Home లైఫ్ స్టైల్ సై సై నాయకా..

సై సై నాయకా..

ph

 సైకిల్‌పై కార్గిల్ టు కన్యాకుమారి..!!

స్వచ్ఛభారత్, స్వస్త్ భారత్, బేటీ బచావో బేటీ పడావో, అంగ్ దాన్ మహాదాన్‌ల గురించి గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించడమే లక్షంగా పెట్టుకున్నాడు… అందుకోసం మంచి జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలి.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌యాత్ర చేశాడు. వెళ్లిన చోటల్లా అక్కడి వాళ్లతో మాట్లాడి, అవగాహన కల్పించి , విరాళాలు సేకరించాడు. ఆ డబ్బుతో టాయిలెట్లు కట్టించి దేశ ప్రజల అభినందనలు అందుకున్నాడు బీహార్‌కు చెందిన పంకజ్ మాల్.
లీడర్‌షిప్, రిలేషన్‌షిప్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ విషయాలపై 37ఏళ్ల పంకజ్‌మాల్ 50 కి పైగా కంపెనీలకు కోచ్‌గా పనిచేసేవాడు. ఆసియాలోని 20 దేశాలలో దాదాపు 6000 మందితో మాట్లాడాడు. మంచి సంపాదన. కొన్నాళ్లకు తను చేయాల్సింది ఇది కాదనుకున్నాడు. యునైటెడ్ నేషన్స్ హ్యుమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ (2016) ప్రకారం… ఆరోగ్యం, విద్య, శానిటేషన్, మహిళల రక్షణ అంశాలపై 188 దేశాల్లో సర్వే చేపట్టగా.. ఇండియా 131 ర్యాంకు సంపాదించింది. అంటే అత్యంత చివరి స్థానంలో ఉన్నట్లు చదివి చలించిపోయాడు పంకజ్. దేశానికి ఏమైనా చేయాలనుకున్నాడు.
అక్టోబర్ 6, 2016న సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. కార్గిల్ నుంచి మొదలుపెట్టి డిసెంబర్ 5, 2016 న కన్యాకుమారి చేరుకున్నాడు. మొదట్లో కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయలేదు. అందరూ నిరుత్సాహపరిచారు. అమ్మ, తన స్టూడెంట్స్ ప్రోత్సాహం ఉండేదన్నాడు. ఇతరులను మార్చడం అనేది చాలా పెద్ద టాస్క్ అంటాడు పంకజ్. ప్రయాణంలో తినడానికి కొంత బడ్జెట్ పెట్టుకున్నాడు. బస చేయడానికి అతని దగ్గర పైసాకూడా లేదు. వెళ్లిన చోట అక్కడ ఉన్న గుళ్లు, గురుద్వార, కొంత మంది ఆదరించిన వారి ఇళ్లల్లో బస చేసేవాడు. ఒక్కోసారి చెట్టుకింద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. మరికొన్ని చోట్ల టీస్టాల్స్ దగ్గర , భవన నిర్మాణాలు జరుగుతున్న చోట్ల ఉండేవాడు. శానిటేషన్, ఆడపిల్లలకు విద్య ఆవశ్యకత, అవయవ దానం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే …వీటి కోసం విరాళాలను సేకరించాడు. ఆ విరాళాలతో గ్రామాల్లో ఎక్కడైతే టాయిలెట్లు అవసరమో వారికి కట్టించాడు. ఈ మిషన్‌కు అస్తిత్వ అనే పేరు పెట్టాడు.
అస్తిత్వ మిషన్: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్య, సాధికారత, ఉద్యోగ అవకాశాలు, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం లాంటి విషయాలపై మహిళలకు అవగాహన కల్పించడమే లక్షంగా పనిచేస్తుంది.
దేశంలోని ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవాలంటే ప్రయాణం అనేది ఉత్తమ మార్గం అంటాడు పంకజ్. సైకిల్‌పై ప్రయాణం తక్కువ ఖర్చుతో కూడుకున్నది. పైగా పర్యావరణహితం అంటాడు. వచ్చిన విరాళాలతో వివిధ గ్రామాల్లో 17 టాయిలెట్లను కట్టించాడు. యాత్ర ద్వారా సమాజంలో జీవించడానికి ఎలాంటివి ముఖ్య అవసరాలో, కనీస అవసరాలు తీరని వారెందరో, తక్కువ సౌకర్యాలున్నా ప్రజలు ఎంత ఆనందంగా ఉంటున్నారో అనే విషయం నాకర్థమైందంటున్నాడు.
భవిష్యత్ ప్రణాళికలు: అస్తిత్వ ద్వారా అందిన ఫండ్‌తో ప్రజలకు అవగాహన కల్పించడానికి వర్క్‌షాప్‌లు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలాంటివి చేస్తున్నాడు. ప్రస్తుతం మరో ప్రాజెక్టుకు ప్రణాళికలు వేస్తున్నట్లు చెబుతున్నాడు. బయోడిగ్రేడబుల్ శానిటరీ నేప్కిన్స్‌ను తయారుచేసే ప్రాజెక్టుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. 2018 కల్లా ఈ ఉత్పత్తి మార్కెట్‌లోకి రానున్నట్లు ఓ ఇంటర్వూలో తెలిపాడు. మినీ శానిటరీ నాప్కిన్స్, అగరబత్తీలు, సబ్బుల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించానుకుంటున్నాడు . ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు. దాదాపుగా నేను దేశంలోని అన్ని రాష్ట్రాలను సైకిల్‌పై చుట్టాను. వెయ్యి కంటే ఎక్కువ స్కూళ్లు, కాలేజీలు, కార్పొరేట్ ఆఫీసుల్ని కలిశాను. 20 కి పైగా నగరాల్లో సైక్లింగ్ క్లబ్‌లు ఏర్పాటయ్యేలా చూశా నంటున్నాడు.