Home ఎడిటోరియల్ ద్వంద్వ న్యాయం

ద్వంద్వ న్యాయం

Justice should apply equally to everyone

దేశంలో పెద్దలకు, పేదలకు వేర్వేరు చట్టాలు లేవని, చట్టం అందరికీ ఒకేలా వర్తించాలని న్యాయమూర్తులు డి.వై. చంద్రచూడ్, ఎంఆర్ షాల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం నాడు చేసిన వ్యాఖ్య చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించి ఉండాలి. ఎందుకంటే చట్టం ఒక్కటే అయినా అనుభవంలో దాని వల్ల కలుగుతున్న న్యాయం పేదలకు ఒక విధంగానూ, పెద్దలకు మరో రీతిగానూ ఉంటున్న సంగతి ఎవరూ కాదనలేని కఠోర వాస్తవం. ఒకే చట్టం కింద అరెస్టయ్యే నిరుపేదలు, నిస్సహాయులు బెయిల్ మీదనైనా విడుదల కావడానికి వీలుకాక ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతుండడం, సంపన్నులు, అధికారం, రాజకీయ పలుకుబడి గల వారు క్షణాల్లో బయటపడతుండడం తెలిసిందే.

అలాగే ప్రభుత్వాలు పడిపోకుండా కొనసాగడానికి చట్టసభల్లో తమకున్న బలంతో ఉపయోగపడుతున్న వారి సన్నిహితులు శిక్షలను తగ్గింపచేసుకొని త్వరలో విముక్తి పొందగలిగే స్థితి దేశంలో ఉంది. అదే సమయంలో పాలకుల రాజకీయ కక్షకు గురైనవారి పరిస్థితి ఇందుకు భిన్నంగానూ ఉంటున్నది. ఇది దేశ ప్రజలందరికీ, బహుశా ఈ ధర్మాసనం సభ్యులైన న్యాయమూర్తులకూ గ్రహింపులో ఉండి ఉండాలి. నేర దర్యాప్తులో న్యాయ వ్యవస్థకు ఉపయోగపడే పోలీసు యంత్రాంగంలోని చెప్పనలవికాని అవినీతి, ప్రభు దాస్యం వారు ధనికుల పట్ల ఒక విధంగానూ, పేద నిందితుల విషయంలో మరో రకంగానూ ప్రవర్తించేట్టు చేస్తున్నది.

మధ్యప్రదేశ్‌లో ఒక కాంగ్రెస్ నాయకుడి హత్య కేసులో నిందితుడైన ఒక బిఎస్‌పి ఎంఎల్‌ఎ భర్త అదే పనిగా బెయిల్ పొందుతూ రెండేళ్లుగా అరెస్టు నుంచి తప్పించుకుంటున్న కేసులో ధర్మాసనం ఈ ‘రెండు చట్టాల’ వ్యాఖ్య చేసింది. దేశంలో ఇప్పటికీ కొన్ని చోట్ల హోటళ్లలో రెండు గ్లాసుల విధానం అమల్లో ఉన్న సంగతి తెలియనిది కాదు. ఇటువంటి సమాజంలో ఒకే చట్టం, పై వారికి ఒక విధంగా, కింది వారి విషయంలో మరో రకంగా వ్యవహరిస్తూ ఉండడం సహజమే. న్యాయ వ్యవస్థ ఒత్తిడులకు లొంగిపోయినట్టయితే రాజకీయాల్లో నేరస్థులకు అది నజరానాగా, ప్రోత్సాహంగా పని చేస్తుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించడం హర్షించవలసిన విషయం. ఈ కేసులో కింది కోర్టు జడ్జి ఒకరు గత ఫిబ్రవరిలో ఒక ఉత్తర్వును జారీ చేస్తూ రాజకీయ పలుకుబడి గల నిందితుడి విషయంలో చట్టబద్ధంగా వ్యవహరించినందుకు తనకు ముప్పు పొంచి ఉన్నదని లిఖిత పూర్వకంగా రికార్డు చేసిన విషయాన్ని జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం గమనించింది. కింది కోర్టు జడ్జి వెలిబుచ్చిన అభిప్రాయంపై నిర్ణీత వ్యవధిలో నివేదిక సమర్పించాలని మధ్యప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది.

ఒక జడ్జి తనకు ముప్పు ఉందని భయం వ్యక్తం చేశాడంటే అది మొత్తం దేశంలోని న్యాయమూర్తులందరికీ హెచ్చరికవంటిదని, వారికి ఎంతమాత్రం మంచి చేయదని అభిప్రాయపడింది. న్యాయ వ్యవస్థ స్వాతం త్య్రం అంటే ప్రతి న్యాయమూర్తి స్వాతంత్య్రమేనని ప్రకటించింది. 2019 డిసెంబర్‌లో ఒక ప్రముఖుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన ఒక లేఖలో న్యాయ వ్యవస్థ పట్ల దేశ ప్రజల్లో విశ్వాసం సడలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాజ్యాంగ ప్రవేశికలో ప్రజలకు న్యాయం చేకూర్చటమే ప్రభుత్వ ప్రప్రథమ విధి అని పేర్కొన్నారంటూ ఆచరణలో పేదలు, బలహీన వర్గాలవారు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ప్రాథమిక అభియోగ పత్రా(ఎఫ్.ఐ.ఆర్)న్ని కూడా నమోదు చేయించుకోలేని స్థితిలో ఉన్నారని, అదే సమయంలో ధనికులు, శక్తిమంతులు అత్యున్నత అధికార పీఠాలను అధిష్ఠించగలుగుతున్నారని అభిప్రాయపడ్డారు. సంపన్నులు అరెస్టు నుంచి తప్పించుకోగలుగుతున్నారని, పేదలు ఏళ్ల తరబడిగా విచారణలోని నిందితులుగా జైళ్ల లో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 478,600 మంది ఖైదీలుండగా వారిలో ప్రతి పది మందిలో ఏడుగురు విచారణలోని ఖైదీలేనని వీరిలో అత్యధికులు కింది సామాజిక వర్గాలకు చెందినవారేనని 2019 సెప్టెంబర్‌లో ప్రకటితమైన ఒక సమాచారం తెలియజేస్తున్నది.

వీరిలో 64 శాతం ఎస్‌సి ఖైదీలని, 12.3 శాతం గిరిజనులని, 30 శాతం ఒబిసిలని జాతీయ నేరస్థుల సమాచార విభాగం (నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో) వెల్లడించింది. అలాగే విచారణలోని ఖైదీల్లో 21.5 శాతం మంది ముస్లింలని ప్రకటించింది. కుల వివక్ష, కొన్ని సామాజిక వర్గాల మీద పోలీసులు మితిమించి దృష్టి పెట్టడం వంటి కారణాల వల్ల జైళ్లలో మగ్గుతున్న వారిలో కింది వర్గాలు అత్యధిక సంఖ్యలో ఉన్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దారిద్య్రంలో మగ్గుతున్న వారు కోర్టుకి వెళ్లి తొందరగా న్యాయాన్ని సాధించుకోడానికి పెట్టవలసిన అత్యధిక వ్యయాన్ని భరించలేకపోడం వల్ల కూడా ఆ వర్గాలకు చెందిన నిందితులు విచారణలోని ఖైదీలు గా సంవత్సరాల తరబడి జైళ్లలో ఉంటున్నారు. ఈ కారణాలను నిర్మూలించకుండా, పోలీసు వ్యవస్థలో విధి నిర్వహణ పట్ల నిజాయితీని, నిబద్ధతను కలిగించకుండా ఒకే చట్టం పేదల పట్ల ఒక రకంగానూ, పెద్దల పట్ల మరో విధంగానూ వ్యవహరించే స్థితి తొలగదు. ఈ నేపథ్యంలో దేశంలో ఆచరణలో రెండు రకాల చట్టాలు పని చేస్తున్నట్టు భావించక తప్పుదు.