Friday, April 19, 2024

కాలం రెక్కలపై నడిసొచ్చిన కవి

- Advertisement -
- Advertisement -

Kaloji narayana rao books in telugu

ప్రజాకవి కాళోజీ కాలం రెక్కలపై నడిసొచ్చిన కవి. ఆయనను క్షోభపెట్టిన ప్రతి సంఘటనను కవిత్వం చేసిన మహానుభావుడు. జీవితం తడి తెలిసిన వారే సంఘానికి కావాల్సిన రచనలను అందించగలుగుతారు. జీవితంలోని భిన్నకోణాలు చూడగలగాలి చూడటమే కాదు అనుభవించగలిగాలి. ఆ అనుభవాలను పలవరించి పదాలు కట్టగలిగినవాడే భవిష్యత్ దార్శనికులుగా నిలబడగలుగుతారు. కాళోజీ దార్శనికుడు కాబట్టే తన ఎక్స్‌రే కళ్లతో సమాజాన్ని దర్శించి కవిత్వం రాసాడు. ఏ సూర్యరశ్మి కిరణాలు లేకుండా వికసించగలిగే సహజ పుష్పాలాంటివి కాళోజీ గేయాలు. ఛందస్సులయల శబ్దాలు, డాంభికాలు, అదరగొట్టడం, మడికట్టుపదాలన్నీ ఒకప్పుడు సాహిత్య అంశాలుగా చెలామణి అయ్యాయి. కాని కాళోజీ, కవిత్వానికి అలంకారశాస్త్రాలు, విమర్శకులు ప్రమాణం కాదని, సామాన్య ప్రజల బాధల, గాధలని చిత్రించేటప్పుడు సామాన్యుడికి అర్థమయ్యే రీతిలోనే కవితా శిల్పం ఉండాలని కాంక్షించినవాడు. అలా తాను రాసినంత కాలం దాన్నె నమ్ముకొని అట్లాగే రాసిండు.

ప్రజల గురించి ప్రజల భాషలో, ప్రజల కోసం కవిత్వం రాసినవాడు. సోక్రటీసిలా, రూసోలా ప్రశ్నిస్తూ పోయినవాడు యుద్ధంలో ఫ్రాన్స్ కవులంతా చెల్లా చెదురుగా పారిపోతే ‘లూయి అరగాన్’ ఒక్కడే దేశంలో నిలబడి మహా ప్రజా విశ్వాసాన్ని వెల్లడించే గీతాలు రాశాడు. కాళోజీ ‘లూయి అరగాన్’ వంటివారు. లూయి ఆరగాన్‌లా ఎక్కడికీ పారిపోకుండా తెలంగాణ గడ్డ మీదనే నిలబడి తన ప్రజల పక్షాన రచనలు చేసి తెలంగాణ మూగజీవుల హృదయాల్ని ప్రతిబింబిపజేశాడు అని శ్రీశ్రీ కాళోజీని ప్రశంసించాడు. తెలంగాణ ప్రజల మూగ హృదయాల ఘోషను తన కవిత్వంలో ప్రతిబింబింపజేశాడు.
కాళోజీ నిజాం నిరంకుశ పాలనపై ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేసిన ఉద్యమకవి. ఆయన జీవితమే ఒక ఉద్యమం ‘తల్లి కోడి పిల్లల్ని’ కాపాడుకున్నట్లు తెలంగాణ ప్రజల్ని తన కవిత్వపు రెక్కల కింద దాచి శత్రువుల నుండి రక్షించినవాడు. అలా క్రూరమైన నిజాం నిరంకుశ పాలన మొదలు, నిన్నటి సీమాంధ్ర వలస దోపిడీ దాకా స్థానిక, స్థానికేతరుల కుట్రల, కుతంత్రాలకు భయపడకుండా ధైర్యాన్ని గుండెనిండా నింపుకుని సరిహద్దుల దగ్గర తుపాకి పట్టుకుని సాహసరూప సైనికుడిగా తన నేలమీదనే తన ప్రజలపక్షాన నిలబడి ఉత్తేజితమైన కవిత్వం రాసి తెలంగాణ బిడ్డలను కార్యోన్ముఖుల్ని చేసిన కాళోజీ

‘తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకః”

తెలుగు కవిత్వంలో కాళోజీది విభిన్న స్వరం. ఇతర కవులతో పోల్చినప్పుడు ప్రజాస్వామిక లక్షణం ఎక్కువ. ప్రజల ఆలోచనలను, ఆకాంక్షలను అర్థం చేసుకొని తన ఆలోచనలను సవరించుకున్న ఉత్తమ వ్యక్తిత్వం కాళోజీది. కాళోజీ ఒక వ్యక్తి కాదు, శక్తి ఆయన భాగస్వామి కాని ప్రజా ఉద్యమంలేదు. ప్రజాస్వామిక భావనకు అత్యంత విలువనిచ్చే కాళోజీ కవిత్వంలో అనేక పార్శ్వాలున్నాయి. అందులో ఒకటి 1969 తెలంగాణ ఉద్యమ కవిత్వం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కాళోజీ విశేషమైన కవిత్వం వెలువరించి ప్రజాస్వామిక లక్షణాన్ని నిరూపించుకున్నాడు.

తెలంగాణ ఉద్యమాల చరిత్రలో 1969 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానిది ప్రత్యేక అధ్యాయం. ఆరు నెలల కాలంలోనే దేశాన్ని అట్టుడికించిన ఉద్యమమది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను వణికించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మహత్తర ఉద్యమం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. అలా 1969లో తలెత్తిన ప్రేత్యక తెలంగాణ ఉద్యమం నుంచే మనసా వాచా కర్మణా తెలంగాణను కోరుతూ ఉవ్వెత్తున కవితలు రాసిన వ్యక్తి. 1969 నుండి 1972 వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక తెలంగాణ స్ఫూర్తిని రగిలించినవాడు. ఉద్యమానికి హృదయమిచ్చి, గళం విప్పి గర్జించిన వ్యక్తి. ఎన్నికలలో తెలంగాణ నాదాన్ని గెలిపించమని ప్రచారం చేసిన వ్యక్తి. అన్యాయం ఎక్కడ ఉన్న పసిగట్టి ఎదురించే వ్యక్తి కాబట్టే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తొందరలోనే గ్రహించి, తాను మేల్కొని, ఇతరులను మేల్కొలిపాడు.

కాళోజీది ఒక రకంగా గేయ కవిత్వం. అది నిత్యప్రాసంగికమైంది. కాలం మారుతున్న కొద్దీ కాళోజీ పాళీ మారుతూ మరింత పదునెక్కింది. నిజానికి తనకు తానే చెప్పుకున్నట్టు తొలుత కాళోజీ విశాలాంధ్ర వాది మారిన కాలంలో మారిన మనుషుల నిజస్వరూపం గ్రహించి ఆగ్రహించిన కాళోజీ. అందరికీ భ్రమలున్నట్లుగానే లేదా నమ్మినట్లుగానే విశాలాంధ్రను కాళోజీ నమ్మిండు. కానీ కొద్ది కాలంలోనే “నమ్మి నానబోస్తే పుచ్చి బుర్ల్రైనట్టు” తెలంగాణ వట్టిపోవడాన్ని చూసి తట్టుకోలేక పోయాడు కాళోజీ. అందుకే ఆయన ‘ఎవరునుకున్నారు? ఇట్లౌవుననీ? గేయంలో అంటాడు.

ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు
ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని
హామీలిచ్చినవారే అంత స్వాహా చేస్తారని
ముఖ్యమంత్రియే స్వయముగ సఖ్యత ఛేదిస్తాడని
ప్రాంతీయాధ్యక్షుండు ప్రక్క తాళమేస్తాడని
ప్రాంతాన్ని పాడు చేసి శాంతి శాంతి అంటారని
కడుపులో చిచ్చుపెట్టి కళ్ళు తుడవ వస్తారని”
అభయమిచ్చి కుత్తుకనే అదిమి అదిమి పడతారని

ఈ గేయం వింటుంటే తెలంగాణ ప్రజల్లో నరనరంలో ఆవేశంతో ఊగిపోతారు. ఆంధ్రుల నీచత్వాన్ని ఎండగడుతారు. ఆంధ్ర నాయకులు ఓట్లు పొంది సీటు దొరికిన తర్వాత నోట్లో మన్నుపోస్తారని నమ్మక ద్రోహం చేస్తూ, ఏమి తెలియనట్లుగా కూర్చుంటారన్న సత్యాన్ని కాళోజీ చిత్రించారు. అక్కడి నుండి కాళోజీ మడమ తిప్పని అక్షరసాగు చేశాడు. కుట్రల కుత్తుకలను తెగ్గోసె కవిత్వ సృష్టి చేశాడు. తెలంగాణ మాగాణంలో అక్షర విత్తులు చల్లాడు.

కోస్తాంధ్రులను నమ్మి పెత్తనమిచ్చినందుకు తెలంగాణ మిగులు నిధులను తెలంగాణ ప్రాంతాభివృద్ధికి వాడక పోగా, ఆంధ్రప్రాంతాభివృద్ధికి కేటాయించాడు. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డి ముఖ్యమంత్రి వ్యవహారాన్ని కాళోజీ బట్టబయలు చేశాడు ‘నిర్వాకం’ అనే కవితలో
‘నమ్ముకొని పెత్తనమిస్తే / నమ్మకము పోగొట్టుకుంటివి
కుప్పకావలి వుండి కట్టలు / తప్ప దీస్తివి ముద్దెరేస్తివి
సాటివాడు చేరదీస్తే / నోటినిండ మన్నకొడ్తివి
చిలిపి చేష్టలు చేసి యిప్పుడు’ / చిలుక పలుకులు పలుకు చుంటివి” అంటూ వ్యగ్యంగా కవితా చురకలు వేశాడు.

‘తెలంగాణవేరైతే’ కవితలో కాళోజీ ప్రశ్నించిన తీరు ఆలోచించదగినది. తెలంగాణ వేరైతే దేశానికి వచ్చిన నష్టమేమిటని కాళోజీ ఆ రోజుల్లోనే తన ధిక్కార స్వరాన్ని వినిపించాడు.
‘తెలంగాణ వేరైతే / దేశానికి ఆపత్తా? / తెలంగాణ వైరైతే / తెలుగు భాస మారుస్తారా?
తెలంగాణ వైరైతే / కిలో గ్రాము మారుతుందా? / తెలంగాణ వైరైతే / తెలివి తగ్గిపోతుందా? / పాకాల, లఖ్నవరం / పారుదలలు ఆగుతాయా? గండిపేటకేమైనా / గండి తూటు పడుతుందా? అంటూ కాళోజీ ఎందుకు తెలంగాణ వద్దంటున్నారో చెప్పండంటూ ఆంధ్ర నాయకులను నిలదీసి ప్రశ్నించాడు. తెలంగాణ వేరైతే కులం తగ్గిపోతుందా, బలం సన్నగిల్లుతుందా, రూపాయికి పైసలు నూరు కాకపోతాయా? అంటూ దేశానికి విపత్తులాగా వేర్పాటువాద తెలంగానను చూడడం సరికాదన్నాడు.
మధ్యంతర ఎన్నికలలో ప్రచారంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. లాఠీచార్జీలు, కాల్పులు, హత్యలు కొనసాగాయి. కాల్పులకు భయపడక ఓటర్లు గుండే ధైర్యంతో ప్రత్యేక తెలంగాణను కోరే ‘ప్రజాసమితి’కి విజయాన్నందించమని కవితా ఢంకా మోగించాడు కాళోజీ.
ఓట్లు ఓట్లు ప్రజాస్వామ్య / ఓట్లన్నీ ఒకవైపు
షాట్లు షాట్లు ఫాసిస్టుల / షాట్లన్నీ మరోవైపు
ఓట్లమో వేరు వేరు / రాజ్యాలు అంటున్నాయి
షాట్లేమో ప్రేలి ప్రేలి / ఓట్లను నులిమేస్తున్నాయి
షాట్లు ప్రేలి అయిపోతే / ఓట్లు మిగిలి పాలిస్తే
ఆంధ్ర తెలంగాణ నేడు / రాజ్యాలై రాణిస్తే
జై జై జై తెలంగాణ / జై జై ఆంధ్ర
డయ్యర్, భాసీంరజ్వీ / డౌను, డౌను, డౌను, డౌను

ఎన్నికల్లో ‘తెలంగాణ ప్రజాసమితి’ మహమహులను మట్టి కరిపించి తెలంగాణలో పోటీ చేసిన 14 నియోజకవర్గాల్లో విజయం సాధించి లోకసభలో ఎనిమిదవ పెద్దపార్టీగా అవతరించింది.
‘తెలంగాణ ప్రజాసమితి’ అనే కవిత ఒక పార్టీ పేరు లాగా పెట్టడం ఆయన తెలంగాణ ఆకాంక్ష ఎంత బలంగా వున్న విషయం అర్థమౌతుంది. కాళోజీ తెలంగాణ సమితి అన్న పేరు ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (టిఆర్‌ఎస్)గా ఆవిర్భవించిందని భావించవచ్చు. ఈ ‘తెలంగాణ సమితి’ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడుతున్న రాజకీయసంస్థ. ఈ సంస్థ తెలంగాణ కోసం పోరాడిందని, ఎన్నడు తలదించుకోలేదని కాళోజీ శ్లాఘించిన వైనం తెలుస్తుంది. ఆంధ్ర. ప్ర.రా. ద్వివిభజన చెందడం అసాధ్యమన్న జలగం వెంకగళ్రావు ప్రకటనను నిర్భయంగా ఖండిస్తాడు కాళోజి.
‘తెలంగాణ ప్రజాసమితి / తలదించుకొన్నదెపుడు?
బైఫర్‌కేషన్ డిమాండు / బైలు దేరదిక అనుటకు
తెలంగాణ వేరు మాట / తల ఎత్తదు అంటావా?
ఆ మాట తలవంచిందని / అనుకొంటవా ఎర్రొడా?
ము.మ వెర్రి వెంగళప్ప / ముఠాతత్త్వ తొత్తుకొడక
నువ్వుండవు నిన్న కన్న / ప్ర.మ. కూడ మిగిలుండదు”

అంటూ తెలంగాణను విమర్శించే హక్కు ఎవ్వరికి లేదంటూ, భారతదేశంలో తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ రాష్ట్రం వేరై నిలిచి భాసిస్తుందని భవ్యదర్శనం చేశాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడానికి, వీర తెలంగాణ పోరాటం చేసిన వారసులు వేరు తెలంగాణ కోరుకోరని కొందరు కవులు పద చమత్కారం చేస్తే కాళోజీ అంతే చమత్కారంతో ప్రజల ప్రభలమైన తెలంగాణ రాష్ట్ర కాంక్షను వ్యక్తం చేశాడు.
‘వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది
వేరై కూడా తెలంగాణా వీర తెలంగాణ ముమ్మాటికి
తెలంగాణ వేరై నిలిచి భారతాన వెలుయు ముమ్మాటికి’

మాయమర్మంలేని తెలంగాణ ప్రజల తత్వాన్ని ఆవిష్కరించాడు. నరనరంలో తెలంగాణా పౌరుషాన్ని, ఆ ప్రాంతపై వున్న మమకారాన్ని, భక్తిని ఈ కవితలో స్పష్టపరిచినాడు. వీర, వేరు రెండు తెలంగాణాలుండవు, చారిత్రక సందర్భం నుంచే రెండు దశలుత్పన్నమైనాయని అన్ని దశల్లో వీర తెలంగాణగానే వుంటుందని నిర్బయంగా గొంతెత్తి చాటాడు. ఆంధ్రనాయకులకు వత్తాసు పల్కిన కవులను తీవ్రంగా నిరసించాడు. ఇట్లా కాళోజీ భావాల్ని ప్రజల్లోకి తీసుకపోయి తెలంగాణ ప్రజల్ని ఉద్యన్మోఖులుగా తయారు చేసినవారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట చంద్రశేఖర్‌రావు గారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా 151969న వరంగల్లులో జరిగిన ప్రజాసమితి సదస్సులో కాళోజీ కవిత ‘ప్రాంతంవాడే దోపిడి చేస్తే ప్రాణంతోనే పాతరవేస్తం’ అని తెలంగాణ మనస్తత్వాన్ని చిత్రించాడు. తెలంగాణ ఉద్యమానికి నినాదాలుగా ఈ కవితను వాడుకున్నారు.
“దోపిడి చేసే ప్రాంతేతరులను /దూరం దాకా తన్ని తరుముతం / ప్రాంతం వాడే దోపిడి చేస్తే / ప్రాణంతోనే పాతరవేస్తం / దోస్తుగ వుండే వారితో మేమును /దోస్తే చేస్తం ప్రాణమిస్తం/ ఎంతకు అంత అన్న ధోరణితో /చింతమాని బతుకును సాగిస్తాం” అంటూ తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తనదైన రీతిలో స్పష్టంగా ప్రకటించాడు. ఈ కవిత తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా పేర్కొనవచ్చు. ఆఫ్‌కోర్స్ ‘ప్రజాకవి కాళోజీ’ ప్రశంసలు కోరుకులేదు. కాని తెలంగాణ ప్రజావాణిని బద్దలు కొటినట్లు చెప్పుట కాళోజీ ప్రత్యేకత.
“తెలంగాణ మాది తెలంగాణ మాది / తీరానికి దూరాన వున్నది / ముంచేయత్నం చేస్తే తీరం / మునుగును తానే మునుగును తప్పక”
నియంత నిజాం పాలననే అంతం చేసిన తెలంగాణ ఇది. దీన్ని దోచుకోవాలని, దోచుకుని ఈ ప్రాంతాన్ని ముంచేయాలని చూస్తే కుదరని పని. ముందే మునిగేది కోస్తా ప్రాంతం. అది సముద్ర తీర ప్రాంతంలో ఉందని కాళోజీ వ్యంగ్యంగా చెబుతాడు.

1969 నాటికి తెలంగాణపై పరిపక్వ కవిత్వం రాయటం మాత్రమే కాదు, తెలంగాణ సాహిత్యానికి కాళోజీ మహపర్వతంగా నిలిచాడు. తన రెండు కళ్ళను తెలంగాణకు అతికించి వెళ్ళాడు. తన చూపుతో తెలంగాణ సాహిత్యాన్ని వీక్షించాడు. ఆరాధించాడు. అర్థించాడు, ఆరాటపడ్డాడు. ఆయన మహోన్నత సాహిత్య వ్యక్త్తిత్వం గలవాడు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం కొనసాగించటంలోనే కాదు, తెలంగాణ రాష్ట్ర పునర్‌నిర్మాణంలో కూడా కాళోజీ ఆశయాల స్ఫూర్తి ఎంతో వుంటుంది.
70 ఏళ్ళ తెలంగాణ రాజకీయ, సాంస్కృతిక చరిత్రలో కాళోజీది ఓ సజీవమైన అధ్యాయం. తెలంగాణ జనజీవనం, పోరాటాలు, ప్రకృతి పరిసరాలు సృష్టించిన స్వచ్చమైన అగ్నిచైతన్యం.
నేడు యావత్ ప్రపంచం కుగ్రామమై, ఒక చిన్న సెల్‌ఫోన్ స్క్రీన్ మీద ఒదిగిపోయి దేశవిదేశాల జనం మన దగ్గర, మన కళ్ళముందు ఉన్నట్టే ఉండి మనకు దూరమౌతున్న నేపథ్యంలో ఒక విశాలమానవ సాన్నిహిత్యాన్ని స్నేహమయ జీవితాన్ని కలలుకన్న కాళోజీని తలచుకోవడం ఇవాళ మనకెంతో స్ఫూర్తిదాయకం.

(సెప్టెంబర్ 9 కాళోజీ జయంతి సందర్భంగా…)

ఆగపాటి రాజ్‌కుమార్
8309706806

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News