Friday, April 26, 2024

జూరాల గేట్లు బార్లా

- Advertisement -
- Advertisement -

28గేట్లు ఎత్తి శ్రీశైలానికి
లక్షా 98వేల క్యూసెక్కుల నీటి విడుదల
శ్రీశైలంలో ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి
దిగువ నాగర్జున సాగర్‌కు 38వేల క్యూసెక్కులు విడుదల
జూరాలకు 2లక్షల10వేల క్యూసెక్కుల భారీ వరద
ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రలకు పోటెత్తుతున్న కృష్ణమ్మ

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: కృష్ణమ్మకు వరద పోటెత్తడంతో జూరాల ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తి శ్రీశైలంకు 2లక్షల 10వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మకు వరద పోటెత్తింది. కేంద్ర జలసంఘం ఆదేశాల మేరకు అప్రమత్తమైన యంత్రాంగం ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు బేరిజు వేస్తూ దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం 2లక్షల 10వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, మరో లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం పెరిగే సూచనలు ఉన్నాయని ఉన్నతాధికారుల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది.

ఎగువ నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు 2లక్షల 10వేల క్యూసెక్కుల భారీ వరద వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు జూరాల ప్రాజెక్టు 28గేట్లను ఎత్తి దిగువకు లక్షా 97వేల 790 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో పాటు జూరాల ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి చేసిన అనంతరం దిగువకు 21వేల 828 క్యూసెక్కుల నీటని వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతుంది. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాంకు లక్ష 51వేల 598క్యూసెక్కుల భారీ వరద వచ్చి చేరుతుండగా దిగువ నారాయణపూర్‌కు లక్ష 75వేల 672 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నారాయణపూర్‌కు లక్ష 79వేల 341క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, దిగువ జూరాలకు లక్ష 86వేల 389క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో జూరాల జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో నమోదవుతుంది.

తుంగభద్ర డ్యాంకు లక్ష వెయ్యి క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ఎగువ కృష్ణా పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదికి మరింత వరద పోటెత్తే అవకాశం ఉంది. జూరాలలో 4 టిఎంసీల మేర నీటిని నిల్వ ఉంచి దిగువకు వదులుతున్నారు. అదే విధంగా నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, కుడి ఎడమ, సమాంతర కాలువలు, విద్యుత్ అవసరాల కోసం 21వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండగా, జూరాల మొత్తం ఔట్ ఫ్లో 2లక్షల 22వేల 560 క్యూసెక్కులుగా నమోదయ్యింది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 215.807 టిఎంసీలు కాగా ప్రస్తుతం 79.8115 టిఎంసీల నీరు ఉంది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా 19.170మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని చేసి 38వేల 140క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. శ్రీశైలం తిరుగు జలాలపై ఆధారపడ్డ హంద్రీనీవా సుజలస్రవంతి ఎత్తిపోతల ద్వారా 1589 క్యూసెక్కులు, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1301 క్యూసెక్కులు ఎత్తిపోస్తుండగా, పోతిరెడ్డిపాడు ద్వారా 1000క్యూసెక్కులను సాగునీటి కోసం వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయంలో 46వేల 159క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదయ్యింది.

Jurala project Gates lifted due to Heavy Inflow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News