Saturday, April 20, 2024

హైకోర్టు సిజెగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -

Justice Ujjal Bhuyan sworn in as High Court judge

రాజ్‌భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం భుయాన్‌తో ప్రమాణస్వీకారం
చేయించిన గవర్నర్ హాజరైన ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్న
కేంద్రమంత్రి, రాష్ట్రమంత్రులు, వివిధ పార్టీల నేతలు, అధికారులు
తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ భుయాన్ ఐదవ ప్రధాన న్యాయమూర్తి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈక్రమంలో రాజ్‌భవన్‌లో మంగళవారం ఉదయం 10 గంటల 5 నిముషాలకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ జస్టిస్ భూయాన్ చేత ప్రమాణం చేయించారు. హైకోర్టు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు సత్యవతి రాథోడ్, నిరంజన్ రెడ్డి, జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు సురేశ్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత సిఎం కెసిఆర్ రాజ్‌భవన్‌కు విచ్చేశారు. ఈ నేపథ్యంలో సిఎం మీడియాకు అభివాదం చేస్తూ రాజ్‌భవన్‌లోపలికి వెళ్లారు. హైకోర్టు సిజె ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాజ్‌భవన్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

జస్టిస్ భూయాన్, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పడ్డాక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఐదో న్యాయమూర్తి కావడం గమనార్హం. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ కావటంతో ఆయన స్థానంలో జస్టిస్ భూయాన్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కాగా 2019, జనవరి 1న ఏర్పాటైన రాష్ట్ర హైకోర్టు మొట్ట మొదటి ప్రధాన న్యాయమూర్తిగా టిబిఎన్ రాధాకృష్ణన్ పని చేశారు. ఆ తర్వాత జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ప్రధాన న్యాయమూర్తులుగా సేవలందించారు. హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ భూయాన్, ముంబై , అసోం హైకోర్టుల్లో న్యాయమూర్తిగా సేవలందించారు.

గవర్నర్‌కు సిఎం ఆత్మీయ పలకరింపు 

హైకోర్టు సిజె ఉజ్జల్ భూయాన్ ప్రమాణస్వీకారోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్ భవన్ కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం రాజ్ భవన్ కు వచ్చిన సిఎం కెసిఆర్ గవర్నర్ తమిళిసైకి పుష్పగుచ్ఛం అందించారు. చాలా రోజుల తర్వాత ఎదురుపడ్డ ఇరువురూ నవ్వుతూ కనిపించారు. ప్రమాణస్వీకారం కార్యక్రమం అనంతరం గవర్నర్ ఇచ్చిన తేనేటి విందులో సిఎం కెసిఆర్ పాల్గొని తమిళిసైతో కొద్దిసేపు ముచ్చటించారు. అదేవిధంగా ఇక అక్కడే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా సిఎం మాట్లాడారు. ఈ సమయంలో గవర్నర్, సిఎం, కేంద్ర మంత్రి మధ్య నవ్వులు విరిశాయి.

జస్టిస్ భూయాన్ నేపథ్యం 

అసోంలోని గౌహతిలో 1964 ఆగస్టు 2న జస్టిస్ భూయాన్ జన్మించారు. 1991లో న్యాయవాదిగా ఎన్ రోల్ అయ్యారు. 2010 సెప్టెంబర్ 6న సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందారు. 2011 జూలై 21న అసోం ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2011 అక్టోబర్ 17న గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా పనిచేశారు. 2019 అక్టోబర్ 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. గతేడాది అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చి, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కూడా భూయాన్ కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News