఒక్క విచారణ పూర్తి స్థాయిలో జరగలేదు. దీంతో ఏళ్ల తరబడి కమిటీ పదవులు అడ్డుపెట్టుకొని కొందరు తమ అక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు నేటికీ. పొట్ట చేత పట్టుకొని నగరానికి వచ్చిన కమిటీలోని కొందరు నేడు కోట్లకు పడగెత్తారు. చివరికి వారి వద్ద పని చేసే డ్రైవర్‌లు నేడు వేల కోట్లు ఆస్తులు సంపాదించారు అంటే అందుకు జూబ్లీహిల్స్ సొసైటీ భూములే అని చెప్పవచ్చు. ఒక్కసారి సొసైటీ చరిత్రని పరిశీలిస్తే 1962లో ఏర్పాటు అయిన ఈ సొసైటీకి అప్పట్లో కాసు బ్రహ్మనంద రెడ్డి 1398 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ స్థలంలో 3 వేల 37 మందికి ప్లాట్స్ కేటాయించగా అప్పట్లోనే అందులో 1500 ప్లాట్స్ నిబంధనలకు విరుద్ధంగా కేటాయించినట్లు తేలింది. పైగా వేల మందికి ఇప్పటికి ప్లాట్స్ కేటాయించలేదు. మిగిలిన భూమికి ఇప్పటికీ లెక్క పక్క లేకుండాపోయింది.

వాస్తవానికి ఈ అక్రమాలు పై 1998 లోనే ఫిర్యాదులు వచ్చాయి. అప్పటి కలెక్టర్ భన్వర్ లాల్ కేసు నమోదు చేయమని ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన కలెక్టర్ రాజేష్ తివారి అక్రమాలు లేవు అని కేసుని క్లోజ్ చేశారు. కానీ అప్పటికి విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ లో కేసు నమోదు అయ్యింది. అప్పటి విజిలెన్స్ చీఫ్ డిజిపి దినేష్ రెడ్డి 2004లో దర్యాప్తు చేపట్టి ఇది చాలా పెద్ద కుంభకోణమని, ఈ కేసు సిఐడికి అప్పగించాలని సూచించారు. దీంతో 2006లో ఈ కేసు సిఐడికి బదిలీ అయ్యింది. అయితే వ్యక్తి గత ప్లాట్ల విషయంలో కొందరు కోర్టుకి ఎక్కడంతో సిఐడి విచారణకు బ్రేక్ పడింది. ఇక అప్పటి నుండి కూడా పాలక వర్గంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు ఇప్పటికీ లే ఔట్‌లో మార్పులు, ఓపెన్ ల్యాండ్ ఎలాట్‌మెంట్, అదనపు కేటాయింపులు, ప్లాట్ల బదలాయింపులో అనేక అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఇందులో వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. ఒక్కసారి ఈ అక్రమాలు పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. మెంబర్ షిప్ నం. 2319, ప్లాట్ నం. 548/ఎ/17, డి. భారతి పేరుతో 21.7.88 లో 2629 చ.గ. ప్ల్లాట్ రెండో బ్లాక్‌లో కేటాయింపు జరిగింది. ఇదే 54 8/ఎ/17/ఎ పేరుతో మరో ప్లాట్ ను 2001లో 1542 చ.గ.ల భూమిని బైలాస్ కు విరుద్ధంగా కేటాయించడం జరిగింది. ఈ ప్లాట్ నంబర్లో నిర్మాణం కోసం అప్పట్లో ఎంసిహెచ్‌ను కోరినా అందుకు అనుమతులు లభించలేదు. కాని అదే ప్లాట్ నిర్మించిన భవనంలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సొసైటీపరంగా భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వరాదని జిహెచ్‌ఎంసిని కోరిన సొసైటీ భవనం నిర్మాణం పూర్తయినా ఎందుకు మౌనంగా ఉందనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. స్థానికంగా విచారించిన అధికారులకు ఓ బిల్డింగ్ ఓనర్ రామారావ్‌గా సమాధానం వచ్చింది. ఈ రామారావ్ ఎవరనేది సొసైటీ ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేకపోతున్నది.

2. మెంబర్ షిప్ నం. 5234 ప్రశాంతి పేరుతో ప్లాట్ నం. 1355- హెచ్ ఉంది. సొసైటీ రికార్డుల ప్రకారం వాస్తవానికి మెంబర్ షిప్ నం. 2305 పి. సత్యారావ్‌కు 1355- హెచ్ ప్లాట్ ను 21.7.1998లో నిర్వహించిన డ్రా ద్వారా కేటాయించారు. 26.2.1994 భవన నిర్మాణాని సొసైటీ నో అబ్జక్షన్ కూడా ఇచ్చింది. కాని ప్రశాంతి పేరుతో 18.1.997లో బదిలీ చేసినట్లు ఉంది. ప్రశాంతి సభ్యత్వాన్ని రద్దు చేయాలని హైదరాబాద్ జిల్లా సహకార అధికారి నిర్ణయించారు. కాని భవన నిర్మాణ అనుమతి కోసం 25 వేల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుగా 2.9.2007 సంవత్సరంలో ఆమె పేరుతో చెల్లింపు జరిగింది. ఇందుకు సంబంధించిన ఫైల్ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాని ఆ ప్లాట్ ఇంకా ఖాళీ స్థలంగానే ఉంది. 3. పి. రమణశ్రీ అనే మహిళకు ప్లాట్ నం. 1057 -ఎను, మెంబర్ షిప్ నం. 2022 ఎ. శైలజాకు ప్లాట్ నం. 573- ఎఫ్ కేటాయింపులు జరిగాయి. ఇద్దరి మధ్య పరస్పర అవగాహనతో ప్లాట్లను మార్చుకున్నారు. సొసైటీ నిబంధనలకు అనుగుణంగా ప్లాట్లు మార్చడం విరుద్ధమని అధికారులు తేల్చి చెప్పారు. ఈ ప్లాట్లకు సంబంధించి 545 చ.మీ భూమిని 15.12.2007 క్రమబద్ధీకరించినట్లు సొసైటీ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ రెండు ప్లాట్లలో ఎలాంటి నిర్మాణాలు జరుగలేదని ఉన్నతాధికారుల విచారణలో తేలింది.

Jubilee Hills Society turned into real estate