Home ఆదిలాబాద్ ముంచెత్తిన వరదలు

ముంచెత్తిన వరదలు

Jungle Life is a huge rainfall

జనం అవస్థలు
భారీ వర్షాలతో స్థంభించిన జనజీవనం…
నీట మునిగిన పంట పొలాలు
ఆందోళనలో రైతులు

మన తెలంగాణ /ఆదిలాబాద్: భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. వరదలు పోటెత్తడంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వాగులు, వంకలు ప్రమాదకరంగా పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని సాథ్‌నాల, మత్తడివాగు ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలకళను సంతరించుకుంటున్నాయి. ఇక చెరువులు, కుంటలు నీటితో నిండి అలుగుల గుండా నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో పక్కనే ఉన్న చేలల్లోకి వరదనీరు చేరి తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఇక వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల అతిసారతో తాంసి మండలం అట్నంగూడలో ఇద్దరు గిరిజన మహిళలు మృతి చెందగా, వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపూరావ్ వరద నీటిలో చిక్కుకోవాల్సి వచ్చింది. వాహనాలను వదిలి వరద నీటిలో కల్వర్టును దాటి వరద తగ్గాక ఆదిలాబాద్‌కు తిరుగుముఖం పట్టారు. జిల్లాలోని ఇచ్చోడలో 131.4 మిల్లీమీటర్లు, ఇంద్రవెల్లిలో 125.6, సిరికొండలో 124.8, జైనథ్ మండలంలో 133.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఆయా మండలాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. ఇక కడెం వాగు ఉధృతి పెరిగి భారీగా వరద నీరు రావడంతో కుంటాల జలపాతం వద్ద వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కుంటాల జలపాతం అందాలను తిలకించేందుకు స్థానికులు ఆసక్తి కనబర్చుతుండగా, పోలీసులు, అటవీ శాఖ అధికారులు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు. సాథ్‌నాల ప్రాజెక్టు సాధారణ నీటిమట్టం 286.50 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 283.80గా ఉండగా ఇన్‌ఫ్లో 2920.636గా కొనసాగుతోంది. మత్తడి వాగు పూర్తి స్థాయి నీటిమట్టం 277.5 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 274.400 మీటర్లుగా ఉండగా, ఇన్‌ఫ్లో 1017.59 క్యూసెక్కులు నమోదవుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ఇన్‌ఫ్లో గంటగంటకు పెరుగుతుండడంతో సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏ సమయంలోనైనా నీటిని విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నారు. ఇదిలాఉంటే భారీ వర్షాల కారణంగా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటోంది. అత్యవసర సమయంలో వెంటనే స్పందించేందుకు రెవెన్యూ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టగా, జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగానికి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మండల, గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేస్తూ అప్రమత్తంగా ఉంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఆస్థి, ప్రాణ నష్టం జరగలేదని అధికారవర్గాలు తెలిపాయి. ఇదిలాఉంటే పెన్‌గంగా ప్రాజెక్టు కాలువ పనులను అర్థాంతరంగా నిలిపివేయడంతో కాలువలో చేరిన వరద నీటి ప్రవాహంతో జైనథ్ మందలకేంద్రంలో 30 ఎకరాలలో పంట నీట మునగగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే రెండోసారి విత్తనాలు వేసుకొని నష్టపోగా కాంట్రాక్టర్ నిర్లక్షంతో మరోసారి పంట నీట మునిగిందని రైతులు వాపోతున్నారు. ఇచ్చోడ, సిరికొండ, గాదిగూడ, తాంసి, తలమడుగు, బోథ్, బజార్‌హత్నూర్, నేరడిగొండ, ఇంద్రవెల్లి మండలాలలో చెరువుల అలుగుల నుంచి నీటి ప్రవాహం పెరగడంతో పంట చేలల్లో ఇసుక మేటలు వేశాయి, వందలాది ఎకరాలలో పంటలు నీట మునిగి పంట నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామ సమీపంలోని త్రివేణి సంగమం చెరువు అలుగు పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో చేపలు చెరువులోని చేపలు కొట్టుకొని వస్తున్నాయి. పిల్లలు, మహిళలు, యువకులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నీటిలో చేపల వేట కొనసాగిస్తుండగా, విషయాన్ని తెలుసుకున్న ఎస్సై చెరువు వద్దకు చేరుకొని వారిని అక్కడి నుంచి పంపించారు. ఇక ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జిల్లా కేంద్రంతో పాటు మండలకేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం తీవ్రతతో వంట చెరుకు, ఇతరత్రా సామాగ్రి తడిసి పోయి ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆందోళన చెందిన జిల్లా రైతులు రెండు రోజులుగా కురుస్తున్న భార వర్షాల కారణంగా పంటలు నీట మునిగిపోవడంతో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.