Thursday, April 25, 2024

న్యాయ వ్యవస్థ ప్రక్షాళన అవసరమే

- Advertisement -
- Advertisement -

 

ఎవరూ పట్టించుకోని అణగారిన వర్గాల ఆక్రందన వినగలిగి, వారి బాధలను చూడగలిగి చట్టాన్ని, న్యాయాన్ని నేర్పుగా బ్యాలెన్స్ చేయగలిగిన నాడు న్యాయమూర్తిగా బాధ్యతలను సరిగా నిర్వర్తించినట్టు లెక్క’ అని ఇటీవల భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నారు. కానీ ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఈ దేశ జనాభాలో 85 శాతానికి పైగా ఉన్న ఎస్‌సి, ఎస్‌టి, బిసి అణగారిన వర్గాల ప్రాతినిధ్యం దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థలో లేకపోవడం వల్ల ఈ వర్గాల ప్రజలు అనేక సందర్భాల్లో అన్యాయానికి గురైన విషయాన్ని గమనించాలి. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 30 సంవత్సరాలకు అంటే 1980లో జస్టిస్ వరదరాజన్ సుప్రీంకోర్టు జడ్జీగా నియమితులైనప్పుడు ఈ దేశ అత్యున్నత నాయస్థానం తొలిసారిగా దళిత న్యాయమూర్తిని పొందింది.

ఈయన తరవాత దళిత వర్గాల నుండి జస్టిస్ బి.సి. రే, జస్టిస్ రామస్వామి, జస్టిస్ కె.జి బాలకృష్ణన్ న్యాయమూర్తులుగా వ్యవహరించగా వీరిలో 4వ దళిత న్యాయమూర్తి ఉన్న కె.జి బాలకృష్ణన్ తొలి దళిత ప్రధాన న్యాయమూర్తిగా 2007 నుండి 2010 వరకు విధులు నిర్వర్తించారు. మళ్ళీ రెండు దశాబ్దాల తర్వాత సుప్రీంకోర్టులో ఇద్దరు దళిత జడ్జీల నియామకం జరిగింది. ప్రస్తుతం జస్టిస్ శివకుమార్, జస్టిస్ బిఆర్ గవాయ్‌లు జడ్జీలుగా నియమించబడగా వీరిలో జస్టిస్ గవాయ్ 2025 సం॥లో 6 నెలలు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించనున్నారు. మొత్తం మీద దేశంలో 20 శాతం జనాభా గలిగిన దళిత వర్గాల నుండి ఏడుగురు న్యాయమూర్తులు గా నియమించబడ్డారు. 1980 వరకు ఒబిసి, ఎస్‌సి కులాల నుండి ఒక్క జడ్జీ కూడా సుప్రీంకోర్టులో లేరు. తరువాత కాలంలో ఒబిసి వర్గానికి చెందిన జస్టిస్ ఎస్‌ఆర్ పాండ్యన్, కెఎన్ సైకియా, కెఎస్ హెగ్డే, ఎఎన్ అలెగిరి స్వామి ఈ నలుగురు మాత్రమే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్నారు. ఇంత వరకు ఎస్‌టిలకు ఒక్క జడ్జీ కూడా సుప్రీంకోర్టులో లేరు. ముస్లింలలో 9మందికి అవకాశం లభించగా, ప్రస్తుతం జస్టిస్ ఎం వై ఎక్బాల్, ఎస్ అబ్దుల్ నజీర్ లు సిట్టింగ్ జడ్జీలుగా ఉన్నారు. ఇక క్రిస్టియన్ల నుండి 9 మందికి అవకాశం రాగా ప్రస్తుతం జస్టిస్ భానుమతి, జస్టిస్ ఎం. జోసెఫ్‌లు సిట్టింగ్ జడ్జీలుగా ఉన్నారు. సిక్కులు నలుగురు, జొరాస్ట్రియన్‌లు ఐదుగురు, రెడ్డి సామాజిక వర్గం నుండి ఒక్కరికి అవకాశం లభించింది.

సుప్రీంకోర్టు ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకూ 247 మంది న్యాయమూర్తుల నియామకం జరిగింది. అయితే ఇందులో రాజకీయ పాలనా వ్యవస్థతో సంబంధం లేకుండా బ్రాహ్మణుల ప్రాతినిధ్యం సగటున 30 నుండి 40 శాతం స్థిరంగా ఉంది. సుప్రీంకోర్టు మొట్టమొదటి పాలక వర్గంలో న్యాయమూర్తుల సంఖ్య ప్రధాన న్యాయమూర్తితో కలిపి ఆరుగురు ఉండగా, ఇందులో ఇద్దరు బ్రాహ్మణులు, ఒక ముస్లిం, ఇద్దరు ఇతరులు అంటే బ్రాహ్మణులు 33.3 శాతం. ఇక అప్పటి నుండి బ్రాహ్మణులకు నిర్ణీత అప్రకటిత కోటా ఇప్పటి వరకూ కొనసాగుతున్నది. 50 వ సిజెఐను నియమించే నాటికి 16 మంది బ్రాహ్మణ ప్రధాన న్యాయమూర్తులు అంటే దాదాపు 32 శాతం. 1950 నుండి 1970 మధ్య కాలంలో 11 మంది బ్రాహ్మణ న్యాయమూర్తులు నియమించబడ్డారు. 1971-1989 కాలంలో వీరి సంఖ్య మరింతగా పెరిగి ఏకంగా 17 మంది బ్రాహ్మణ న్యాయమూర్తులు నియమించబడ్డారు. 1988లో సుప్రీంకోర్టు పాలక వర్గంలో మొత్తం 17 మంది న్యాయమూర్తులు ఉండగా వారిలో 9మంది అంటే బ్రాహ్మణులే 50 శాతం కంటే ఎక్కువ మంది నియమించబడ్డారు.ఇలా చాలా సందర్భాలలో జరిగిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

2004 నుండి 2014 వరకు నియమితులైన 52 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో 16 మంది బ్రాహ్మణులే అంటే 30.76 శాతం , ఐదుగురు వైశ్యులు, ముగ్గురు కాయస్తులు, ఇద్దరు రాజ్ పుత్ లు అంటే 50 శాతం అగ్రవర్ణ హిందువులు ఉన్నారు. ఇక 2014 నుండి కొనసాగుతున్న ప్రస్తుత పాలక వర్గంలో 35 మంది న్యాయమూర్తులకు గాను 8 మంది రిటైర్ అవ్వగా మిగిలిన 27 మంది తమ సేవలు అందిస్తున్నారు. సిజెఐ ఎన్‌వి రమణ మాత్రమే ఏప్రిల్ 23, 2021 తర్వాత ప్రస్తుత పాలక సంస్థ పదవీ కాలంలో నియమించబడని ఏకైక న్యాయమూర్తిగా ఉంటారు. ఈ 35 మందిలో 9 మంది అంటే 26% బ్రాహ్మణులు. వీరిలో న్యాయమూర్తులు యుయు లలిత్, డివై చంద్రచూడ్, ఎస్‌కె కౌల్, ఇందిరా బెనర్జీ, వి. రామ సుబ్రమణియన్‌లు ఉండగా, వీరిలో ఇద్దరు 2022లో ప్రధాన న్యాయమూర్తులుగా ఉండనున్నారు.

ఐదుగురు వైశ్యులు అనగా 20% వీరిలో ఎంఆర్ షా, హేమంత్ గుప్తా, వినీత్ శరణ్, అజయ్ రస్తోగి, దినేశ్ మహేశ్వరిలు ఉన్నారు. ముగ్గురు కాయస్థులు జస్టిస్ అశోక్ భూషణ్, నవీన్ సిన్హా, కృష్ణ మురారి అనగా 8.5 శాతం, కులం, మతం పేర్కొనని వారు ఐదుగురు ఉండగా, జొరాస్ట్రియన్, ఎస్‌సి, ముస్లిం, లింగాయత్, క్రిస్టియన్, కాత్రి, రెడ్డి, కోడార్ వర్గాలకు చెందిన వారు ఒక్కొక్కరుగా ఉన్నారు. గత మార్చి నెలలో జరిగిన రాజ్యసభ సమావేశంలో కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు తెలిపిన ప్రకారంగా దేశంలోని 25 రాష్ట్రాలలోని హైకోర్టులలో ఉన్న ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్య 1108 కాగా, ఇందులో ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు చెందిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 529గా ఉంది. ఈ లెక్కన న్యాయ వ్యవస్థలో బడుగు బలహీన వర్గాల స్థానం ఎక్కడో ఊహించవచ్చు. ఈ దేశ జనాభాలో కేవలం 3 శాతం ఉన్న బ్రాహ్మణ వర్గానికి చెందినవారు ఈనాటికీ భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులల్లో 56 శాతం, హైకోర్టులలో 40 శాతం న్యాయమూర్తులు ఉండడాన్ని బట్టి సామాజిక న్యాయాన్ని పాటించినట్లుగా ఎలా భావించగలం?

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తిని కేంద్ర కేబినెట్ సలహాపై రాష్ట్రపతి నియమిస్తారు. భారత రాజ్యాంగంలో న్యాయమూర్తుల నియామకానికి కావలసిన అర్హతలున్నాయి. కానీ ప్రధాన న్యాయమూర్తి నియామకానికి సంబంధించిన అర్హతల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించ లేదు.అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఎక్కువ కాలం పని చేస్తున్న న్యాయమూర్తిని అనుభవం ఆధారంగా చేసుకుని ప్రధాన న్యాయమూర్తిగా కొలీజియం ద్వారా నియమించడం సాంప్రదాయం. నియామకం జరిగిన తరువాత వారు 65 సంవత్సరాల వయసు నిండేంత వరకు పదవిలో ఉంటారు. భారత న్యాయ వ్యవస్థలో ప్రధాన లోపం హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం కొలీజియం ద్వారా ఏర్పాటు చేయడం. భారత దేశంలో అత్యున్నత స్థాయి పదవులైన ఐఎఎస్ లేదా ఐపిఎస్‌లకు ఎంపిక కావాలంటే యుపిఎస్‌సి నిర్వహించే రెండంచెల రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలలో అత్యధిక మార్కులు వచ్చిన అత్యంత ప్రతిభావంతులైన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తున్నారు.

భారత దేశంలో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవే విధానాలు అనుసరిస్తారు. భారత న్యాయ వ్యవస్థలోనే కింద కోర్టులు లేదా జిల్లా కోర్టుల జడ్జీల నియామకం కూడా రాత పరీక్షలు, మౌఖిక పరీక్షల ఆధారంగా చేపడతారు. భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవులైన హైకోర్టు, సుప్రీంకోర్టుల జడ్జీల నియామకాలు కొలీజియం అనే లోపభూయిష్టమైన వ్యవస్థ ద్వారా చేపడుతున్నారు. ఈ పద్ధతిలో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు ఎటువంటి సామూహిక పోటీ పరీక్షలు రాయనవసరం లేదు. ప్రస్తుతం పదవులలో ఉన్న హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలతో కూడిన కొలీజియం దృష్టిని ఆకర్షించే సామ, దాన, భేద దండోపాయాలు తెలిసిన వారు మాత్రమే నెగ్గుకు రావడం జరుగుతుంది. ప్రస్తుత కొలీజియంలో ఐదుగురు సభ్యులు ఉంటే అందులో ముగ్గురు బ్రాహ్మణ వర్గానికి చెందిన వారే ఉండడం విశేషం. పైగా ఇక్కడ రిజర్వేషన్లు పాటించడమనేది లేదు కొలీజియం చెప్పిందే శాసనం.‘దీర్ఘ కాలంలో న్యాయ వ్యవస్థను నిలబెట్టేది దయా భావన, సహానుభూతితో ప్రజల వేదనను పోగొట్టగలిగిన సామర్థ్యం మాత్ర మే. ఎవరూ పట్టించుకోని అణగారిన వర్గాల ఆక్రందన వినగలిగి, వారి బాధలను చూడగలిగి చట్టాన్ని, న్యాయాన్ని నేర్పుగా బ్యాలెన్స్ చేయగలిగిన నాడు న్యాయమూర్తిగా బాధ్యతలను సరిగా నిర్వర్తించినట్టు లెక్క’ అని సిజెఐ జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.

రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాల్లో ఒక్కోసారి పారదర్శకత లేమి పెద్ద ప్రమాదంగా మారుతుందని, దానికి అడ్డుకట్ట వేసేందుకే సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారానికి తెర తీసినట్టు చెబుతూ న్యాయ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంలో టెక్నాలజీ ఎంత పాత్ర పోషించగలదో దీని ద్వారా అర్థమైందని. న్యాయం కోసం సామాన్యుడు తొలుత ఆశ్రయించే జిల్లా కోర్టుల విచారణలనూ ఈ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు’. అంతేగాక ఈ మధ్యనే ఎన్నికల కమిషన్‌పై వ్యాఖ్యానిస్తూ అవసరమైతే దేశ ప్రధానిపై చర్యలు తీసుకునే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉండాలని ఈ రోజుల్లో టిఎన్ శేషన్ లాంటి సిఇసి అవసరం ఎంతో ఉందని అన్నారు.

మరో అడుగు ముందుకేసి దేశ ప్రజలకు జవాబుదారీగా ఉండడం కోసం సుప్రీంకోర్టును సమాచార హక్కు పరిధిలోకి తెచ్చి ఈ మధ్యనే ఆర్‌టిఐ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలోనే న్యాయ వ్యవస్థలో సామాజిక న్యాయానికి సమూల మార్పులకు నూతన సిజెఐ శ్రీకారం చుడతారని దేశంలోని అణగారిన వర్గాలు ఆశిస్తున్నారు. అయితే ఈ దేశంలో అనేక మంది బుద్ధి జీవులు, మేధావులు, హక్కుల కార్యకర్తలు, ప్రజల కోణంలో పని చేస్తూ తమ జీవితాలను బలి పెడుతున్నప్పుడు పాలకులు వక్ర మార్గంలో ఆలోచించి నేరస్థులుగా ముద్రించి, నేరం ఆరోపించబడి, రుజువు కాకుండానే సంవత్సరాల తరబడి శిక్షలను అనుభవించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి విజ్ఞతతో, సానుభూతితో ఆలోచించి చట్టసభల్లో ఉన్న నేరస్థులను జైళ్ళకు పంపి బుద్ధిజీవులు, మేధావులు ప్రజల మధ్యన ఉండేలా న్యాయాన్ని విస్తృత పరచవలసినదిగా ప్రజల పక్షాన విజ్ఞప్తి. ప్రజాస్వామ్యం, అణగారిన వర్గాల పట్ల సానుభూతి, పురుషాధిక్యత పట్ల వ్యతిరేకత ఉన్న సిజెఐ విశాల హృదయాన్ని ఈ వైపుగా దృష్టి సారించాలని భారత దేశంలో పాలకులు, బడా పెట్టుబడిదారుల వల్ల కుంగిపోతున్నటువంటి సామాన్య ప్రజానీకం ముఖంలో చిరునవ్వు వెలిగించడానికి కృషి చేయడం ద్వారా నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని ఈ దేశ ప్రజలు మనసారా కోరుకుంటున్నారు.

బైరి వెంకటేశం
9491994090
(ఎస్‌సి ఉపకులాల హక్కుల పోరాట సమితి టిఎస్ అధ్యక్షులు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News