Friday, April 26, 2024

విమానాశ్రయాల్లో జనం రద్దీ నివారణకు కేంద్రం మార్గదర్శకాలు

- Advertisement -
- Advertisement -

Jyotiraditya Scindia issues action plan

న్యూఢిల్లీ : విమానాశ్రయాల్లో జనం రద్దీ నివారణకు కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సిందియా మంగళవారం మార్గదర్శకాలతో కార్యాచరణ ప్రణాళిక విడుదల చేశారు. ఒమిక్రాన్ కలవరం నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి దేశం లోని ప్రధాన విమానాశ్రయాల్లో జనం రద్దీ విపరీతంగా ఉండడంపై సామాజిక మాధ్యమాల్లో ప్రయాణికులు ఫిర్యాదులు చేయడంతో మంత్రి మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ విమానాశ్రయాల్లో ప్రయాణికులను పరీక్షించడానికి కావలసిన ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో సిద్ధం చేయాలని విమానాశ్రయాల నిర్వాహకులకు ఆదేశించారు. దేశం మొత్తం మీద వందకు పైగా విమానాశ్రయాలను ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) నియంత్రిస్తుండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ విమానాశ్రయాలను ప్రైవేట్ యాజమాన్య నిర్వహణలో ఉన్నాయి.

ఇమిగ్రేషన్ క్యూలకు సంబంధించి ఎనిమిది అంశాలను ఈ ప్రణాళికలో సూచించడమైందని, ఆర్‌టిపిసిఆర్ సేవలను విస్తరిస్తున్నామని, అలాగే హెల్ప్‌డెస్కులను, ఫారెక్స్ కౌంటర్లను పెంచుతున్నామని మంత్రి తెలియచేశారు. ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా రోజూ పర్యవేక్షించడమౌతుందని చెప్పారు. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ డిసెంబర్ 1 నుంచి అమలు లోకి తెచ్చిన ఆదేశాల ప్రకారం రిస్కు దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్‌టి పిసిఆర్ పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. ఇతర దేశాల నుంచి వచ్చిన రెండు శాతం ప్రయాణికులకు కూడా యాధృచ్ఛికంగా పరీక్షలు జరుగుతాయి. విమానాశ్రయాల నుంచి బయటకు వెళ్లే ముందు లేదా ఇతర విమానాలలో వేరే ప్రాంతాలకు వెళ్లే ముందు పరీక్ష ఫలితాలు వచ్చేవరకు ప్రయాణికులు నిరీక్షించక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News