Home దునియా మాకూ ఎమోషన్స్ ఉంటాయి!

మాకూ ఎమోషన్స్ ఉంటాయి!

మనుషుల్లాగే కాకులమైన మాకూ చాలా తెలివితేటలున్నాయి. అయినా మమ్మల్ని ఎవరూ పెంచుకోవడానికి ఇష్టపడరు. మా జాతి గురించి కొన్ని విషయాలను మీతో పంచుకుంటాను. మేం కార్విడీ కుటుంబానికి చెందినవాళ్లం. మాలో 40 రకాలున్నాయి. ప్రపంచంలో ఒక్క అంటార్కిటికాలో మినహా అన్ని చోట్లా మేం ఉంటాం. ఆంగ్లంలో మమ్మల్ని క్రో అంటారు. ఈ పదం కార్వస్ అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. మా జీవితకాలం ఏడేళ్లు. అడవి కాకులైతే 14 ఏండ్ల వరకూ బతుకుతుంటాయి. ప్రపంచంలో అతి చిన్న కాకులు డ్వార్ఫ్ జే. 40 గ్రాముల బరువు, 8.5 అంగుళాల పొడవు కలిగి ఉంటాయి. అవి మెక్సికోలో ఉంటాయి.

అతిపెద్దవి కార్విడ్స్ కామన్ రావెన్, థిక్‌బిల్ రావెన్. ఇవి ఇథియోపియాలో ఉంటాయి. ఒక పూర్తి దృశ్యాన్ని ఒక కంటితో మాత్రమే గ్రహిస్తాం. కళ్ల మధ్య దృశ్య అనుసంధానం లేకపోవడమే అందుకు కారణం. సాధారణంగా 27 అంగుళాల పొడవు ఉంటాం. ఇతర ప్రాంతాల్లోని కాకుల్ని మా గుంపులో చేరనివ్వం. ఇకపోతే మా ఆహారం విషయానికొస్తే ఇదీఅదీ అనిలేదు. అన్నీ తినేస్తాం. మా సమూహాన్ని మర్డర్ అంటారు. విటమిన్ డి కోసం సన్‌బాత్ చేస్తాం మీకులాగే.

ఈత కొట్టడం వచ్చు. మాకు జ్ఞాపకశక్తి ఎక్కువ. ఒకసారి చూసిన మనిషిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. నాలుగు నుండి ఐదు గుడ్లు పెడుతాయి. 18 రోజులు పొదుగుతాం. శంఖాకార చెట్లమీద గూళ్లు కట్టుకోవడం ఇష్టం. మాకూ భాష ఉంటుంది. శాస్త్రీయంగా ప్రాంతీయ మాండలికాలను అనుసరిస్తాం. మాకూ ఎమోషన్స్ ఉంటాయి. కోపం, బాధ, ఆకలి, సంతోషం వంటి భావాలను ఒక్కోరకం అరుపు ద్వారా వ్యక్తపరుస్తాం. మా పిల్లలకు హాని తలపెట్టినా, వాటిని బాధించినా గుర్తుపెట్టుకుని పొడుస్తాం. పర్వతాలు, అడవులు, మైదానాలు, పొలాలు, పట్టణ ప్రాంతాల్లోని అనేక రకాల ఆవాసాల్లో జీవిస్తాం. కఠినమైన చలిని తట్టుకోలేం. అందుకే వేరే ప్రాంతాలకు గుంపులుగా వలస పోతుంటాం.