Home తాజా వార్తలు నెలాఖరులో కన్నెపల్లి వెటరన్?

నెలాఖరులో కన్నెపల్లి వెటరన్?

సిద్ధంగా 6 పంపులు
మన తెలంగాణ/హైదరాబాద్: కన్నెపల్లి పంపుహౌజ్‌లో పంపుల వెటరన్ ను ఈ నెల చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. కాళేశ్వరం దేవాలయం సమీపంలోని కన్నెపల్లి వద్ద పంపుల వెట్న్‌క్రు వీలుగా కాఫర్ డ్యాం కట్టి నీటిని ఫోర్‌బే (సర్జ్‌పూల్)లోకి మళ్లించి, దశల వారీగా నింపుతున్నారు. మరో వైపు కన్నెపల్లి పంపుహౌజ్‌లో ఆరు పంపులు నీటిని ఎత్తిపోయడానికి వీలుగా సిద్ధం చేసి ఉంచారు. అయితే ఇంకా తొలకరి వర్షాలు మొదలు కాకపోవడంతో ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం తక్కువగానే ఉంది. జూలై చివరి వారంలో ఓ శుభ ముహూర్తాన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పంపులకు స్విచ్ ఆన్ చేసి, వెట్న్ చేసే అవకాశం ఉంది. తర్వాత ప్రాజెక్టు పూర్తిస్థాయి ప్రారంభోత్సవాన్ని ఘనంగా, పండుగలా నిర్వహిస్తామని సిఎం ఇదివరకే ప్రకటించారు. వెట్న్ నిర్వహించేందుకు అధికారులు, ఇంజనీర్లు సిద్ధంగా ఉండాలనీ, అన్నీ సిద్ధం చేసి పెట్టాలని ఆదేశాలు అందాయి. ముఖ్యమంత్రి ఇచ్చే సమయాన్ని బట్టి, వెట్న్ నిర్వహణ తేదీలు ఖరారు అవుతాయి. ఈ నెల చివరి వారంలో ఏదో ఒక తేదీ ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్నెపల్లిలో వెట్న్ చేసాక ఆ నీరు నేరుగా గ్రావిటీ కెనాల్‌లో పడుతుంది. ఈ ప్రవాహం అన్నారం బ్యారేజికి చేరుతుంది. అన్నారం బ్యారేజీ నీటి నిల్వకు సిద్ధంగా ఉంది. 99 శాతం పనులు పూర్తయ్యాయి. కన్నెపల్లిలో లిఫ్టు చేసిన నీరు అన్నారంలోనే నిల్వ చేయాల్సి ఉంది. ప్రాణహిత నదిలో వరద ఇంకా మొదలు కాలేదు. ఒక్కసారి వరద మొదలైతే కన్నెపల్లి వద్ద నీటి లభ్యతకు డోకా లేదు. క్షణాల్లోనే వరద ఉదృతి పెరుగుతూ చెప్పాను. తొలకరి వర్షాలు మొదలైతే ప్రాణహితలో ప్రవాహం మొదలవుతుంది. ఇప్పటికే కాఫర్ డ్యాం కట్టి, నీటిని మళ్లించే పనులు పూర్తయిన నేపధ్యంలో, ఓ మోస్తరు ప్రవాహం వచ్చినా, నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది. కేవలం వెట్న్ కోసమే కాఫర్ డ్యాం కట్టినప్పటికీ, వరద ఆలస్యమైతే, నీటి మళ్లింపుకు ఇది ఉపయోగపడుతుంది. కన్నెపల్లిలో ఆరు పంపులు ఈ క్షణంలో నీటిని లిఫ్టు చేసేందుకు వీలుగా అమర్చి ఉన్నాయి. మొత్తం 11 పంపులను పూర్తిచేసేలా పనుల్లో వేగం పెంచినా, వచ్చే వరదను బట్టి, పంపులు ప్రారంభిస్తారు.
మేడిగడ్డలో 6 టిఎంసిల నిల్వ…?
మేడిగడ్డ బ్యారేజిలో ఈ సీజన్లో 6 టిఎంసిల వరకు నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 16 టిఎంసిలు అయినప్పటికీ, సాంకేతికంగా పూర్తిస్థాయిలో నీటి నిల్వను ఒకేసారి చేయకూడదని ఇంజనీర్లు చెబుతున్నారు. దశల వారీగా బ్యారేజీలో నీటి నిల్వను పెంచుతారు. వరద నీరు వచ్చినప్పుడు తొలుత 10 శాతం, ఆ తర్వాత 15, తర్వాత 20 శాతం మేర నీరు నిల్వ చేస్తూ, క్రమంగా పెంచుతారు. ఈ క్రమంలో బ్యారేజిలో లీకేజీలు, గేట్ల వద్ద లీకేజీలు, బ్యారేజీ సామర్థంపై సాంకేతికంగా చెక్ చేస్తారు. ఈ సీజన్లో గరిష్టంగా 5 నుంచి 6 టిఎంసిల మేర నిల్వ చేసే అవకాశం ఉందని సమాచారం. మహారాష్ట్ర భూభాగంలో కొంత అడవి ప్రాంతం మునుగుతుండడంతో, ఆ బాగాల్లో పనులు ఇంకా ప్రారంభం కాలేదు. సోమవారం నాడే అటవీ భూమి వినియోగించడానికి అనుమతి లభించడం, ప్రత్యామ్నాయ భూములు, పరిహారం చెల్లింపులు చేయడంతో బ్యారేజికి అడ్డంకులు తొలగిపోయాయి. మహారాష్ట్ర పరిధిలో అటవీ భూముల్లో కరకట్టల నిర్మాణం ప్రారంభించి, పూర్తిచేయాల్సి ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర పరిధిలో దాదాపు 10 కిలోమీటర్ల మేర కరకట్టల నిర్మాణం పూర్తయ్యింది. మధ్యమధ్యలో చిన్న చిన్న అటవీ ప్రాంతాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో చేయని పనులను వచ్చే సీజన్లో పూర్తిచేసి, బ్యారేజీలో పూర్తిస్థాయి నీటి నిల్వకు అనువుగా సిద్ధం చేయనున్నారు.

Kannepalli construction works complete at end of June