Home ఎడిటోరియల్ ‘కర్నాటకం’లో తాజా అంకం

‘కర్నాటకం’లో తాజా అంకం

Mana Telangana

కర్నాటకలో కొన ఊపిరితో కొనసాగుతున్న కాంగ్రెస్ జెడి(ఎస్) ప్రభుత్వం క్షణాలు, రోజులు లెక్కబెడుతూనే సున్నితమైన రాజ్యాంగపరమైన అంశాలను చర్చకు తీసుకు రావడం ఆసక్తిదాయకమైన పరిణామం. ఈ రెండు పార్టీలకు చెందిన 15 మంది ఎంఎల్‌ఎలు రాజీనామాలు సమర్పించి స్పీకర్ చేత వాటిని తక్షణమే ఆమోదింప చేసుకొనే ప్రయత్నంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కథ రసవత్తరమైన మలుపు తిరిగింది. అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ కూడా తన అధికారాలకు సంబంధించి స్పష్టత కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దానితో దేశ అత్యున్నత న్యాయస్థానం కర్ర విరగని, పాము చావని రీతిలో తీర్పు ఇచ్చి వివాద క్లిష్టతను పెంచింది. తిరుగుబాటు ఎంఎల్‌ఎల రాజీనామాలపై నిర్ణయం తీసుకునే సంపూర్ణాధికారాలు స్పీకర్‌కున్నాయని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం, కాకపోడం అనే దాన్ని రాజీనామాలు చేసిన శాసన సభ్యుల ఇష్టానికి వదిలేసింది. దీనితో కుమార స్వామి ప్రభుత్వ విశ్వాస పరీక్షలో పలానా విధంగా ఓటు వేయాలని ఆ ఎంఎల్‌ఎలను ఆదేశించడానికి కాంగ్రెస్, జెడి(ఎస్) పార్టీలకు గల విప్ జారీ అధికారాలు ఉనికిని కోల్పోయాయి. విశ్వాస తీర్మానంపై చర్చ జరిపించిన స్పీకర్‌కు, ముఖ్యమంత్రి కుమార స్వామికి ఇది అందివచ్చిన ఆయుధమైంది.

పార్టీ ఫిరాయింపుల నిరోధానికి సంబంధించిన రాజ్యాంగం 10వ షెడ్యూల్ ప్రకారం గల విప్ అధికారాలపై స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును కోరాయి. ఈ విధంగా విశ్వాస పరీక్ష ఓటింగ్‌ను వీలైనంత కాలం వాయిదా వేసేందుకు లభించిన అవకాశాన్ని పాలక భాగస్వామ్య పార్టీలు రెండూ వినియోగించుకుంటున్నాయి. అటు వైపు భారతీయ జనతా పార్టీ గవర్నర్ అధికారాలను ప్రయోగింప చేసి తక్షణమే విశ్వాస ఓటింగ్ చేపట్టేలా స్పీకర్‌పై ఒత్తిడి పెంచుతున్నది. తక్షణమే ఓటింగ్ జరిపించి విశ్వాస పరీక్ష ఘట్టాన్ని ముగింపుకి తీసుకురావాలని సూచిస్తూ గవర్నర్ స్పీకర్‌కు రాసిన రెండు లేఖలూ వమ్మయ్యాయి. పై పెచ్చు అనుచిత జోక్యం చేసుకుంటున్నారని గవర్నర్‌పై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్, జెడి(ఎస్) లు ఫిర్యాదు చేసినట్టు వార్తలు చెబుతున్నాయి. బంతిని సుప్రీంకోర్టులోకి తోసేసి వీలైనంత కాల యాపనను ప్రభుత్వం చిత్తగిస్తున్నది. కాంగ్రెస్, జెడి(ఎస్) తిరుగుబాటు ఎంఎల్‌ఎలు 15 మందినీ నేరుగా తమ పార్టీలో చేర్చుకొనే అవకాశం లేనందున రాజీనామాల మార్గంలో ప్రభుత్వాన్ని మైనారిటీలో పడేయాలని బిజెపి పన్నిన పన్నాగం ఈ విధంగా తాత్కాలికంగానైనా బెడిసి కొట్టింది. విప్ అధికారాలపై సుప్రీంకోర్టు ఏమి చెబుతుందనేది కీలకంగా మారింది. గవర్నర్, స్పీకర్ చెరో వైపు వ్యవహరిస్తున్నట్టు భావించడానికి ఆస్కారం కలుగుతున్నది.

గత ఏడాది మే నెలలో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికవసరమైన స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకీ లభించలేదు. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో అతి పెద్ద పక్షంగా అవతరించిన ప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనకు వచ్చిన అవకాశాన్ని అది సద్వినియోగం చేసుకోలేకపోయింది. సభలో మెజారిటీ నిరూపించుకోలేకపోయింది. ఆ పార్టీ శాసన సభా పక్ష నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన వెంటనే దిగిపోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో రెండవ అతి పెద్ద పార్టీ కాంగ్రెస్ మద్దతుతో జెడి(ఎస్) నేత కుమార స్వామి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. పదవులు, ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు మొదటి నుంచే మొదలయ్యాయి. ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన యడ్యూరప్ప ఈ పరిస్థితిని వినియోగించుకొని మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోడానికి వ్యూహాలను ఆది నుంచే ప్రయోగించడం ప్రారంభించా రు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి కర్నాటకలో అత్యధిక స్థానాలు గెలుచుకోడం, గతం కంటే అధికమైన బలంతో కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడం యడ్యూరప్పలో మళ్లీ ఆశలు పెంచాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, జెడి(ఎస్)లకు చెందిన 15 మంది ఎంఎల్‌ఎలు రాజీనామాల బాట పట్టి కుమారస్వామి ప్రభుత్వానికి పీడ కలలు రప్పించారు.

224 మంది సభ్యులు గల కర్నాటక అసెంబ్లీలో ఆయన నాయకత్వంలోని కాంగ్రెస్ జెడి(ఎస్) సర్కార్‌కు 118 మంది బలమున్నది. 15 మంది ఎంఎల్‌ఎల రాజీనామాలను ఆమోదించినట్టయితే ఈ బలం 101కి పడిపోతుంది. బిజెపి తనకు గల 105 మంది బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థితికి చేరుకుంటుంది. అదనంగా ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతు కూడా దానికున్నది. విప్ అధికారాలపై సుప్రీంకోర్టు ఏమి చెబుతుంది, ఆ తర్వాత తిరుగుబాటు ఎంఎల్‌ఎలు ఏమి చేస్తారు అనేవి ఇప్పుడు ప్రధానాంశాలు.

karnataka Assembly floor test Delayed To Monday