Friday, April 26, 2024

అపర భగీరథుడు కెసిఆర్

- Advertisement -
- Advertisement -

ఎంత కష్టం అయినా చలించక, లెక్క చేయక, అనుకున్నది సాధించే వారిని భగీరథునితో ఆ కఠోర శ్రమను, మొక్కవోని దీక్షను ‘భగీరథ ప్రయత్నం’ తో పోల్చడం పరిపాటి. అసాధ్యమైన పనిని సుసాధ్యంగా చేయడం కోసం, లక్ష్య సాధనకై చేసే ప్రయత్నమే భగీరథ ప్రయత్నం. కాళేశ్వర మహా ప్రాజెక్టు రూపకల్పనాదిగా, అద్భుత నిర్మాణాలు మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టుల వల్ల శ్రీరాంసాగర్ నిండని స్థితికి ప్రత్యామ్నాయంగా గోదావరి నీటిని వివిధ దశల ద్వారా ఎత్తి పోస్తూ ఎగువ మార్గంలో ‘వరద కాలువ’ ద్వారా శ్రీ రామ్ సాగర్ జలాశయానికి నిరంతరం నిండుతనం కలిగించే బృహత్ కార్యక్రమానికి కెసిఆర్ నడుం బిగించారు.

Kaleshwaram Project construct by KCR

తెలంగాణలో, కోటి ఎకరాలకు సాగు నీటిని అందించే, బృహత్ లక్ష్యంలో భాగంగా, మానవ నిర్మిత మహాద్భుత ప్రాజెక్టు నిర్మాణం, రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి జలాలను ఎత్తి పోస్తూ, శ్రీరాంసాగర్ జలాశయం నింప డం, ఇంటింటికీ త్రాగు నీరు అందించడం లాంటి అనూహ్య కార్యక్రమాల ద్వారా, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ‘అపర భగీరథుడు’ గా పదే పదే కీర్తించబడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలోనే కాక, ఇతర ప్రాంతాలలో, రాష్ట్రంలో అధికార, విపక్షీయులలో, సామాన్య ప్రజానీకం నోళ్లలో విస్తృతంగా నానుతున్న పదం “భగీరథ”.. ఇంతకు ‘మిషన్ భగీరథ’ పేరు ఎందుకుపెట్టారు? కెసిఆర్‌కు ‘అపర భగీరథ’ పర్యాయపదం ఎందుకు వాడుతున్నారు? అంటూ మిషన్ భగీరథ పద వినియోగంపై సర్వత్రా చర్చలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి సదరు నేపథ్యాన్ని పరిశీలిస్తే….

గంగ దేవలోకంలో ‘మందాకిని అని, భూలోకంలో ‘భాగీరథి’ అని, పాతాళంలో ‘భోగవతి’ గాను ప్రసిద్ధి కెక్కుతుందని బ్రహ్మదేవుడు భగీరథునికి వివరించాడు. అందుకే గంగకు ‘త్రిపధగ’ అనే పేరు వచ్చింది. త్రిపధగ అంటే మూడు లోకాల్లో ప్రవహించేదని అర్దం. భగీరథుడు తన పితృ దేవతల పుణ్య లోకాల ప్రాప్తికై, మొదట బ్రహ్మను, తర్వాత శివుని తపస్సుతో మెప్పించిన ఫలితంగా, శివానుగ్రహం ద్వారా, దిజ గంగ భువికి రాగానే తన తలపై మోపి, జటాజూటంలో బంధించాడు. భగీరథుడి ప్రార్ధనతో పరమ శివుడు ఒక పాయను నేలపైకి వదలాడు.

గంగను హిమాలయ పర్వతాలలో బ్రహ్మదేవుడి చేత నిర్మించబడిన బిందు సరోవరంలో పడేలా విడిచిపెట్టాడు. నదుల మార్గాన్ని నిర్దేశించ గల అధికారం ఒక్క బ్రహ్మదేవుడికే ఉంది. సృష్టి ప్రారంభంలో ఆయనే నది ప్రవాహ మార్గాన్ని నిర్దేశించాడు. భరత ఖండాన్ని ఏలిన షట్చక్రవర్తులలో ఒకరైన ‘సగరుని’ ముని మనుమడే ‘భగీరథుడు’. సగర చక్రవర్తికి కేశిని, సుమతి అని ఇరువురు భార్యలు ఉండే వారు. కేశిని సుతుడు అసమంజసుడు కాగా, సుమతి కుమారులు 60 వేల మంది. సగర చక్రవర్తి 99 అశ్వమేధ యాగాలు పూర్తి చేసి, నూరవ యాగం చేసే సమయాన, నూరు పూర్తయితే, ‘ఇంద్రపదవి’ పొందగలడని భయకంపితుడై ఇంద్రుడు యాగాశ్వాన్ని, తపో నిష్ఠలో నిమగ్నమై ఉన్న కపిల మహర్షి వద్ద కట్టేసి వెళతాడు. సగరుని కుమారులు 60 వేల మంది యాగాశ్వాన్ని వెతికే పనిలో నిమగ్నమై దానిని పాతాళంలో కనుగొంటారు. అశ్వాన్ని తెచ్చింది కపిల మహర్షి అని భావించి ఆయనను దుర్భాషలాడుతూ తపోభంగం కలిగిస్తారు. తద్వారా కపిల మహర్షి క్రోధాగ్నికి బలై భస్మమైపోతారు. యాగాశ్వం కోసం వెళ్ళిన కుమారులు రాకపోయే సరికి, సగరుడు తన పౌత్రుడు అసమంజసుని, పుత్రుడైన అంశుమంతుని వెదక పంప గా, పాతాళంలో చితాభస్మపు గుట్టను చూసి, బాధపడి, పవిత్ర గంగా జలాల స్పర్శతోనే వారికి పూర్వ లోక ప్రాప్తి కలగగలదని, ‘అశరీరవాణి’ ద్వారా తెలుసుకొని వెను తిరుగుతాడు. సగరుడు, అంశుమంతుడు, తర్వాత దిలీపుడు రాజ్యాన్ని పాలించారు.

అనంతరం దిలీపుని కుమారుడు ‘భగీరథుడు’ పిన్న వయసులో రాజ్యాధికారం చేపట్టి, తమ పూర్వీకులకు సద్గతుల ప్రాప్తి కలగలేదని, తల్లి ద్వారా తెలుసుకొని, ‘ఆకాశ గంగ’ ను, భూమి మీదకు తెస్తానని చెప్పి వెళ్లి, లక్ష్య సిద్ధికై, బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేయగా, బ్రహ్మ ప్రత్యక్షమై భగీరథుని కోరిక నెరవేరగలదు అని, అయితే ఆకాశం నుండి మహోధృతంగా కిందికి దూకనున్న గంగ భువి పైన పడితే జరగనున్న పరిణామాలు కష్టమని, ఈశ్వరుని ప్రసన్నం చేసుకోమని మార్గోపదేశం చేయడం జరుగుతుంది. భగీరథుడు మరోసారి పరమ శివుని ప్రసన్నం చేసుకోవడానికి ఉద్యుక్తుడై తిరిగి ఘోర తపమాచరించి సఫలీకృతుడవుతాడు. తత్ఫలితంగా శివుడు, దివి నుండి దూకిన ‘సురగంగ’కు, తన జటాజూటాన్ని ఆధారంగా, ఆసరాగా చేయగా, ‘ఆకాశగంగ’ ‘శివగంగ’ గా మారి, దివి నుండి భువికి దూకి భగీరధుని వెంట పరుగులు తీస్తుంది.

దారిలో జాహ్న ముని ఆశ్రమంలో చిందులు వేయగా, ఆయన కోపగ్రస్తుడై, అమాంతం గంగను ఔపోసనం పడతాడు. ఇంత శ్రమ కోర్చి తీసుకెళుతున్న గంగను, జాహ్న ముని తాగడంతో బాధపడి, అయినా పట్టువీడక, భగీరథుడు, గంగను వదిలి వేయమని ప్రార్థించగా, జాహ్నముని తన చెవి ద్వారా గంగను వదులుతాడు. అలా ‘భగీరథి’, ‘జాహ్నవి’గా పాతాళం చేరి, ‘పాతాళ గంగ’ గా మారి, సగర పుత్రుల చితాభస్మం మీదుగా ప్రవహించి, వారికి సద్గతులు కలిగిస్తుంది. ఎంత కష్టం అయినా చలించక, లెక్క చేయక, అనుకున్నది సాధించే వారిని భగీరథునితో ఆ కఠోర శ్రమను, మొక్కవోని దీక్షను ‘భగీరథ ప్రయత్నం’ తో పోల్చడం పరిపాటి. అసాధ్యమైన పనిని సుసాధ్యంగా చేయడం కోసం, లక్ష్య సాధనకై చేసే ప్రయత్నమే భగీరథ ప్రయత్నం.
కాళేశ్వర మహా ప్రాజెక్టు రూపకల్పనాదిగా, అద్భుత నిర్మాణాలు మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టుల వల్ల శ్రీరాంసాగర్ నిండని స్థితికి ప్రత్యామ్నాయంగా గోదావరి నీటిని వివిధ దశల ద్వారా ఎత్తి పోస్తూ ఎగువ మార్గంలో ‘వరద కాలువ’ ద్వారా శ్రీ రామ్ సాగర్ జలాశయానికి నిరంతరం నిండుతనం కలిగించే బృహత్ కార్యక్రమానికి కెసిఆర్ నడుం బిగించారు.

నిజానికి మానవ నిర్మిత మహాద్భుత ఆవిష్కరణ కాళేశ్వరం ప్రాజెక్టు. కెపాసిటీలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా, మహదేవ్ పుర్ మండలం, మేడిగడ్డ వద్ద, ఈ బృహత్ కార్యక్రమంలో భాగంగా 1.2 లక్షల కోట్ల అంచనాలతో 1832 కి.మీల పొడవు, 2532 కి.మీల గ్రావిటీ కెనాల్స్, 204 కి.మీల సొరంగ మార్గాలు, 3 బ్యారేజీలు, 20 లిఫ్టులు, 19 పంపు హాజ్‌లు, 88 పంపులు, 98 కి.మీల ప్రెషర్ పైపులైన్లు, 4992 మెగావాట్ల విద్యుత్ వినియోగంతో, 147 టిఎంసి ల విస్తీర్ణంలో, 40 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు లక్ష్యంగా చేపట్టిన అనూహ్య, అద్భుత నిర్మాణాలు పనులు 2016 మే 3న శంఖు స్థాపన జరిపి 2019 జూన్ 21న గవర్నర్ నరసింహన్, సిఎంలు జగన్, ఫడ్నవీస్ తదితర ప్రముఖుల, ఉన్నతాధికారుల భాగస్వామ్యంతో ప్రారంభం చేయబడి, క్రమానుగతంగా, సాకారమవుతూ ఇటీవలే 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే రంగనాయక సాగర్ నుండి మల్లన్న సాగర్ సర్జిపూల్‌కు, కుడి, ఎడమ కాలువలకు మంత్రులు హరీష్ రావు, కెటిఆర్ తదితరులు నీటి విడుదల చేశారు.

కొండ పోచమ్మ రిజర్వాయర్‌కు నీటిని అందించే దిశగా అధికారులు చేసిన కృషి ఫలితంగా ప్రస్తుతం కాళేశ్వరం నీరు సిఎం స్వంత జిల్లాకు చేరి, తద్వారా మహాద్భుత ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం చివరకు చేరుకుంటున్నది. ఇటీవల జూన్ మాసాంతంలో కొండ పోచమ్మ ఆలయంలో చిన్న జీయర్ స్వామితో కలిసి హోమంలో పాల్గొని, కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టులోనికి నీటిని ముఖ్యమంత్రి కెసిఆర్ విడుదల చేశారు. కెసిఆర్ ప్రణాళికాబద్ధ కార్యక్రమాల సఫలీకృత నేపథ్యం, ‘భగీరథ ప్రయత్నం’ అనడంలో రవంతైనా అతిశయోక్తి లేదు. అనన్య సామాన్య అద్భుత ఆవిష్కరణలు, తెలంగాణ ప్రభుత్వాధినేతను ‘అపర భగీరథ’ నామాలంకృతుల గావిస్తున్నాయి. గోదావరి నీటితో తెలంగాణ ప్రజల దాహార్తి తీర్చడం, బంగారు పంటలు పండించడం లక్ష్యాల కోసం కేసిఆర్ అకుంఠిత దీక్షాదక్షతలు, అంకితభావం, చేస్తున్న అనన్య సామాన్య కృషి ఫలితంగా తెలంగాణ తొలి, మలి ప్రభుత్వాధినేత ‘అపర భగీరథ’ పదాంకితులు కావడం అత్యంత ఉచితం, సమంజసం.

ఆర్‌కె సంగనభట్ల
9440595494

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News