*రెండు నెలలు గడుస్తున్నా రైతులకు అందని డబ్బులు
*మార్క్‌ఫెడ్ తీరుతో అన్నదాతకు అవస్థలు
మన తెలంగాణ / ఆదిలాబాద్ బ్యూరో :
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మార్క్‌ఫెడ్ సంస్థ రైతుల నుండి కొనుగోళ్లు చేసిన కందులకు ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు జరగకపోవడంతో సంబంధిత రైతాంగం ఆందోళనకు గురవుతోంది. మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా క్వింటాలు రూ. 5,420లు చెల్లించి కందులను కొనుగోళు చేశారు. ఇలా కొనుగోలు చేసిన కందులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరపాల్సి ఉన్నప్పటికి సదరు కొనుగోళులు సంస్థ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుండడం ఆందోళనకు తావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 కోట్ల రూపాయలకు పైగా రైతులకు చెల్లించాల్సి ఉంది. దాదాపు రెండు నెలలు గడుస్తున్నప్పటికి చెల్లింపుల విషయమై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మొదటి నుండి కందుల కొనుగోళ్ల వ్యవహారంపై ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెలువడ్డ సంగతి తెలిసిందే. అయితే వ్యాపారుల సిండికెట్ మొదటి నుండి కందుల కొనుగోళు ప్రక్రియాను శాసిస్తోంది. సిండికేట్‌గా ఏర్పడ్డ దళారులు మహారాష్ట్ర నుంచి తక్కువ ధరలకు కందులను పెద్ద ఎత్తున కొనుగోళు చేసి జిల్లాలో విక్రయించారనే ఫిర్యాదులు ఉన్నాయి. మహారాష్ట్ర సరిహాద్దులైన ఆదిలాబాద్, భైంసా, ఆసిఫాబాద్‌లలోని కొనుగోళు కేంద్రాల్లోనే ఈ తతంగం సాగినట్లు విమర్శలు ఉన్నాయి. దాదాపు రూ, 1500 క్వింటాళుకు వ్యత్యసం ఉండడంతో వ్యాపారులు ఈ తతంగాన్ని గుట్టుచప్పుడు కాకుండా కోట్లాది రూపాయాల అక్రమలకు తెరా లేపారు. పతకం ప్రకారం సాగిన ఈ అక్రమ తంతులో వ్యాపారులతో పాటు పలువురు అధికారులపై కూడా ఫిర్యాదులు ఉన్నాయి. సంబంధిత అధికారుల అండదండలతోనే వ్యాపారులు ఈ అక్రమ వ్యవహరాన్ని కొనసాగిస్తున్నార విమర్శలు ఉన్నాయి. ఇలా మొదటి నుంచి ఆరోపణల సుడిగుండంలో చిక్కుకున్న కందుల కొనుగోళు వ్యవహారం తీరా చెల్లింపు సమయంలోనూ అదే తంతును కొనసాగించడం విడ్డురం అంటున్నారు. మొత్తానికి అధికారులు నిర్వకం కారణంగా కందుల చెల్లింపుల వ్యవహరం క్రమంగా నీరు గారుతుందంటున్నారు. ఇప్పటికైన సదరు యంత్రాంగం రైతులందరికి యుద్ద ప్రతిపాదిక చెల్లింపులు జరపాలని వారికి ప్రత్యామ్నయ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.