Home ఎడిటోరియల్ తెలుగులో సాహిత్య కళా ప్రక్రియగా ‘పెట్టుబడి’-అదనపు విలువ!

తెలుగులో సాహిత్య కళా ప్రక్రియగా ‘పెట్టుబడి’-అదనపు విలువ!

Karl-Marx

గడిచిన శతాబ్దన్నరగా ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న కారల్‌మార్క్స్ రచన ‘ది కాపిటల్’ (‘పెట్టుబడి’) గ్రంధం తొలి ప్రచురణకు 150 ఏళ్ళు పూర్తవుతున్నాయి. దాని తెలుగు అనువాదపు రెండవ ముద్రణ వెలువడుతోంది. దీని పఠనం తారు రోడ్డుమీద ప్రయాణం లాంటిది కాదు. మార్క్సే చెప్పినట్లు నిలువు కొండనెక్కటం లాంటి వ్యాయామం. దాని పఠనమే ఒక కఠోర పరిశ్రమ. అలా చేయ గలిగితేనే, ఆకళించుకుంటేనే విజ్ఞానమనే తేజో కాంతిని పొందగలుగుతాము.
మనిషి శ్రమశక్తే ఒక సరుకుగా మారిపోయిందని పెట్టుబడి తెలియజేస్తుంది. పెట్టుబడిదారీ వ్యాపార సూత్రాల ప్రకారం ఏ సరుకైనా దాని అసలు విలువకు (ధరకు) అమ్ముడుపోవాలి గదా! మానవ శ్రమశక్తి కూడా తన అసలు విలువనే పొందగలిగితే సమాజంలో ఇన్నిన్ని అంతరాలెందుకుంటాయి? పెట్టుబడిదారీ సమాజం శ్రామికజీవులు సృష్టించే శ్రమ విలువలో ఒక భాగాన్ని (దానినే అదనపు విలువ అని కారల్‌మార్క్స్ కనుగొన్నాడు.) కొల్లగొట్టటం ద్వారానే పెట్టుబడిని పోగేసుకుంటుంది. ఒక్క మాటలో పెట్టుబడి అంటేనే పోగేసుకున్న అదనపు విలువ. ఈ అదనపు విలువ సృష్టికర్తలు శ్రమజీవులే! మరొక అర్ధంలో ‘పెట్టుబడి’ అంతా కూడా శ్రామికులను దోచుకోవటం ద్వారా అనగా శ్రమదోపిడీ ద్వారానే సమకూడింది.
ఈ విషయాన్ని సులువుగా అర్ధం చేసుకోవటానికి తోడ్పడే ‘నాటిక’ జలగ’. దీని రచయిత రాపర్తి వెంకటరాజు. దీన్ని అక్షరీక రించి 33 సంవత్సరాలు గడిచిపోయింది. రాష్ట్రంలోని ముఖ్య నగరాల న్నిటా ప్రదర్శనలిచ్చి కూడా చాలా కాలమైపోయింది. అయితే 4 సంవత్సరాల క్రితం మొదటిసారీ, 2 సంవత్సరాల క్రితం (2015) మరొకసారీ యిది ప్రచురణయింది. కానీ రెండవ ముద్రణ వెలుగు చూచే సమయానికి రచయిత వెంకటరాజు కన్నుమూశారు. దీని ప్రచురణకర్తలు ‘విశాఖ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య’ (ఆంధ్ర ప్రదేశ్). విశాఖలోని ‘భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్’లో పని చేస్తూండిన కార్మికుల బృందం దీన్ని ప్రదర్శిస్తుండేది. అందులో కృషి సల్పిన ముఖ్య కళాకారుడు, కార్యకర్త కామ్రేడ్ షేక్ మస్తాన్ దీన్ని రెండవసారి ప్రచురించారు.
పెట్టుబడిదారీ వ్యవస్థను ‘జలగ’తో పోల్చాడీ రచయిత. అయితే అతనే చెప్పినట్లు నొప్పి తెలియకుండా రక్తాన్ని పీల్చే జలగ స్వభావం లాంటిదే శ్రమజీవులకు తెలియకుండా గుంజే అదనపు విలువ అన్న దృష్టిలో ఆ పేరు పెట్టారు. కానీ జలగకు కడుపు నిండిన తర్వాత యిక తాను పట్టుకున్న జంతువు (మనిషి) రక్తాన్ని అది పీల్చదు. పెట్టుబడి దారులకూ, వారి వ్యవస్థకూ నిరంతరం అదనపు విలువ దోపిడీ సాగుతుంటేనే మనుగడ. దోపిడీకి విరామం యిచ్చినా, సాగనివ్వక అడ్డుకున్నా పెట్టుబడిదారీ వ్యవస్థ కూలిపోక తప్పదు.
సాధారణంగా అత్యధికులం భావించేదేమంటే పెట్టుబడి పెట్టి, శ్రామికులతో ఉత్పత్తి చేయించి అంతకు మించిన రేటుతో మార్కెట్లో ఆ సరుకుని అమ్మి, తద్వారా పొందేదే లాభం అని. కానీ కారల్‌మార్క్స్ పరిశోధించి తన పెట్టుబడి గ్రంధంలో తేల్చి చెప్పిన అంశమేమంటే, ఉత్పత్తి క్రమంలోనే శ్రామికుని శ్రమ విలువలో, అతనికి యజమాని చెల్లించే ‘కూలి’ అనే భాగం పోగా, మిగిలిన భాగమే అదనపు విలువ (సర్ప్‌లెస్ వాల్యూ) అని.
ఈ అదనపు విలువను సులువుగా అర్ధం చేసుకోవటంలో కొంత క్లిష్టత వున్నది. దాన్ని సాధారణ జనాలకు అర్ధమయే రీతిలో దృశ్య ప్రదర్శనగా చెప్పటానికి చేసిన ప్రయత్నమే ‘జలగ’.
అయితే తెలుగులో అదనపు విలువను అర్ధం చేయించే ప్రయత్నం కధా ప్రక్రియలో కొంత జరిగింది. వాటిలో మొదటిది చాగంటి సోమయాజులు (చా.సో.) రచన ‘బొండుమల్లెలు’. ఈ కథను తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా కూడా కొంతకాలం వుంచారు. ఆ కధా సారమైన ‘అదనపు విలువ దోపిడీ’ అనేది ఎంతమంది ఉపాధ్యా యులకు అర్ధమయి, తమ విద్యార్థులకు అర్ధం చేయించారో చెప్పలేము.
మరొక కథ రాచకొండ విశ్వనాధశాస్త్రి (రావిశాస్త్రి) రచన ‘బల్లచెక్క’. ఇందులో పెట్టుబడి శ్రమను సున్నితంగా ఎలా దోపిడీ చేస్తుందో రావిశాస్త్రి చెప్పారు. అదనపు విలువ సృష్టిరహస్యం అర్ధం చేయిస్తారు.
మరొక కథ సి.ఎస్.రావు రచన “గుమ్మడి గింజలు”. ఇది ఆంధ్రజ్యోతి వారపత్రికలో వచ్చింది.
తుమ్మేటి రఘోత్తమరెడ్డి రాసిన ‘పనిమనిషి’ వేరొక కథ. దీనిపైన చర్చ చాలా జరిగింది. కధ కంటే అనేక రెట్లు పెద్దదయిన చర్చతో సహా (కాళీపట్నం వారి ‘యజ్ఞం’ కథపై వచ్చిన కధాయజ్ఞం పుస్తకంలాగా) పుస్తక రూపంలో వెలువడింది. ఇంటి పనిమనిషి లాంటి సేవారంగపు శ్రమను, ఉత్పత్తి ప్రక్రియతో సూటి సంబంధంలేని శ్రమశక్తిని, అదనపు విలువ దోపిడీకి ప్రతీకగా చెప్ప ప్రయత్నించటంలోనే పెడగాడిలో పడినదన్నట్లు ఈ కథపై విమర్శలు న్నప్పటికీ యిది కూడా పై కోవలో చర్చించు కోదగినదే.
‘జలగ’ నాటకం విషయానికొస్తే ఇది ఐదు రంగాలలో 30 ముద్రణా పుటల నిడివి వున్న నాటిక. పాటలనూ, నృత్యాభినయాలను మేళ వించిన, 9 మంది పాత్రధారుల నడుమ సాగే సంభాషణ, సంఘర్షణతో కూడిన నాటిక యిది.
ఇందులో పత్తి పండించే రైతు, అతని కొడుకులిద్దరూ, నేత కార్మికుడూ అతని కొడుకూ, ఒక పత్తి + బట్టల వ్యాపారి, రాజ్యాంగ యంత్ర ప్రతినిధులుగా జడ్జీ, పోలీసుతో పాటు రాజ్యాంగమే ఒక పాత్రగా వున్నాయి.
పత్తిని కొనుగోలు చేసేటపుడూ, దానితో చీరలు నేయించి వాటిని అమ్మటం ద్వారానూ ‘సేఠ్’ లాభం ఎలా పొందుతున్నాడో, దోపిడీ ఎలా సాగిస్తున్నాడో దృశ్యమానం చేస్తుందీ ‘జలగ’ నాటిక. “యాభై రూపాయల విలువైన సీర మా యిద్దరికీ (రైతుకీ కార్మికునికీ) పదిహేను రూపాయలిచ్చి, ముప్ఫై ఐదు రూపాయలు లాభం పేరుతో జుర్రుకుంతావా’ అని రైతు భూమయ్య అదనపు విలువను వెల్లడి చేస్తాడు. ‘రాజ్యం’ యొక్క ధనికవర్గ స్వభావాన్ని కూడా ఈ నాటిక బహిరంగపరుస్తుంది.
శ్రమజీవుల, కార్మికుల ఉద్యమ చైతన్య పరికరంగా వుండాల్సిన ‘పెట్టుబడి’ గ్రంథాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్లిష్టతలను అర్ధం చేసుకోవటానికీ దోపిడీని మరింత మోసపూరిత తెలివితేటలతో కొనసాగించటానికీ కూడా వాడుకుంటున్నారని చెప్పుకుంటారు. 125 సంవత్సరాల క్రితమే అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఒక ప్రచురణకర్త, మూల రచనపై హక్కుదారులకు తెలియకుండా నకిలీ ముద్రణ (పైరసీ) వేసి దానికి ‘డబ్బు సంపాదించే మార్గం చెప్పే పుస్తకం’ అనే ప్రచారంతో 5 వేల ప్రతులను అమ్మి తాను మాత్రం బాగా సంపాదించుకొన్నాట్ట!