రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టు కోలిజియం నియామకంతో త్రిపుర ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ రాష్ట్ర హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో శనివారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో రాజ్‌భవన్‌లో 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. సిఎంతో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, డిజిపి జితేందర్,హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు హజరయ్యారు.
న్యాయవాద కుటుంబం నుంచి…
న్యాయవాద కుటుంబంలో మూడో తరానికి చెందిన జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ 1965 జూలై 7వ తేదీన డాక్టర్ రాంగోపాల్ సింగ్, డాక్టర్ శ్రద్ద సింగ్ దంపతులకు జన్మించారు. ఆయన ముత్తాత(తల్లి కుటుబానికి చెందిన) జస్టిస్ బిపి సిన్హా సుప్రీంకోర్టు 6వ ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. తాత జస్టిస్ శంభూప్రసాద్ సింగ్ పాట్నా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. మేనమామలు జస్టిస్ బి. విశ్వేశ్వరప్రసాద్ సింగ్ 2001 నుంచి 2007 మధ్య, జస్టిస్ శివకీర్తి సింగ్ 2013 నుంచి 2016 మధ్య సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పని చేశారు. జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బిఎ ఆన్సర్, ఎల్‌ఎల్‌బిలో పట్టా పొందారు.
1990లో బార్ కౌన్సిలలో నమోదు చేసుకుని, 1990 నుంచి 2000 వరకు పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 2001లో జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాద వృతి కొనసాగించారు. 2012 జనవరి 24న జార్ఖండ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014 జనవరి 16న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2022 డిసెంబర్ 20 నుంచి 2023 ఫిబ్రవరి 19 వరకు జార్ఖండ్ హైకోర్టులో తాత్కలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2023 ఏప్రిల్ 17వ తేదీన పదోన్నతిపై త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ ఆయ్యారు. తాజాగా ఆయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.