Thursday, March 28, 2024

ఆరోగ్య భారతానికి క్షీర విప్లవం!

- Advertisement -
- Advertisement -

June 1 World Milk Day

 

ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్) ప్రపంచ వ్యాప్తంగా 1 జూన్ రోజున ప్రపంచ క్షీర దినాన్ని ఘనంగా 2001 నుండి ప్రతి ఏటా నిర్వహిస్తున్నది. మానవాళికి అతి ముఖ్యమైన బలవర్ధక ఆహారంగా పాలను, పాల ఉత్పత్తులను గుర్తించి, వాటి వాడకాన్ని ప్రోత్సహించే దిశలో ఐరాస సభ్యదేశాలలో పలు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, ఒంటెలు మెుదలగు జంతువుల నుండి పాల సేకరణ జరుగుతోంది. పాల ఉత్పత్తుల ఆధారంగా ఉత్పత్తిదారుల కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటుతో జీవనాధారంగా మాత్రమే కాకుండా పాలకు సంబంధించిన పరిశ్రమల స్థాపన, డైరీ విద్య, వెటర్నరీ మందుల పరిశ్రమలు, పశుదానా ఉత్పత్తి కేంద్రాలు, పాడి పరిశోధనలు మెుదలగు విభాగాలలో ప్రపంచ దేశాలు ముందడుగు వేస్తున్నాయి. అత్యంత అందుబాటులో ఉండే పోషక విలువలు కలిగిన చవకైన ఆహారంగా, ముఖ్యంగా పిల్లలకు, పాలు, పాల ఉత్పత్తులు గుర్తించబడినవి. పాలను వాడటం ఫలితంగా ఆరోగ్యం సిద్ధించి, దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడుతుంది. పుట్టిన నవజాత శిశువు నుండి మెుదలు పండు ముసలి వరకు పాలను, పాల ఉత్పత్తులను సమతుల ఆహారంగా తీసుకొనుట సాధారణంగా జరుగుతోంది.

అద్భుత పోషకాహారమైన పాలలో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ల్ (ఎ, బి2, బి12), ఫోలేట్స్, విటమిన్ డి, ఆరోగ్యకర కొవ్వులు, పలు అమైనో ఆమ్లాలు, ఫాటీ ఆమ్లాలు, ఐయోడిన్, పొటాషియం, ఫాస్ఫరస్, సత్వర శక్తినివ్వగల పోషకాలు మెండుగ ఉంటాయి. స్వచ్ఛమైన ఆవు పాలలో 87.7 శాతం నీరు, 4.9 శాతం లాక్టోజ్, 3.4 శాతం కొవ్వులు, 3.3 శాతం మాంసకృత్తులు, 0.7 శాతం లవణాలు ఉంటాయి. పాల సంఘటనం జంతువులను, జాతులను, దేశాలను, ఆహారం, జంతు ఆరోగ్యాలను బట్టి మారుతుంది. పాల ఉత్పత్తుల జాబితాలో పెరుగు, వెన్న, నెయ్యి, మీగడ, మజ్జిగ, పన్నీర్, చెన్న పోడా, రసబలి, సందేశ్, రసగుల్లా, ఖైరా, పేడా, బర్ఫీ, గులాబ్‌జమున్, కుల్ఫీ, పాల పొడి లాంటివి ముఖ్యమైనవి. తల్లి పాలతో మెుదలైన జీవితం, చివరి క్షణం దాకా పాల పదార్థాలపై మక్కువను కలిగి ఉండటం సర్వసాధారణం.

పేదరికం, అవగాహనా లోపం కారణంగా పాలను పోషకాహారంగా తీసుకోక పోవడంతో పిల్లలలో పలు అనారోగ్యాలు, సరైన పెరుగుదల లేకపోవడం జరుగుతూ దేశాభివృద్ధికి విఘాతంగా మారుతున్నాయి. దీనిని గుర్తించిన ఐకాస, ప్రపంచ వ్యాప్తంగా సభ్యదేశాలలో పాల వాడకం పట్ల సామాన్యులలో అవగాహన కలిగించేలా ప్రపంచ క్షీర దినాన్ని జరుపుతున్నాయి. పాలు, పాల ఉత్పత్తుల పోషక విలువలు తెలియపరిచే విధంగా పత్రిక, టివి మాధ్యమాల్లో ప్రచారాలు, పిల్లలకు ఉచిత క్షీర పంపిణీ శిబిరాలు, విద్యాలయాలలో పాల ఉత్పత్తులకు సంబంధించిన పోటీలు, క్రీడా పోటీలు, సభలు, చర్చలు, ఉపన్యాసాలు, ప్రముఖులచే ప్రచారాలు లాంటి అనేక కార్యక్రమాలను 01 జూన్ రోజున నిర్వహించవచ్చు. ఎముకల పటిష్ఠతకు, కండరాల పెరుగుదలకు కావలసిన మాంసకృత్తులను అందిస్తూ, ఆకలిని తరిమే ఆహారంగా పాలను మానవాళి అనాదిగా ఉపయోగిస్తున్నది.

ఐరాస అంచనాల ప్రకారం ప్రపంచంలోని 7.5 బిలియన్ జనాభాలో ఒక బిలియన్ కన్నా ఎక్కువ ప్రజలు పాలు, పాల ఉత్పత్తులపై ఆధారపడి జీవనోపాధిని పొందుతున్నారు. ఈ డైరీ ఉత్పత్తులను 6 బిలియన్ల ప్రజలు ఆహారంగా తీసుకుంటూ, తమ ఆరోగ్యాలను కాపాడుకుంటున్నారు. ద్వి దశాబ్ది (20వ) ప్రపంచ క్షీర దినం -2020 జరుపుకుంటున్న సందర్భంగా కోవిడ్- 19 కల్లోలంలో లోకం లాక్‌డౌన్‌లతో సతమతమవుతున్నది. కరోనాను ఎదుర్కొనుటకు అవసరమైన వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించుటలో పాలను ప్రధాన ఆహారంగా తీసుకోవాలని నిపుణులు హితబోధ చేస్తున్నారు. ప్రపంచ నలుమూలల అందరికీ అందుబాటులో తక్కువ ధరలకే లభించే పాలు, పాల ఉత్పత్తులు మంచి పోషక విలువలు కలిగిన ఆరోగ్యాన్ని ప్రసాదించే దివ్య ఔషధంగా మానవాళికి లభ్యమవుతున్నది.

ప్రపంచంలోని అత్యధికంగా పాల ఉత్పత్తి చేసే దేశంగా ఇండియా అగ్రభాగాన ఉన్నది. ప్రపంచంలో దాదాపు 264 మిలియన్ల ఆవుల నుండి ప్రతి ఏటా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల పాల సేకరణ జరుగుతున్నది. 2019 సంవత్సరానికి ఇండియాలో 187.7 మిలియన్ మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరిగింది. భారత్‌లో పాల తలసరి వాడకం రోజుకు 394 గ్రాములుగా నమోదైనది. ఇండియా తరువాత అమెరికా, చైనా, పాకిస్తాన్, బ్రెజిల్, జర్మనీ, రష్యాలు పాల ఉత్పత్తుల జాబితాలో చోటు ఆక్రమించాయి. 2019 గణాంకాల ప్రకారం ఇండియాలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 30.52 మిలియన్ మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి నమోదైనది. తరువాత స్థానాలలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర జాబితాలో చోటు ఆక్రమించాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 15.04, తెలంగాణలో 5.42 మిలియన్ మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోంది. 2020లో భారతదేశం 195 మిలియన్ మెట్రిక్ టన్నుల పాలను ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు.

మన దేశంలో 80 మిలియన్ల గ్రామీణ కుటుంబాలు 1-5 పాడి పశువులతో పాలను ఉత్పత్తి చేస్తున్నారు. దేశ పాల ఉత్పత్తి 95 శాతం గ్రామీణ కుటుంబాల నుండి మాత్రమే సేకరించడం జరుగుతున్నది. పంజాబ్, గుజరాత్, తెలుగు రాష్ట్రాలలో 50,-200 పాడి పశువులతో డైరీ ఫాంలు కూడా నిర్వహిస్తున్నారు. మారుతున్న జీవనశైలి, నగరీకరణ, అదనపు ఆదాయ మార్గాలు, వినియోగం పెరుగుదల లాంటి కారణాలతో పాలకు గిరాకీ పెరుగుతోంది. భారతదేశ క్షీర విప్లవ పితామహుడుగా డా. వర్గీస్ కురుయన్‌ను గుర్తిస్తారు. వారి జన్మదినం సందర్భంగా 2014 నుండి ప్రతి ఏటా 26 నవంబర్ రోజున ‘జాతీయ క్షీర దినాన్ని’ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

పాడి పశువుల గణాంకాల ప్రకారం దేశంలో 192.4 మిలియన్ల పశువులు, అందులో 109.8 మిలియన్ల గేదెలు ఉన్నాయి. కురియన్ చొరవతో అమూల్ పాల ఉత్పత్తులు ఖ్యాతి గడించడం జరిగింది. దేశంలో 1970 తరువాత పాల ఉత్పత్తులను పెంచే చర్యలలో భాగంగా క్షీర విప్లవం లేదా ఆపరేషన్ ఫ్లడ్‌ను ప్రారంభించారు. దీని ద్వారా పాల ఉత్పత్తిలో వృద్ధి, గ్రామీణులకు ఆర్థిక వెసులుబాటు, సరైన ధరలకు పాల ఉత్పత్తుల లభ్యత పెరిగినవి. పేదల నుండి సంపన్నుల వరకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే అమృతాహారంగా పాలను, పాల ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తూనే, పిల్లల నుండి వృద్ధుల వరకు పాలను ఆహారంగా నిత్యం తీసికుంటూ ఆరోగ్య భారతాన్ని నిర్మించుకుందాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News