Home ఎడిటోరియల్ అమరజీవివి నీవు కొమురయ్యా!

అమరజీవివి నీవు కొమురయ్యా!

Doddi-Komuraiahభువనగిరిలో 1944లో ఆంధ్ర మహాసభ మహాసభలు జరిగాయి. వేలమంది జనం వచ్చిండ్రు. వాళ్ళందరూ రైతులు-కూలీలు- రకరకాల వృత్తులు జేసే కష్టజీవులు. నాయకులు చెప్పే ఉపన్యాసాలు విన్నరు. ఉత్సాహం, ఉత్తేజం కలిగించే పాటలు విన్నరు. ఆ మాటలు- పాటలు- తమ బతుకుల గురించే వున్నది. తమ కష్టాలు పోయే మార్గమున్నది. సంఘంలో జేరి అందరు ఒక్కటై పోరా డాలన్నరు. వెట్టిచారికి, దొరల, జమీందార్ల దౌర్జనాలు అంతం జేయాలన్నరు. జనమంతా “ఆంధ్ర మహా సభకు జై” “రావి నారాయణ రెడ్డికి జై” అన్నరు. వాళ్ళకళ్ళల్లో కాంతి కనిపిం చింది. గుండెల్లో ధైర్యం వచ్చింది. కానీ, అంతలోనే గుండెల్లో గుబులు కలిగింది. సభకు పోయినమని దొరకు, పటేళ్ళకు తెలిసి వుంటది. ఇంటికి పోగానే జరిగేది గుర్తు జేసుకున్నరు. దొర, గడి, గడిముందు పెట్టే హింసలు కళ్ళముందు తిరిగినయ్. ఏమి చెయ్యాలె! ఎట్ల బోవాలె! ఊర్లో వుండ నిస్తరా? ఎన్ని హింసలు పెడ్తరోనని గుంపులు, గుంపులుగా జేరి గుసగుసలు పెడుతున్నరు. అంతలో ఆంధ్రమహాసభ నాయకుడు వాళ్ళను జూసి దగ్గరకొచ్చిండు. అందరు లేచి నమస్కారం జేసిండ్రు. వాళ్ళుపడే కంగారును అర్థం జేసుకున్నడు సంఘ నాయకుడు. “మీరు ఇంకా ఊరికి పోలేదెందుకు?” అడిగిండు. “ఊరికిపోతే దొర, పటేల్ యేం జేస్తరోనని భయంగాఉన్నది” అన్నాడొక యువకుడు.

“మీరందరు ఒక్కటిగవుంటే -ఊరి జనమంతా ఒక్కటైతే వాళ్ళేంజేస్తరు?”“ఊరోళ్లంతాఒక్కటెట్లయితరు?” “సంఘంలో చేరాలి. ఒక్కటిగ నిలవాలి?” అన్నడు. “అమ్మో ! దొరకు దెలిస్తే?”“యేం జేస్తడు?” “కొడ్తడు – తిడ్తడు- జుల్మానా యేస్తడు. ఊరు నుండి యెల్లగొడ్తడు” అన్నడో యువకుడు. “దొర కొట్టడు. కొట్టిస్తడు. కొట్టించి క్కూడా నౌకర్లనే పెట్టుకుంటడు. కొట్టేది మనోడే – దెబ్బలు తినేదే మనోడే” “నిజమే! దొరకు నౌకర్లుంటరు” “వాళ్ళు మన వాళ్ళే – మాల – మాదిగలు – అంటరాని వాళ్ళు. వాళ్ళచేత అడ్డ మైన పనులు జేయిం చుకుంటరు. ఊడి గం జేయించు కుంటరు. ఊరి బయట అంటరాని వాళ్ళుగ వుంచుతరు. ఎది రించే ధైర్యం లేక మరో మార్గంలేక వాళ్ళు జెప్పి నట్లు జేస్తరు.” “అవును” “దొర, పటేల్ – వాళ్ళ నౌకర్లు అందరు కలిసి ఊర్లో ఎందరుంటరు? పది మందికి మించి వుండరు. ఊరి జనం వందల మంది వుంటరు. అందరూ కలిస్తేనే సంఘం- వందల గొంతులు ఒక్క సారి జై అంటే – దొర ఉలిక్కిపడతడు! మరో సారం టే గడి తలుపు లేసుకుంటడు. మూడోసారి అంటే వూరొదిలి పారిపోతడు” అన్నడు సంఘం నాయకుడు. యువకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అది నిజమే ననుకున్నారు. “ముందుగ ఇక్కడి మీరందరు ఒక్కటి గండి. సంఘంలో జేరండి. ఒక్కటిగా నిలవండి! అప్పుడు ఊరి జనం మీ వెంటనే వస్తరు? అయితే, మీకు ధైర్యం కావాలె. దాంతోపాటు అవసరమైతే కష్టాలను ఎదు ర్కొనేం దుకు సిద్ధపడాలి.” అన్నాడు. అందుకు మేము సిద్ధ మన్నారు.

పిడికిలి బిగించి ఒక్కసారి! “ఆంధ్రమహా సభకు జై” అన్నరు. వాళ్ళను జూసి చుట్టుపక్కనోళంతా జై అన్నరు. గుట్టలు, పుట్టలు, చెట్లు జై అన్నట్లు ప్రతిధ్వనించినయ్. గుండెల్లో ధైర్యం నిండింది. కండల్లో శక్తి వచ్చింది. మనసులో ఆవేశం రగిలింది. నిగూఢమైన శక్తి నిద్ర లేచింది. ఊరూరు న సంఘం పుట్టింది. అందులో జనగాం తాలూకా ముందు న్నది. విసునూరు దొర రామచంద్రారెడ్డి – 60 గ్రామాలకు మకుటం లేని మహారాజు. అతని ఆగడాలకు హద్దు – పద్దూ లేదు. పరమ కిరాతకుడు. అతను జేసే అఘాయిత్యాలకు జనం హడలి పోతుంటరు. అతని తల్లి జానకమ్మ. కొడుకును మించిన క్రూరురాలు. కొడుకు బాబు దొర – ప్రజల పాలిట యముడు. దొర గుండాల గుంపు నాయకులు మిస్కీనలీ. అబ్బాస్ అలీ. విసునూరు గడిలో రామచంద్రారెడ్డి – కడివెండిలో జానకమ్మవుంటున్నరు. దుర్మార్గాలను విసిగి పోయిన జనం సంఘంలో జేరి జై” అన్నరు. కడివెండిలో గ్రామ సంఘం ఏర్పడింది. ఊరి జనమంతా సంఘంలో జేరిండ్రు. అది చూసి జానకమ్మ దొరసాని, ఆమెను ఆడదైనా దొరా అనే పిలవాలనేది. సంఘం పుట్టిందనగానే ఆమెకు శివమెత్తిన ట్లయ్యింది. సంఘం లేకుండా చేయాలను కున్నది. తాగుబోతు కిష్టడు, కోట చంద్రయ్య పెండ్లాం నర్సమ్మను తప్ప తాగించి, సంఘం కార్యకర్తల ఇండ్లపై ఉసిగొల్పింది.

వారిద్దరు సంఘం కార్యకర్తల, నాయకు లను బండ బూతులు తిడుతున్నరు. శాపనార్థాలు పెడు తున్నరు. రాళ్ళు విసురు తున్నరు. సహనం నశించిన సంఘం కార్యకర్తల వాళ్ళను తొక్కి కొట్టిండ్రు. 40 మంది రౌడీలతో మిస్కీ నలీ, అబ్బాసలీ, దిగిండ్రు. గడిలో మఖాం చెట్టిండ్రు. అక్రమ కేసుల్లో ఇరికించడానికి ఆమీన్‌సాబ్‌కు కబురు చేసిండ్రు. అమీన్ సాబ్ బొచ్చిండు. గ్రామ సంఘం నాయకుడు మోహన్ రెడ్డిని గడికి రమ్మని నౌకరును పంపిండు. మోహన్‌రెడ్డి గడికి రానన్నాడు. కావాలంటే ఆంధ్ర మహాసభకు ఆఫీసుకు, లేదా చావడి దగ్గర కొస్తానన్నడు. అమీన్ సాబ్‌కు కోపమొచ్చింది. 16 మంది కార్యకర్తలను పట్టుకొచ్చిండ్రు. అది చూసి వందల మంది జనం ఆమీన్‌సాబ్‌ను చుట్టుముట్టిండ్రు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడిపించుకున్నరు. అది అమీన్‌సాబ్, దొరసాని జానకమ్మ తీరని అవమానమనుకున్నరు. రౌడీలకు తలవంపు అయ్యింది. ప్రతీకారం తీర్చు కోవాలను కున్నారు. అమీన్‌సాబ్ – జమేదార్ వెళ్ళి పోయిండ్రు. రౌడీలు రాత్రంతా గడిలో కుట్ర పన్నిండ్రు. మరుసటి రోజు (1946 జులై 4) చీకటిపడగానే, సంఘం కార్యకర్తల ఇండ్లపై రాళ్ళ వర్షం కురిపించిండ్రు. సంఘం నాయకులు సంఘశక్తి చూపాలనుకున్నరు. ఇళ్ళల్లోని వారంతా బయటి కొచ్చిండ్రు. ఊరేగింపుగా ఆంధ్రమహాసభ కార్యాలయం వైపు బయల్దే రిండ్రు.

“ఆంధ్ర మహాసభకు జై” అన్న నినాదాలు విని, అన్నం తింటున్న దొడ్డి కొమురయ్య, కంచం పక్కన బెట్టిండు. దుడ్డు కర్ర అందుకున్నడు. అన్న మల్లయ్యతో కలిసి వెళ్ళి ఊరేగింపులో కలిసిండు. శాంతియుతంగా ఊరేగింపు జరుగుతున్నది. సంఘం ఆఫీసు జానకమ్మ దొరసారి గడి ముందే వున్నది. ఊరేగింపు గడి దగ్గరకు రాగానే, తప్ప తాగిన రౌడీలు తుపాకులు పేల్చారు. ఊరేగింపు ముందు వరుసలో వున్న దొడ్డి కొమురయ్యను మిస్కీనలీ గురిపెట్టి కాల్చిండు. తూటా కొమురయ్య పొట్టలో నుండి దూసుకు పోయింది. దొడ్డి మల్లయ్య, నేడివల్లి కొండయ్య, సురిగెల్ల నర్సయ్య, కొరగల్ల సాయిలు, పడమ టింటి అయిలయ్య, దేశవల్లి లక్ష్మి నర్సిహ్మాం గాయ పడ్డారు. వారు నేల గూలి రక్తపు మడుగులో కొట్టుకుంటున్నరు. సంఘం కార్యకర్తలు రౌద్ర రూపం దాల్చిండ్రు. “ఆంధ్ర మహాసభకు జై” “రావి నారాయణ రెడ్డికి జై” అని గడివైపు ఉరికిండ్రు. రౌడీల గుండెలదిరినయ్. తలుపులు బిగించుకున్నరు. సంఘం నాయకులు ప్రజలకు శాంతింప జేసిండ్రు. గడిచుట్టూ కాపలా బెట్టిండ్రు. గాయపడిన వాళ్ళను భూజాల మీద వేసుకొని జనగామ దవాఖానాకు తీసుకెళ్ళిండ్రు. అప్పటికే దొడ్డి కొమురయ్య ప్రాణాలిడిచాడు.

గడిలో దిగ్బంధంలో ఉన్న తన రౌడీలను విడిపించు కోవడానికి “బాబు దొర” కత్తులు, కటార్లు, తుపాకులతో, రౌడీల గుంపుతో కడివెండికి బయల్దేరిండు. కొమురయ్య మరణ వార్త విని చుట్టు పక్కల గ్రామాల నుండి వేలాది మంది జనం కదిలిండ్రు. కర్రలు, గుత్పలతో దండు కదిలిందని తెలిసి “బాబు దొర” తోకముడిచిండు. విసునూరు దొర దుర్మార్గాలకు కడివెండి అద్దం పట్టింది. పాలకుర్తి చాకలి ఐలమ్మ ఆత్మ స్థైర్యం – దొడ్డి కొమురయ్య అమరత్వం ఉద్యమానికి ప్రతీకలయ్యాయి. జనగామ తాలూకా పోరుబాట పట్టింది. ఒక్కొక్క ఊరు రణక్షేత్ర మయ్యింది. తెలంగాణ మంతటా వెలుగు చూపింది. చీకటి పోయి వెలుతురొచ్చింది. అణగారిన బతుకుల్లో ఆశలు చిగురించినయ్. తెలంగాణ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య మరణం సాయుధ సమరానికి సంకేత మయ్యింది. దొడ్డి కొమురయ్యకు నివాళులర్పిస్తూ సంఘ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. ఊరూరా దొడ్డి కొమురయ్య అమర గీతం ఆలపించారు.
(జులై 4 దొడ్డి కొమురయ్య వర్థంతి) – 9849080212