Home తాజా వార్తలు అక్టోబర్‌లోగా 9వ ప్యాకేజీ

అక్టోబర్‌లోగా 9వ ప్యాకేజీ

Kaleshwaram package 9 works should complete

 

నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలి
మరో 30 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు
సిరిసిల్ల జిల్లాలో 666 చెరు వులు నింపేలా కార్యాచరణ
అక్టోబర్ నెలాఖరు నాటికి ఎగువ మానేరును గోదావరి జలాలతో నింపుతాం : కెటిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్ : కాళేశ్వరం ప్యాకేజీ 9 పనులను అక్టోబర్‌లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశించారు. ఈ పనులను మిషన్ మోడ్ తరహాలో చేపట్టాలన్నారు. నిర్ణిత గడువులోగా పనులు పూర్తి చేసి సకాలంలో 30వేల కొత్త ఆయకట్టుకు సాగు జలాలను అందించాల న్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు నిరంతరం నిర్మాణ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. శుక్రవారం ప్రగతి భవన్ లో కాళేశ్వరం ప్యాకేజీ9 పనుల నిర్మాణ ప్రగతిపై నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సిరిసిల్లా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, కాళేశ్వరం ప్రాజెక్టు కరీంనగర్ ఇఎన్‌సి నల్లా వెంకటేశ్వర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ సలహాదారులు పెంచా రెడ్డి, ఎస్‌ఇ సుధాకర్ రెడ్డి, కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీనివాసరెడ్డిలతో మంత్రి కెటిఆర్ సమీక్షించారు.

ఇప్పటి వరకు జరిగిన నిర్మాణ పనుల పురోగతిని మంత్రి కెటిఆర్‌కు అధికారులు వివరించారు. అనంతరం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, పనులు సకాలంలో పూర్తి చేయడమే కాకుండా నాణ్యత పనులపై కూడా పూర్తిస్థాయిలో దృష్టిసారించాలన్నారు. ఇందులో ఎలాంటి పొరపాట్లకు, నిర్లక్ష్యానికి తావివ్వవద్దని సూచించారు. ప్రస్తుతం ప్యాకేజీ..9కు సంబంధించిన 12.035 కిమీ మేర సొరంగం సిమెంట్ లైనింగ్, పంపు హౌస్, సర్జ్ పూల్ పనులను వేగంగా జరిగేందుకు ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ఆదేశించారు. కాంట్రాక్టర్లతో తరుచూ సమీక్షలు నిర్వహించి ప్రాజెక్టును సకాలంలో పూర్తి అయ్యేలా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే అక్టోబర్ నెలాఖరు నాటికి మధ్య మానేరు జలాశయం నుండి ఎగువ మానేరు జలాశయం ను గోదావరి జలాలతో నింపుతామని మంత్రి కెటిఆర్ తెలిపారు.

అప్పటిలోగా ప్యాకేజీ 9కు సంబంధించి ప్రధాన కాలువల, డిస్ట్రిబ్యూషన్ కాలువల భూసేకరణ, కాలువల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. తద్వారా అక్టోబర్‌లో ప్యాకేజీ..9 ద్వారా అదనంగా 30 వేల కొత్త ఆయకట్టుకు సాగు జలాలను అందించే వీలు కలుగుతుందని ఆయన తెలిపారు. అలాగే ఈ నీటితో జిల్లాలోని 666 చెరువులను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నింపేందుకు తక్షణమే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే మన రాష్ట్రమే భారత దేశానికి అన్నపెట్టే రాష్ట్రంగా మారుతుందన్నారు. ఆ దిశగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ముందువరసలో ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు.

Kaleshwaram package 9 works should complete