Home దునియా దేవదీపావళి.. కార్తీకపౌర్ణమి

దేవదీపావళి.. కార్తీకపౌర్ణమి

Karthika pournami

 

హరి-హర అద్వైతానికి ప్రతీకంగా నిలిచే మాసం కార్తీకమాసం. చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపాన సంచరిస్తాడు కాబట్టే ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. శివకేశవులను ఏకకాలంలో కొలిచి ముక్తిని పొందే మాసంగా కార్తీకమాసం నిలిచింది. ఈ మాసంలో ప్రతి రోజూ పవిత్రమైంది. ఈ మాసంలో చేసిన పూజలు, దానధర్మాలు, దీపారాధన, పురాణశ్రవణంతో జన్మజన్మాల పాపాలు హరిస్తాయని ప్రతీతి. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెలరోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు. కార్తీక మాసం మొతం దీపారాధనకు ప్రశస్తి. కార్తీకపున్నమి నాడు వెలిగించే దీపాలకు మరింత విశేషం ఉంది.

కార్తీపున్నమి లేదా కార్తీక పౌర్ణిమ కృత్తికా నక్షత్రంలో అర్ధనారీశ్వర రూపం అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున శివపార్వతులతో పాటు శివకేశవులను ఆరాధించడం వల్ల సకల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. చంద్రుడు పరిపూర్ణంగా దర్శనమిచ్చే రోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజు చంద్రుని ఎదురుగా పాలను ఉంచి, విష్ణుసహస్రం చదివి ఆ పాలను ప్రసాదంగా స్వీకరిస్తారు.
ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం, మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను, లక్షపత్రిపూజ, కేదారేశ్వర వ్రతాన్ని చేసుకుంటారు భక్తులు. శివ, విష్ణు దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయల మీద, బియ్యం పిండితో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ, పూలతో అంకరించుకొని వెలిగించాలి. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండదీపాన్ని, ఆకాశదీపం పేరుతో ఎత్త్తెన ప్రదేశాల్లో భరిణలతో (కుండలు, లోహ
పాత్రలతో తయారుచేసి) వేలాడదీస్తారు.

karthika pournami

కార్తీక పౌర్ణిమకు ‘ త్రిపుర పూర్ణిమ ‘ అని మరొకపేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులూ బ్రహ్మను మెప్పించి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను(బంగారు, వెండి, రజితం) వరంగా పొందారు. ఎవరివల్లా మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంమీద, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణంకాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురినీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వరబలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గరకెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరుపర్వతం విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడుగా, శ్రీమహావిష్ణువు బాణంగా, బ్రహ్మ రథసారధిగా, రవిచంద్రులే చక్రాలుగా, నాలుగు వేదాలు హయములుగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను (మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను) సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందనీ పురాణ కథనం.

karthika-masam
ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ రోజునే దేవతలందరూ వారణాశిలో దీపాలు వెలిగించి ‘దేవదీపావళి’ చేసుకుంటారు. ఆ రోజు కాశీ వీధులు ఇసుక వేస్తే రాలని జనంతో కిక్కిరిసి ఉంటాయి. అన్ని ఘాట్ల మీదా దీపాలు వెలిగించి దేవతలకు స్వాగతం పలుకుతారు. ఆ దీపాల కాంతిలో ఆ దేవాతాసార్వబౌభుడి చిద్విలాసం చూసి తీరాల్సిందే!

మత్సావతారం

కార్తీకపౌర్ణిమ సంధ్యా సమయాన శ్రీ మహావిష్ణువు ‘ మత్స్యమూర్తి’ గా అవతరించాడు.
‘తస్యాందత్తం హుతం జప్తం దశయజ్ఞ ఫలం స్మృతమ్’ ..ఈ పుణ్యకాలంలో చేసిన దాన, హోమ, జపాదులకు పది యజ్ఞాల ఫలం కల్గుతుందని పద్మపురాణం పలుకుతోంది.

జ్వాలా తోరణం

క్షీరసాగర మథనంలో మొదటగా హాలాహలం వెలువడుతుంది. లోకాలన్నింటినీ కబళించేలా హాలాహలం దూసుకుపోతుండటంతో పరమశివుడు దానిని ఉండగా చేసుకుని మింగబోతాడు. పూర్తిగా మింగేస్తే తన ఉదరంలో పదిలంగా ఉన్న లోకాలన్నీ నశించే ప్రమాదం ఉన్నందున శివుడు దానిని తన కంఠంలోనే బంధించి ఉంచుతాడు. పరమశివుడు హాలాహలాన్ని మింగడంతో పార్వతీదేవి ఆందోళన చెందుతుంది. హాలాహల జ్వాలలు తన భర్తకు హాని కలిగించరాదంటూ అగ్నిదేవుడిని ప్రార్థించింది. ఆమె ప్రార్థనతో అగ్నిదేవుడు చల్లబడ్డాడు. అందుకు ప్రతీకగా పార్వతీదేవి అగ్నిస్వభావం గల కృత్తికా నక్షత్రానికి సంకేతమైన కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం ఏర్పా టు చేసి, తన భర్తతో కలసి దాటింది. ఆ మంటల వేడి నుంచి ఉపశమనం కలిగించడానికే శివుడికి నీటితోను, పంచామృతాలతోను అభిషేకం చేస్తా రు. కొన్ని శివాలయాలలో జ్వాలాతోరణాన్ని నిర్వహిస్తారు. జ్వాలాతోరణం కింద నుంచి మూడుసార్లు వెళితే సమస్తపాపాలు, అపమృత్యు గండా లు తొలగిపోతాయని విశ్వసిస్తారు. గౌరీశంకరుల పల్లకిని జ్వాలాతోరణం కింది నుంచి మూడుసార్లు తీసుకువెళతారు. ఆ తర్వాత తోరణానికి మిగిలిన ఎండుగడ్డిని, సగం కాలిన గడ్డిని రైతులు గడ్డివాముల్లో కలుపుతారు. ఆ వాముల్లోని గడ్డిని మేస్తే పశువుల సంతతి అభివృద్ధి చెందుతుందని, రైతులకు ధాన్యానికి లోటు ఉండదని నమ్ముతారు.

Shiva Is Worshipped During Karthika Masam with Bhilapathas

శరవణభవుడి కథ

శివుడి రేతస్సును అగ్నిదేవుడు భరించలేక గంగానదిలో పడవేస్తాడు. గంగ కూడా దానిని భరించలేక ఒడ్డునే ఉన్న రెల్లుగడ్డిలో వదిలింది. ఆ తేజస్సు నుంచే జన్మించిన కుమారస్వామి శరవణభవుడిగా ప్రసిద్ధి పొందాడు. శివుడి కుమారుడి చేతిలో తప్ప ఇతరుల చేత మరణం సంభవించకుండా వరం పొందిన తారకాసురుడు రెల్లుగడ్డిని తగలబెట్టించాడు. కారణజన్ముడైన కుమారస్వామికి అగ్నిదేవుడు ఎలాంటి హాని చేయకుండా సురక్షితంగా కాపాడాడు. దానికి గుర్తుగా కుమారస్వామి జన్మనక్షత్రమైన కృత్తికా నక్షత్రం రోజున వచ్చే కార్తీక పున్నమి నాడు జ్వాలాతోరణం నిర్వహిస్తారు.
లంకా దహనం
సీతాదేవిని వెతికేందుకు లంకాపురికి హనుమంతుడు వెళ్తాడు. అప్పడు రాక్షసులు హనుమంతుడిని బంధించి తోకకు నిప్పు పెడతారు. ఆగ్రహించిన హనుమంతుడు తోకకు పెట్టిన నిప్పుతో లం కను దహనం చేస్తాడు. లంకాదహనం కార్తీక పౌర్ణ మి నాడే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకు గుర్తుగా పాపాలు నశించాలని మంచి జరగాలని కోరుతూ శివాలయాల్లో జ్వాలా తోరణాలు వెలిగిస్తారు. దీనినే కృతిక దీపోత్సవం అంటారు.

కేదారేశ్వర వ్రతం

మహశివుడి దేహంలో సగభాగం (వామ భాగం) ఉండాలని పార్వతి కోరుతుందట. అందుకు కఠిన తపస్సు చేస్తుందట. పార్వతి తపస్సును మెచ్చిన శివుడు కృత్తిక నక్షత్రం రోజున పర్వతాగ్రాన ఉవ్వెత్తు మంటలు సృష్టించి, గిరి ప్రదక్షిణలు చేయాలని సూచిస్తాడట. ప్రదక్షిణలు పూర్తయ్యాక తన దేహంలో పార్వతిని నిలుపుకుని అర్ధనారీశ్వరుడుగా పౌర్ణమినాడు అవతరిస్తాడట. అర్ధనారీశ్వరుడి రూపంలో శివుడిని కొలిచిన వారికి సకల పాపాలు తొలగి అయిదోతనం కలకాలం నిలబడుతుందని, అందుకే కార్తీక పౌర్ణమికి విశిష్టత చేకూరిందని పురాణాలు చెబుతున్నాయి.అదే కేదారవ్రతంగా ప్రశిద్ధికెక్కింది. కార్తీకపౌర్ణిమ రోజు కేదారవ్రతమాచరించిన వారు ఆ ఆదిదంపతుల కరుణాకటాక్షాలు పొదుతారని పురాణాలు చెబుతున్నాయి. అన్ని వ్రతాల కంటే కార్తీక వ్రతం ఎంతో గొప్పది. బలిచక్రవర్తికి ఓసారి శరీరమంతా మంటలు పుట్టాయట. ఆయన సంస్థాన వైద్యులు, ప్రత్యేక పురోహితులు కార్తీక మాసాన శివకేశవులను ఆరాధించి కార్తీక పౌర్ణమి వ్రతాన్ని ఆచరించాలని సూచించారట. పండితుల సూచన మేరకు బలి చక్రవర్తి వ్రతాన్ని ఆచరించాడట. దీంతో బలి చక్రవర్తికి వచ్చిన మంటలు పూర్తిగా దగ్గిపోయాయట. అప్పటి నుంచే కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

కార్తీక పౌర్ణమి రోజు తలార స్నానం చేసి పుజాదికాలను నిర్వహించుకొని ఉపవాసం ఉండాలి. సాయం వేళలలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. కార్తీక మాసంలో దీపానికి ఇంత విశిష్టత ఉంటుంది. కాబట్టి అలాంటి దీపాన్ని దానం చేస్తే మరింత మంచిదని చెబుతుంటారు. అందుకోసం బియ్యపుపిండి లేదా గోధుమ పిండితో చేసిన దీపాన్ని వెలిగించి దానం చేస్తుంటారు. స్తోమత ఉన్న వారు వెండి ప్రమిదను సైతం దానం చేస్తారు.

మట్టితో చేసిన ప్రమిదలను దానం ఇవ్వడం అంత శుభసూచకం కాదు కాబట్టి ఇలా పిండితో చేసిన దీపాలను దానం చెయ్యమని సూచించారు. కార్తీక మాసంలో ధాత్రి పూజ, ఉసిరిక పూజలు చేయడం ఆనవాయితీ. మాసమంతా వీటిని చేసినప్పటికీ కార్తీక పౌర్ణమి రోజున చేసే పూజలు మరింత విశిష్టమైనవి. ఉసిరి, తులసి మొక్కలు ఔషధీ గుణాలు కలిగినవి. ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఉసిరి పూజ వల్ల లక్ష్మీదేవి ఇంటిలో స్థిర నివాసం ఏర్పరుచుకుంటుందని కార్తీక మాసంలో స్నానాలు, దీపారాధన, జాగరణ చేస్తారు. తులసి, ఉసిరి పూజల వల్ల ధన, ఫల, భూదానాల వల్ల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. నిత్యదీపారాధన చేయని వారు కార్తీక పున్నమి నాడు 365 వత్తులను ఒక్కటిగా చేసి, ఆవునేతితో తడిపి మట్టి ప్రమిద లేదా కొబ్బరి చిప్పలో దీపం వెలిగిస్తే ఏడాది పొడవునా దీపారాధన చేసిన ఫలం దక్కుతుందని ప్రతీతి. కార్తీక పున్నమి ఉదయం విష్ణుపూజకు, రాత్రి శివపూజకు అనుకూలమైనవి. శివకేశవుల అనుగ్రహం కోరేవారు ఆ రోజు ఉదయం వైష్ణవాలయాల్లో అర్చనలు జరిపిస్తారు.
ఉపవాసం పుణ్యఫలం

కార్తీక పున్నమినాటి ఉపవాసం విశిష్ట ఫలదాయకమని పురాణాలు చెబుతున్నాయి. దారిద్య్రబాధల విముక్తి కోసం కార్తీకంలో శ్రీమహాలక్ష్మిని పూజించడం వల్ల సత్ఫలితాలు సిద్ధిస్తాయని ప్రతీతి. కార్తీక పున్నమి రోజున ఆవుపాలతో వండిన పాయసాన్ని శివకేశవులకు, లక్ష్మీదేవికి నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించేవారికి, మారేడు ఫలాన్ని సేవించేవారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. స్త్రీలు కడుపు చలవ కోసం కార్తీక పౌర్ణిమ నాడు ఉపవశిస్తారు. ఇతరమతాలకు కూడా ఈ కార్తీక పౌర్ణిమ చాలా విశిష్టమైన రోజు. సిక్కుమత వ్యవస్థాపకుడు గురునానక్ జన్మించినది కార్తీక పున్నమి రోజునే కావడంతో ఈ రోజును సిక్కులు అత్యంత పవిత్ర దినంగా భావిస్తారు. కార్తీక పున్నమి జైనులకు కూడా అత్యంత పవిత్రమైన రోజు. హిందువుల మాదిరిగానే జైనులు కూడా వర్ష రుతువులో చాతుర్మాసం పాటిస్తారు. చాతుర్మాసం ముగిసిన తర్వాత కార్తీక పున్నమి రోజున గుజరాత్లోని శత్రుంజయ పర్వతంపై వెలసిన జైనక్షేత్రం ఆదినాథ ఆలయంలో ప్రార్థనలు జరుపుతారు.

 

Karthika pournami charitra

 

విశాలి పేరి