Home ఎడిటోరియల్ దార్శనికుడు వీరేశలింగం

దార్శనికుడు వీరేశలింగం

Veeresalingam Pantuluభారతీయులు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతం త్య్రం కోసం పోరాడటానికి సన్నద్ధమౌతున్న రోజులవి. తమ పాలన పట్ల భారతీయులలో పెరుగుతున్న అసంతృప్తిని గమనించిన బ్రిటీష్ వారు తమ సామ్రాజ్యాన్ని సుస్థిర పరచుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు భారతీయులలో ఎగువ తరగుతి వారిలో కొందరు ఉన్నత విద్య కోసం సరిహద్దులు దాటి ఇంగ్లాండ్ వెళ్ళడం ప్రారంభించారు. అత్యధిక గ్రామీణ జనాభా నిరక్షరాస్యత, పేదరికం వంటి సమస్యలతో సతమతమౌతున్న మన సమాజంలో రాజారామ్‌మోహన్‌రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, దేవేంద్రనాథ్ ఠాగూర్, ఫూలే దంపతులు ఆనాటి సమాజంలో నెలకొన్న సాంఘిక దురాచారాల నిర్మూలనకు కృషి చేయడం ప్రారంభించారు.

ఆనాడు సతీసహగమనం వంటి సాంఘి క దురాచారాలు ఉన్నత వర్గీయులకే పరిమితం కాగా, బాల్య వివాహాలు, అంటరానితనం, కుల వివక్ష, కన్యాశుల్కం వంటి దురాచారాలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. జమిందారులు, భూస్వాములు పేద ప్రజలను దోచుకొనేవారు. మహారాష్ర్ట, బెంగాల్ రాష్ట్రాలలో ప్రారంభమైన సాంసృ్కతిక పునరుజ్జీవన ఉద్యమం ఆంధ్ర ప్రాంతాన్ని కూడా అమితంగా ప్రభావితం చేసింది.

రాజా రామ్మోహన్‌రాయ్ స్ఫూర్తితో తెలుగునాట సాంఘిక ఉద్యమాలు చేసిన వారిలో కందుకూరి వీరేశలింగం పంతులు అగ్రగణ్యులు. 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో సుబ్బారాయుడు, పున్నమ్మ దంపతులకు జన్మించిన కందుకూరి చిన్నతనంలో మశూచి వ్యాధి బారినపడినారు. తన నాల్గవ ఏటనే తండ్రిని కోల్పోయిన కందుకూరిని మేనమామ వెంకటరత్నం చేరదీశాడు. 1869లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన కందుకూరి కోరంగి గ్రామంలో ఉపాధ్యాయుడుగా చేరి సుమారు మూడు దశాబ్దాలపాటు తెలుగు పండితునిగా పని చేసి తెలుగు భాష వికాసానికి ఎనలేని కృషి చేసారు.

ఆయన 130 గ్రంథాలకు పైగా రచించారు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజ, పూర్వదేశ యాత్రలు ఆయన రచనలలో ప్రధానమైనవి. కందుకూరికి తెలుగుతో పాటు సంసృతం, ఇంగ్లీషు భాషల్లో కూడా పట్టువుండేది. పలు గ్రంథాలను, నాటకాలను తెలుగులోకి అనువదించారు. షేక్‌స్పియర్ రచించిన ‘కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ అనే నాటకాన్ని ‘చమత్కార రత్నావళి’ పేరుతో తెలుగులో వ్రాసి విద్యార్ధుల చేత ప్రదర్శింపచేశారు. ఆయన రచించిన ‘చంద్రమతీ చరిత్రం’ స్త్రీ అభ్యుదయాన్ని ప్రోత్సహించే నవల. కులాచారాన్ని నిరసిస్తూ ‘జమా బందీ’ వ్రాశారు.

కందుకూరి కధలు స్త్రీల అభ్యుదయాన్ని ప్రోత్సహించేవిగా వుంటాయి. ఆయన ‘నీతి కధా మంజరి’ అనే పేరుతో 158 చిన్న కధల సంకలనాన్ని కూడా వెలువరించారు. వివిధ అంశాలపై 190కి పైగా వ్యాసాలు రచించారు. పలు ప్రాంతాలలో ఆయా సామాజిక సమస్యలపై ఉపన్యాసాలు కూడా చేశారు. స్త్రీల కోసం ‘సతీహిత బోధిని’ అనే పత్రికను నడిపారు. ఇంకా వివేక వర్ధిని, సత్య సంవర్ధిని, సత్యదూత చింతామణి వంటి పత్రికలు నడిపారు. ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజ స్థాపనకు నాంది పలికారు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే ప్రారంభమయింది. ‘వివేకవర్థిని’ పత్రిక ద్వారా అవినీతి అధికారులపై యుద్ధం సాగించారు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకొనే సహవిద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. వేశ్య వ్యవస్థను నిరసించారు. వీరేశలింగం హేతువాది.

ఆంధ్రదేశంలో వితంతు పునర్వివాహాలను ఆయనే ప్రారంభించారు. ఉత్తర భారతదేశంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తొలి వితంతు పునర్వివాహం జరిపించగా, కందుకూరి 1881 డిశెంబర్ 11న తన ఇంటిలో మొదటి వితంతు పునర్వివాహం జరిపించారు. ఆనాటి తిరువూరు తాలూకాలోని రేపూడి గ్రామానికి చెందిన గౌరమ్మ అనే 9 సం॥ల బాల వితంతువును, గోగులపాటి శ్రీరాములుకు ఇచ్చి వివాహం జరిపించడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఆ వివాహాన్ని పలువురు వ్యతిరేకించారు. అయినా పట్టుదలతో కందుకూరి ఆ వివాహాన్ని జరిపించి బ్రిటీష్ అధికారుల నుంచి మన్ననలు పొందారు. ఇదే స్ఫూర్తితో 40కి పైగా వితంతు పునర్వివాహాలను జరిపించారు.

ఆనాటి సమాజంలో వున్న మూఢ నమ్మకాలను నిర్మూలించడానికి వీరేశలింగం విశేష కృషి చేసారు. అమాయకులైన ప్రజల మానసిక బలహీనతలు ఆసరాగా చేసుకొని ఆ రోజులలో చేతబడి, దయ్యాలు వున్నాయనే నెపంతో కొంతమంది మంత్రగాళ్ళు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన పలు ప్రసంగాలు చేశారు. 1905లో ‘హితకారిణీ సమాజాన్ని’ స్థాపించి తన యావదాస్తిని ఆ సంస్థకు రాసిచ్చారు. కందుకూరి భార్య రాజ్యలక్ష్మమ్మ కూడా ఆయనకు అన్ని విధాలుగా సహకరించేవారు. వీరేశలింగం 1919 మే 27న తుదిశ్వాస విడిచారు.

శాస్త్ర సాంకేతిక రంగాలు నేడు ఎంత అభివృద్ధి చెందినప్పటికీ చేతబడులు చేస్తున్నారనే నెపంతో పలువురిని హతమారుస్తున్నారు. ‘ది నేషనల్ క్రైం రికార్డు బ్యూరో’ లెక్కల ప్రకారం 2001 నుండి 2014 వరకు 2290 మందిని చేతబడుల చేస్తున్నారనే కారణంతో చంపడం దురదృష్టకరం. వారిలో అమాయక గిరిజన మహిళలు ఎక్కువగా వుండటం గమనార్హం. జార్ఖండ్ రాష్ర్టంలో ఇటువంటి హత్యలు ఎక్కువ.

ప్రభుత్వాలు ఆడపిల్లల సంరక్షణకు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ బాల్య వివాహాలు కొనసాగుతూనే వున్నాయి. మహిళలు పని చేసే ప్రతి చోట ఏదో ఒక రూపంలో పురుషుల నుండి లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఆడపిల్లను లక్ష్మీదేవిగా భావించే మన సమాజంలో కందుకూరి చూపించిన మార్గాన్ని నేటి పాలకులు అలవర్చుకొని వారి సంరక్షణకు మరికొన్ని పటిష్ఠమైన చర్యలు తీసుకొనవలసియున్నది.

Kandukuri Veeresalingam Birth Anniversary

యం. రాంప్రదీప్
9492712836