Home తాజా వార్తలు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యింది… రైతుల కల ఫలించింది…

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యింది… రైతుల కల ఫలించింది…

Kaleshwaram project

 

నీరున్న చోటే అభివృద్ధి వేగవంతం
కేసీఆర్ పట్టుదలతోనే కాళేశ్వరం ప్రాజెక్టు
రిజర్వాయర్‌ల ఖిల్లాగా మారిన సిద్దిపేట జిల్లా
దసరా నాటికి సిద్దిపేటకు గోదావరి జలాలు
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవకాశం లభించడం నా అదృష్టం
పర్యాటక క్షేత్రంగా రంగనాయకసాగర్
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడంతో రైతుల్లో ఉన్న దశాబ్దాల సాగునీటి కల ఫలించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాల్లో భాగంగా శుక్రవారం నియోజకవర్గంలోని చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామం రంగనాయకస్వామి ఆలయ సమీపంలో నిర్వహించిన సంబురాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు సాగు, త్రాగు నీటి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం సిద్దించి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమైందన్నారు.

కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ ఎందుకు తెలంగాణ కావాలో ఒక్క మాటలో చెప్పారని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియమకాల పైనే ఆయన వివరించారని ఇందులో మొదటి అంశమైన నీటి కల కాళేశ్వరంతో సాధ్యమైందన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చడమే లక్షంగా సీఎం కేసీఆర్ పట్టుదలతో ఈ ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయన్నారు. సముద్రంలో వృథా పోతున్న గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మళ్లించడం జరుగుతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరమని అన్నారు. 141 టీఎంసీల సామర్థంతో ఈ ప్రాజెక్టును నిర్మించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద 19 రిజర్వాయర్లు ఉంటాయన్నారు. 100 మీటర్ల నుంచి 620 మీటర్ల ఎత్తు వరకు నీటిని ఎత్తిపోసి దశల వారిగా అన్ని ప్రాజెక్టులు గోదావరి జలాలతో నింపడం జరుగుతుందన్నారు.

స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు పూర్తయినప్పటికి సమైక్య పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ ఒక్క ఎకరానికి సాగునీరందలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. సిద్దిపేట జిల్లా రిజర్వాయర్ల ఖిల్లాగా మారిందన్నారు. జిల్లాలో నాలుగు రిజర్వాయర్ల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ పట్టుదల, ఇంజనీర్ల కృషి, భూనిర్వాసితుల త్యాగఫలితంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకున్నామన్నారు. గత ప్రభుత్వాల పాలనలో ఒక్క ప్రాజెక్టు నిర్మించాలంటే దశాబ్దాల కాలం పట్టేదని అదే సీఎం కేసీఆర్ పాలనలో మూడు సంవత్సరాల వ్యవధిలోనే కాళేశ్వరంను పూర్తి చేసుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి అంతర్రాష్ట్ర ఒప్పందాలు చేసుకోవడంతోనే ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తవుతున్నాయన్నారు.

అలాగే ఢిల్లీ నుండి సైతం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి అనుమతులు సకాలంలో వచ్చాయన్నారు. కేసీఆర్ నాయకత్వంలో టీమ్ వర్క్ చేయడంతోనే పనులు వేగవంతంగా పూర్తయ్యాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయిన కాళేశ్వరం నిర్మాణంలో తాను పాలుపంచుకోవడం పూర్వజన్మ సుకృతమన్నారు. దసరా నాటికి కాళేశ్వరం నీళ్లను సిద్దిపేట ప్రాంతానికి తీసుకువస్తామన్నారు. రంగనాయకసాగర్ గొప్ప పర్యాటక క్షేత్ర ంగా మార్చి పూర్తిస్థాయి సదుపాయాలు కల్పిస్తామన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో కాళేశ్వరం ప్రాజెక్టు కీలకమన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో రైతుల ముఖాల్లో సంతోషం కనబడుతుందన్నారు.

అంతకుముందు కేక్ కట్ చేసి కాళేశ్వరం ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆర్డీవో జయచంద్రారెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకు లు వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, కడవేర్గు రాజనర్సు, మారెడ్డి రవీందర్‌రెడ్డి, ఎర్ర యాదయ్య, వంగ నాగిరెడ్డి, బాల్‌రంగం, వేమలు వెంకట్‌రెడ్డి, కూర మాణిక్యరెడ్డి, బాలకిషన్‌రావు, రాధాకృష్ణశర్మ, జాప శ్రీకాంత్‌రెడ్డి, రాగుల సారయ్య, ఎడ్ల సోమిరెడ్డి, నమూండ్ల రామచంద్రం, పరకాల మల్లేశం గౌడ్, ముక్కిస సత్యనారాయణరెడ్డి, శ్రీహరిగౌడ్, వంగ ప్రవీణ్‌రెడ్డి, కనకరాజు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Kaleshwaram project completed farmers dream come true