Home తాజా వార్తలు కర్ణాటక కాదు.. ఇది తెలంగాణ..

కర్ణాటక కాదు.. ఇది తెలంగాణ..

politics

 

దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి
కాజీపేటను డివిజన్‌గా ఏర్పాటు చేయాలి
‘మీట్ ది ప్రెస్’లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్

వరంగల్ : కర్ణాటకలో చేసిన రాజకీయాలు బిజెపికి తెలంగాణలో సాధ్యం కాదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం వరంగల్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కాంగ్రెస్, బిజెపి పార్టీలపై తనదైన శైలిలో విమర్శించారు. బిజెపి పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చేస్తున్న ప్రకటనలు ప్రగల్భాలకే పరిమితమవుతుందన్నారు. కర్ణాటక స్థాయి రాజకీయాలు తెలంగాణలో లేవని అలాంటి రాజకీయాలు బిజెపికి ఇక్కడ సాధ్యం కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యమాలతో ప్రజల చైతన్య స్ఫూర్తితో ఏర్పడిన ప్రభుత్వమన్నారు. బిజెపి పార్టీకి దమ్ము, ధైర్యముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను ప్రకటిస్తూ తగిన నిధులను కేటాయించాలన్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన కాజీపేట రైల్వే జంక్షన్‌ను రైల్వే డివిజన్‌గా చేపించాలని అందుకు బిజెపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రులతో వరంగల్‌ను పర్యటింప చేసి ఈ పనులు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ లీడర్ లేని పార్టీ అని.. బిజెపి క్యాడర్ లేని పార్టీ అన్నారు. ఆ రెండు పార్టీలు ప్రజాబలాన్ని పెంచుకొని ఉద్యమాల్లో పాల్గొంటే బాగుంటుందని హితవు పలికారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తూ ప్రజలకు అవసరమైన జిఒలను అమలు చేసేందుకు తాను కృషి చేస్తానన్నారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ పార్టీ కోసం స్థల సేకరణ చేసి రైల్వేశాఖకు అందించడం జరిగిందన్నారు.

దాన్ని రైల్వే డివిజన్‌గా మంజూరు చేయించలేని బిజెపి నేతలు ఏదో చేద్దామని చెప్పడం సిగ్గు చేటన్నారు. కాజీపేటలో ఆర్వోబిని త్వరలో పూర్తి చేస్తామన్నారు. పేదలు ఉన్న ప్రాంతాల్లో కమ్యూనిటీ భవనాలు నిర్మాణం చేసి వారికి అందుబాటులో ఉంచుతామన్నారు. హైదరాబాద్ తరువాత వరంగల్‌పైనే ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి ఉందన్నారు. నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పరచడానికి వేగవంతమైన అభివృద్ధి పనులను కొనసాగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్‌రెడ్డి అధ్యక్షత వహించగా సీనియర్ జర్నలిస్టు దాసరి కృష్ణారెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Karnataka-level politics is not in Telangana