*మద్దతు పలికిన అన్ని పార్టీల నాయకులు
ట్రాఫిక్ స్తంభించి రాక పోకలకు అంతరాయం
రైతులపై పోలీసుల దౌర్జన్యం
హోరెత్తిన ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు
మనతెలంగాణ/యాలాల/తాండూర్ : గత రెండు రోజులుగా కందుల కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం కొనుగోళ్ళను నిలిపి వేసిన విషయం విధితమే. కొనుగోలు కేంద్రాల మూసివేతకు నాలుగు రోజుల ముందు నుంచే కొనుగోలు కేంద్రం వద్ద తమ తమ ధాన్యపు బ్తలతో పడిగాపులు కాస్తున్న రైతులు మంగళవారం కూడా డిసిఎంఎస్ అధికారులు కొనుగోలును చేపట్టక పోవడంతో ఆకలి దప్పులతో, నిద్రలేక విధిలేని పరిస్థితుల్లో కడుపు మండి లక్ష్మినారాణపూర్ కూడలిలో మంగళవారం రోడ్డుపై ధర్నాకు దిగారు. రైతులు చేపట్టిన ధర్నాకు ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి, టిడిపి, వామపక్ష పార్టీల మండల స్థాయి నాయకులు రైతులకు మద్దతుగా నిలువడంతో అర గంటలో చల్లారుతుందనుకొన్న ధర్నా కార్యక్రమం సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ ఈ కొనుగోలు కేంద్రాల తంతును గమనిస్తే అత్తను కొలుసుకో, కోడలిని దొంగిలించుకో అన్న చందంగా రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. తాండూరు ప్రాంతం కంది పంటకు ప్రసిద్ది చెందిందనీ, ఈ ప్రాంత కంది పప్పుకు దేశవ్యాప్త గుర్తింపు ఉందని, అందువల్లనే ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన కొనుగోలు కేంద్రాలలో ఎక్కువశాతం కేంద్రాలను తాండూరు ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకున్న రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాటలు వట్టి మూటలవలే కనిపిస్తూన్నాయని రైతులు వాపోయారు. ఈ క్రమంలోనే సమయం పెరిగే కొద్ది లక్ష్మినారాయణపూర్ కూడలి లోని నలువైపుల గల రోడ్లపై వాహనాల సంఖ్య పెరుగడంతో ట్రాఫిక్ జాం అయింది. దీంతో రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో యాలాల పోలీసులు గ్రామీణ సిఐ సైదిరెడ్డిలు ధర్నా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. లక్ష్మినారాయణపూర్ కూడలిలోని కందుల కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్ళు ప్రారంభించే వరకు ఇక్కడినుండి లేచేది లేదని రైతులు పోలీసులకు తెగేసి చెప్పారు. అప్పటికే కూడలికి నలు వైపుల రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి రాక పోకలకు అంతరాయం ఏర్పడి ప్రజలు గంటల తరబడి ఇబ్బందులు ఎదుర్కంటున్నారని, ఆర్‌డిఒ, స్థానిక తహశీల్దార్, తో మాట్లాడి సమస్యకు పరిష్కారమార్గాన్ని తెలుసు కుంటున్న తరుణంలో పోలీసులు ఓ రైతుపై చెయ్యి చేసుకున్నారు. ఈ పెనుగులాటలో పోలీసు బూట్ల కింద మరో రైతు కాలి వేళ్ళు నలిగి పోయి రక్తగాయాలు అయ్యాయి. అప్పటికే తమ ధాన్యం కొనుగోలు ఆగిపోయి కడుపు మంటతో ఉన్న రైతులో పోలీసు చర్యలు మరింత కోపాన్ని తెప్పించడం ద్వారా ప్రభుత్వం తో పాటు రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డిపై వ్యతిరేక నినాదాలతో లక్ష్మినారాయణపూర్ కూడలి మారుమోగింది. స్థానిక తహశీల్దార్ అశోక్ కుమార్ రైతుల ధర్నా స్థలానికి చేరుకొని మంత్రి మహేందర్‌రెడ్డి మరో మంత్రి హరీశ్ రావు తో మాట్లాడటం జరిగిందని బుధవారానికి సమస్య ఓ కొలిక్కి వస్తుందని చెప్పడంతో రైతులు ఆపూటకు శాంతించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆయా పార్టీలకు చెందిన నాయకులు అక్బర్‌బాబా, రవీందర్‌రెడ్డి,మైపాల్, బుగ్గప్ప, యాదప్ప, చంద్రశేకర్‌రెడ్డి, వివిద గ్రామాలకు చెందిన రైతులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
మంత్రి ఆదేశించినా ప్రారంభం కాని కేంద్రాలు
ప్రభుత్వం కంది పండించిన రైతులకు మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వ రంగ మార్క్ ఫెడ్ ద్వారా కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది.అయితే తాండూరు ప్రాంతంలో కంది పంటను విస్తారంగా సాగుచేస్తున్నారన్న ఉద్దేశంతో తాండూరుతో పాటు పెద్దేముల్,యాలాల మండలం లకా్ష్మనారాయణపూర్,బషీరాబాద్ మండల కేంద్రాలలో ఉప కొనుగోలు కేంద్రాలను గత 15 రోజుల క్రితం మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు.ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5450లకు కొనుగోలు చేస్తున్నారు.అయితే గత రెండు రోజుల క్రితం పెద్దేముల్.,లక్ష్మినారాయణపూర్,బషీరాబాద్‌లలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు ఉప కేంద్రాలను ఎత్తివేశారు.దీంతో రైతులు గత రెండు రోజులగా ఆందోళన బాటపట్టారు.పెద్దేముల్,బషీరాబాద్‌లలో రైతులు రాస్తారోకో నిర్వహించారు.ఇందుకు స్పందించిన మంత్రి మహేందర్‌రెడ్డి సోమవారం రాత్రి బషీరాబాద్‌లో ఉన్న కందుల కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులతో మాట్లాడి అక్కడి నుండి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హారీష్‌రావుకుసైతం పోన్‌లో మాట్లాడారు.అయిన మంగళవారం కందుల కొనుగోళు కేంద్రాలను అధికారులు ప్రారంభించలేదు.దీంతో మంగళవారం రైతు రస్తారోకోలు నిర్వహించారు.రైతులకు ప్రతి పక్ష కాంగ్రెస్ ,బీజేపి,టిడిపి నేతలు మద్దతు పలుకుతున్నారు.తాండూరు డివిజన్‌లో మొత్తం 25 వేల హెక్టార్లలో కంది పంటను రైతులు సాగు చేశారు.ఈ సంవత్సరం కంది పంట సైతం ఎపుగావచ్చింది.రైతులు తమ అప్పులు తీరుతాయని ఆశించారు.ఇందుకు ప్రభుత్వం మద్దతు ధరను సైతం ప్రకటించింది.అయితె మార్కెట్‌లో కందులు క్వింటాళ్ రూ.4300లకే వ్యాపారులు,ట్రడర్స్‌కొనుగోళు చేస్తున్నారు.దీంతో రైతులు క్వింటాల్‌కు రూ.1200 వరకు నష్టపోతున్నారు.గత వారం రోజుల నుండి కొనుగోళు కేంద్రాలకు కందులు పోటెత్తాయి.రైతులు వారం రోజులుగా కొనుగోళు కేంద్రాల వద్ద ఉన్న రైతుల వద్ద కాకుండా దళారుల వద్ద ఉన్న కందులను మాత్రమే కొనుగోళు చేశారు.ఆదివారం అకస్మాత్తుగా కందుల కొనుగోళు కేంద్రాలను మూసి వేశారు.దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.కందుల కొనుగోళు కేంద్రాలను ప్రారంభించిన 15రోజులలో ఎందుకు మూసివేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.అయితె జిల్లాలోని కందుల కొనుగోళు ఉప కేంద్రాలను మూసి వేసి కేవలం తాండూరు,వికారాబాద్,పరిగి,ధారూర్,మర్పల్లి కొనుగోళు కేంద్రాలను మాత్రమే కొనసాగిస్తామని డిసిఎంఎస్,మార్క్‌ఫెడ్ అధికారులు పేర్కోంటున్నారు.సబ్ సెంటర్లను ప్రారంభించడం వీలు కాదని తేల్చి చెప్పారు.దీంతో కందుల కొనుగోళు ఉప కేంద్రాల వద్ద రైతులు తమ కందులను అక్కడే పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.ప్రభుత్వం ,జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి వెంటనే స్పందించి కందుల కొనుగోళు ఉపకేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.లేని పక్షంలో బుదవారం నుండి ధర్నాలను ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.