Tuesday, April 16, 2024

కోమటి రెడ్డిలు కోవర్టు రెడ్డిలే: కడియం

- Advertisement -
- Advertisement -

kadiyam srihari tests positive for covid-19

 

హైదరాబాద్: 2014లో మోడీ ప్రధాని అయినప్పుడు డాలర్ విలువ 58 రూపాయలు ఉండేదని, ఇప్పుడు డాలర్ 82 రూపాయలకు పడిపోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మండిపడ్డారు. టిఆర్ఎస్ భవనం నుంచి కడియం మీడియాతో మాట్లాడారు. ద్రవ్యోల్భణం పెరిగిపోతోందని, ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోందని, 2014లో ఆర్ధిక వృద్ధి రేటు 7 శాతం ఉంటే ఇప్పుడది 5 శాతానికి దిగజారిందని ఎద్దేవా చేశారు.  గ్లోబల్ హాంగర్ ఇండెక్స్ లో 2014లో భారత్ స్థాయి 121 దేశాల్లో  55వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు 107 స్థానానికి పడిపోయిందన్నారు. అన్నింటిలో భారత్ స్థాయిని మోడీ పాలన దిగజార్చిందని మండిపడ్డారు.

తెలంగాణపై బిజెపి కక్ష కట్టిందని, నిధులు రాకుండా అడ్డుగా ఉంటుందని,  తెలంగాణ బిజెపి నేతలు చవటలు దద్దమ్మలుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బిజెపి నేతలకు భాద్యత లేదా అని ప్రశ్నించారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటారా? అని నిలదీశారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బండి సంజయ్ ఏం చేస్తున్నారని కడియం ప్రశ్నించారు. ప్రశ్నించే వాళ్ళను అర్బన్ నక్సల్స్ గా ముద్ర వేస్తున్నారని, ప్రత్యర్థి పార్టీలపై ఇడి, సిబిఐల చేత ప్రతిపక్ష పార్టీలను వేధిస్తుందని మండిపడ్డారు.

బిజెపి అధికార దాహం, రాజగోపాల్ రెడ్డి అహంకారం మునుగోడు ఉపఎన్నికకు కారణంగా ఉన్నాయని, కాంగ్రెస్ లో ఉంటూ  రాజగోపాల్ రెడ్డి బిజెపికి కోవర్టుగా పని చేయడంతో 18 వేల కాంట్రాక్టు దక్కించుకున్నారని మండిపడ్డారు రాజగోపాల్ ది కోవర్టు చర్య కాక ఏమని పిలుస్తారని అడిగారు. కోవర్టు అంటే రాజగోపాల్ కు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని కడియం ధ్వజమెత్తారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డికి ఇవన్నీ తెలియవా? అని ప్రశ్నించారు. మునుగోడులో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఎందుకు ప్రచారం చేయడంలేదని ప్రశ్నించారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కోవర్టు రెడ్డి అని పిలువక ఏమని పిలువలని కడియం అడిగారు.   డబ్బు ఉందనే అహంకారంతో కోమటి రెడ్డి బ్రదర్స్ విచ్చల విడిగా వ్యవహరిస్తున్నారని, మునుగోడు ప్రజలు కోమటి రెడ్డి కుటుంబానికి గుణ పాఠం చెప్పడంతో పాటు వారిని రాజకీయంగా సమాధి కట్టాలన్నారు.  సిఎం కెసిఆర్ తెలంగాణ రక్షకుడుగా ఉన్నారని, మునుగోడు ప్రజలు ఆ కోణంలోనే తీర్పునివ్వాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News