Home జాతీయ వార్తలు జితిన్‌కు ‘ప్రసాదం’ దొరుకుతుందా?

జితిన్‌కు ‘ప్రసాదం’ దొరుకుతుందా?

Kapil sibal slams jitin prasada for joining bjp

 

బిజెపిలో చేరడంపై కపిల్ సిబల్ సెటైర్
చచ్చినా బిజెపిలో చేరనంటూ ఘాటు వ్యాఖ్య
రాజకీయం సిద్ధాతం లేని కెరీర్ అయిపోయింది: శశిథరూర్

న్యూఢిల్లీ: జితిన్ ప్రసాద కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ గురువారం స్పందించారు. అది ‘ప్రసాద రాం’ రాజకీయమని ఆయన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. అయితే పార్టీలో చేరినందుకు బిజెపినుంచి ఆయనకు ప్రసాదం లభిస్తుందా లేక యుపి ఎన్నికలకు ముందు ఆయన కేవలం గేలానికి దొరికిన చేపగా మిగిలిపోతారో వేచి చూడాల్సి ఉందన్నారు. జితితన్‌ప్రసాద రాజకీయాలు, సిద్ధాంతాలు పక్కన పట్టి కేవలం స్వార్థప్రయోజనాల కోసమే పార్టీని వీడారని మండిపడ్డారు. గత ఏడాది ఆగస్టులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ నేతల్లో జితిన్‌ప్రసాదతో పాటుగా కపిల్ సిబల్ కూడా ఉన్న ఉన్న విషయం తెలిసిందే.

అయితే తాము కాంగ్రెస్ పార్టీతోనే ఉంటామని, ఒక వేళ అక్కర్లేదు, వెళ్లిపొమ్మని పార్టీ చెబితే వెళ్లిపోతామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోను బిజెపిలో చేరబోనని, తాను పట్టినప్పటినుంచి ఆ పార్టీకి వ్యతిరేకమని కపిల్ సిబల్ అన్నారు.‘ బిజెపిలో చేరడమంటే నేను చచ్చినట్లే లెక్క’ అంటూ ఘాటుగా స్పందించారు ఆయన. కాగా జితిన్‌ప్రసాద బిజెపిలో చేరడంపై మరో కాంగ్రెస్ నేత శశిథరూర్ కూడా ఘాటుగానే స్పందించారు. రాజకీయాలు సిద్ధాంతం లేని కెరీర్‌గా మారిపోయిందా? అని ప్రశ్నించిన ఆయన ఓ క్రికెటర్ ఐపిఎల్ టీమ్‌లు మారినట్లు నిబద్ధత గల వ్యక్తి రాజకీయ పార్టీలు మారుతారా? అని ప్రశ్నించారు. జ్యోతిరాదిత్య సింధియా లాగానే జితిన్‌ప్రసాద కూడా బిజెపిలో చేరడం తనకు బాధ కలిగించిందని థరూర్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

Kapil Sibal slams Jitin Prasada for joining BJP