Home దునియా కృషీవలుడు కెకాల

కృషీవలుడు కెకాల

Satyanarayana

నవరస నటనా సార్వభౌమ అని అందరి మెప్పు పొందుతూ వుండటానికి, నా నటవారసుడువి నువ్వే అని నట సార్వభౌమ ఎస్.వి.రంగారావుతో అనిపించుకోడానికి నటజీవితంలో సత్యనారాయణ పడిన కష్టాలు, ఎదుర్కొన్న ఇబ్బందులు, భరించిన అవమానాలు ఎన్నో ఎన్నెన్నో. హీరోగా ప్రవేశించి ఆ చిత్ర పరాజయంతో వేదన చెంది ఎన్.టి.రామారావు సిఫారసుతో ఎన్.టి.ఆర్‌కి డూప్‌గా నటించారు. అలా కొనసాగుతూ విఠలాచార్య సూచనతో విలన్ పాత్రలు పోషించడానికి స్థిరపడి, క్రమక్రమంగా నటనలో రాటుదేలారు. సాధారణ విలన్ నుంచి ప్రేక్షకుల నుంచి బండబూతులు తిట్టించునే భయంకర విలన్‌గా, కామెడీ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యరసం , అమాయకత్వం చిందించే గుణ చిత్రనటుడుగా, యముడుగా ఇలా విభిన్నపాత్రల పోషణలో తనకు తనే సాటి అనిపించుకుంటున్నారు. కృష్ణా జిల్లాలోని కౌతరం గ్రామంలో వ్యవసాయ కుటుంబీకులైన కైకాల లక్ష్మీనారాయణ దంపతులకు 2571935 న జన్మించారు. గుడివాడలో బి.ఎ పూర్తిచేసారు. రంగస్థలంపై నటిస్తుంటే ఎన్.టి.రామారావు పోలికలు కనిపించి ఎన్.టి.ఆర్ తమ్ముడేమో అనుకునేవారు. ప్రభావతి నాట్యమండలి ఇచ్చిన ప్రోత్సాహంతో నాటకాలరాయుడు అయ్యారు. చిత్ర రంగానికి చెందిన కె.ఎల్. ధర్ సలహాతో చిత్రరంగంలో నిలదొక్కుకోవాలని మద్రాసు చేరారు 1955లో. ఎం.ఎల్.ఎ, భూకైలాస్ తదితర చిత్రాలలో వచ్చిన మంచి వేషాలు వెనక్కిపోయాయి. నిర్మాతల కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. ఆశతో తీసుకొచ్చిన డబ్బులు అయిపోవడంతో, వేషం వేయకుండా ఇంటికెళ్లడానికి మనసు ఒప్పుకోకపోవడంతో భుక్తి కోసం అంతులేని అంతస్థులు నాటకాన్ని రేడియోకి రాసి ప్రదర్శిస్తే కొంత ఊరట లభించింది. పర్సనాల్టీ బాగుందని మెచ్చుకుంటున్నా వేషాలు ఇవ్వడం లేదన్న జ్ఞానోదయం కలిగి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఛాన్స్ ఇమ్మని బి.ఎ.సుబ్బరావుని కలిసారు. ఆయన కె.వి.రెడ్డికి సూచించారు. సంక్రాంతి పండుగకు ఇంటికెళ్లి వచ్చేసరికి ఆ ఛాన్స్ మిస్సయింది. చిన్న వేషం వుందని తెలిసి నిర్మాత డి.ఎల్.నారాయణని కలిస్తే నీకు చిన్న వేషమేమిటి నువ్వే హీరోవి అంటూ సిపాయి కూతురు చిత్రానికి హీరోని చేసారు. ఎన్.టి.ఆర్ పోలికలు, పర్సనాల్టీ ఉన్న హీరో అని ఆ సినిమా ప్రారంభ సమయానికి అందరికి తెలిసి ఎన్.టి.ఆర్ తో సహా అందరికీ సత్యనారాయణని చూడాలనే ఉత్సుకత ఎక్కువైంది. డి.ఎల్.నారాయణతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా ఇతర నిర్మాతలు హీరో ఛాన్స్ ఇస్తామంటే నో అనాల్సి వచ్చింది. సిపాయి కూతురు విడుదలై పరాజయం చెందడంతో ఆయనతో సినిమాలు తీయాలనుకునేవారు జారుకున్నారు. ఎన్.టి.రామారావు పిలిపించుకుని తనకు డూప్‌గా నటించే అవకాశాలు కల్పించడంతో కొంత ఊరట లభించింది. కొన్ని చేసాక తన నిర్మాతలకు సత్యనారాయణను ఎన్.టి.ఆర్ సూచించడంతో ఒక మాదిరి వేషాలు లభించసాగాయి. విఠలాచార్య సలహా పాటించి విలన్ వేషాలకు మొగ్గు చూపడంతో ఆయన కనకదుర్గ పూజ మహిమలో విలన్‌ని చేసారు. తరువాత అగ్గిపిడుగులోను విలన్ గా నటించారు. నటన తెలియని వాళ్లు, డైలాగ్ చెప్పలేని వాళ్లు వస్తున్నారు అని ఎస్.వి.రంగారావు తనతో నటిస్తున్న సత్యనారాయణని చూసి వెక్కిరింపుగా అనడంతో సత్యనారాయణలో కసి పెరిగింది.

కఠోర పరిశ్రమ చేస్తూ విలన్లకే విలన్ అయ్యారు. ఎస్.వి.రంగారావు మెప్పు పొందడమే కాక డైలాగ్ డెలివరీలో ముఖ్యంగా పౌరాణిక చిత్రాల్లో నా మాడ్యులేషన్ తరహా చూపిస్తే తిరుగుండదు … నా నటవారసుడివి అవుతావు అని ఆశీర్వదించేలా చేసుకున్నారు. అందరూదొంగలే చిత్రంలో ఎస్.వి.ఆర్ తో 1972 లో పోటిపడి నటించి అ తరువాత దేవుడుచేసినమనుషులు చిత్రంలో అద్భుతనటన ప్రదర్శించావు అని ఎస్.వి.రంగరావు నుంచి మళ్లీ ప్రశంసలు పొందారు. తాయారమ్మ బంగారయ్య చిత్ర శతదినోత్సవ సభలో శివాజీ గణేశన్ మాట్లాడుతూ సత్యనారాయణ ఈజ్ సత్యనారాయణ ప్లస్ ఎస్.వి.ఆర్ అని అభినందించారు. సోదరుడు నాగేశ్వరావుతో కలసి రమా ఫిలింస్ నిర్మాణ సంస్థ నెలకొల్పి, గజదొంగ,ఇద్దరు దొంగలు, కొదమసింహం, బంగారుకుటుంబం మున్నగు చిత్రాలు. మామఅల్లుళ్ల సవాల్, చిరంజీవి చిత్రాలకు సహ నిర్మాతగాను వ్యవహరించారు. నర్తనశాలలో దుశ్శాసనుడిగా, పాండవవన వాసంలో ఘటోత్కచునిగా, శ్రీకృష్ణ పాండవీయంలో రుక్మిగా, శ్రీకృష్ణార్జున యుద్ధంలో కర్ణుడుగా , శ్రీకృష్ణావతారం, కురుక్షేత్రం చిత్రాలలో దుర్యోధనుడిగా, దానవీరశూరకర్ణ లో భీముడిగా, సీతారామ వనవాసం, సీతాకల్యాణం, సీతాస్వయంవరం, శ్రీరామవనవాసంలలో రావణ బ్రహ్మగా అపూర్వమైన నటన ప్రదర్శించారు.

సోషల్ ఫాంటసీ చిత్రాలైన యమలీల, యముడికి మొగుడు, యమలీల చిత్రాలలో యమధర్మరాజుగా మెప్పించారు. చారిత్రక చిత్రాలైన కథనాయిక మొల్లలో శ్రీకృష్ణదేవారాయలుగా, చాణిక్యచంద్ర గుప్తలో రాక్షసామాత్యునిగా , సమ్రాట్ అశోక్‌లో ఉజ్జయిని మహారాజుగా , శ్రీనాధ కవిసార్వభౌమలో డుండిమభట్టుగా ప్రశంసలు పొందారు. బొబ్బిలి బ్రహ్మన్న, అగ్నిపర్వతం చిత్రాలలో చూపిన హాస్యం చెప్పుకోదగ్గదే..సింహాసనం చిత్రంలో ఆచార్య అపంశదేవుడుగా, ఉక్కుపిడుగు, దేవుడిచ్చిన భర్త, సుగుణసుందరికథ, లక్ష్మీ కటాక్షం, మదన కామరాజు కథ, రాజకోట రహస్యం తదితర జానపద చిత్రాలలో చక్కని నటన ప్రదర్శించారు. సిపాయి చిన్నయ్య, బంగారు కలలు, ఉమ్మడి కుటుంబం, ప్రేమనగర్, మొరటోడు, శారద, తాతామనవడు, సిరిసిరిమువ్వ, మామా అల్లుళ్ల సవాల్, శ్రీరంగనీతులు, బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు, నా దేశం, కొండవీటిసింహం, అడవిరాముడు, అన్వేషణ, శ్రుతిలయలు, సూత్రధారులు, మయూరి, సీతా రత్నంగారి అబ్బాయి, బొబ్బిలి రాజా, ఘరానా మొగుడు , మనుషులంతా ఒక్కటే, జగత్ కిలాడీలు, జగత్ జెంత్రీలు, పెదరాయుడు, పెళ్ళి సందడి, శుభాకాంక్షలు, బావగారూ బాగున్నారా, మురారి, నరసింహుడు, అరుంధతి ఇలా ఎన్నో సాంఘిక చిత్రాలలో అద్భుతమైన నటన చూపారు. సుమారు 780 చిత్రాలలో నటించిన సత్యనారాయణకు హీరోగా రాణించలేక పోయానే అనే బాధ అప్పుడప్పుడు కలుగుతుంది. వెంటనే హీరోగా కొనసాగివుంటే డైటింగ్ పేరుతో తిండి తిప్పలకు మొహం వాచి పోయేవాణ్ణి. సుష్టుగా తినడంలో వుండే ఆనందం పొందలేకపోయేవాణ్ణి. ఇలా విభిన్న పాత్రలు పోషించే అవకాశం దకని రొటీన్ హీరో పాత్రలకే పరిమితమవ్వాల్సి వచ్చేదికదా అని కూడా అనిపిస్తుంది అంటారు సత్యనారాయణ.

                                                                                                                           వి.ఎస్. కేశవరావు  99892 35320