Home జాతీయ వార్తలు ఇండియాలో కశ్మీర్‌కు అన్యాయం

ఇండియాలో కశ్మీర్‌కు అన్యాయం

Mehabuba Muftiసైన్యంతో అణచేయాలనుకుంటే కుదరదు
ఫారుక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
35ఏ రద్దయితే కశ్మీర్ ఇండియాలో ఉండదు
మెహబూబా ముఫ్తీ షాకింగ్ కామెంట్
అమిత్‌షా ప్రకటనపై ఘాటు హెచ్చరిక

బీర్వాహ్(జమ్మూకశ్మీర్): కశ్మీర్ ప్రజలకు భారతదేశం న్యాయం చేయడంలేదని, అయితే సైనిక బలంతో వారిని అణచివేయలేదని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారుక్ అబ్దుల్లా బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రజల హక్కును కేంద్రం తిరిగి ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ‘ఇండియా మాకు న్యాయం చేసిందా? ఇప్పుడున్న పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. మా ప్రజలకు న్యాయం చేయమని ఆయనకు (ప్రధాని నరేంద్రమోడీ) చెప్పాలనుకుంటున్నాను. మా హక్కులు తప్ప మరేదీ కోరడం లేదు. మీది మేము కోరడం లేదు. కానీ మా హక్కు ఏమిటి?’ అని రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తూ అబ్దుల్లా ప్రశ్నించారు. బీర్వాహ్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఆయన వర్కర్ల సమావేశంలో మాట్లాడారు.

తాను బతికున్నా లేకున్నా ఏదోక రోజు కశ్మీర్ ప్రజల హక్కుల్ని తిరిగివ్వడం తప్ప కేంద్రానికి మరో మార్గం లేదని కేంద్ర మాజీ మంత్రి చెప్పారు. ‘మీరు హరించిన మా రాష్ట్ర ప్రజల హక్కుల్ని తిరిగివ్వాలి. సైనిక బలంతో అణచేస్తామనుకుంటే మీరు చాలా పొరబడుతున్నారన్నమాట. చాలామంది ఆ ప్రయ త్నం చేశారు. కానీ దేవుడి దయ వల్ల ఆ ప్రయత్నాలు సాగలేదు. మమ్మల్ని అణచివేయలేరు’ అని చెబుతూ…1953కు ముందు ఇక్కడ శాంతి ఉండేదని, తిరిగి ఆ పరిస్థితి నెలకొంటేనే జమ్మూకశ్మీర్‌లో శాంతి ఏర్పడుతుందని, అదే ఎన్‌సి వైఖరి అని అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. ‘రాష్ట్రం ఉనికిని కాపాడేందుకు రాజ్యాంగంలో ఆర్టికల్ 370, 35ఎ ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు మన నాయకులు కొందరు వారి ప్రయోజనాలకోసం ఆర్టికల్ 370ని డొల్లగా మార్చారు. రాష్టం గౌరవాన్ని, ఉనికిని కాపాడాలంటే మీరు ఈ పతాకాన్ని (నేషనల్ కాన్ఫరెన్స్ పతాకం) నిలబెట్టాలి. నాగలి (ఎన్‌సి గుర్తు) ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ ఎన్నిక మీకొక పరీక్ష’ అని అబ్దుల్లా సభనుద్దేశించి చెప్పారు.

35ఎ రద్దయితే విడిపోతాం: మెహబూబా ముఫ్తీ
జమ్మూకశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక సదుపాయాలను తొలగిస్తే, కశ్మీర్ భారతదేశం నుంచి విడిపోవాల్సి ఉంటుందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పిడిపి) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ బుధవారం హెచ్చరించారు. అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేసిన కొద్దిసేపటికే ఆమె ఈ షాకింగ్ కామెంట్ చేశారు.2020 నాటికి ఆర్టికల్ 35ఎ రద్దవుతుందని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా చేసిన ప్రకటనకు సమాధానంగా ఆమె ఈవిధంగా స్పందించారు. ‘జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించడంవల్లే ఈ రాష్ట్రం ఇండియాలో భాగంగా ఉంది. వాటిని తొలగిస్తే 2020 నాటికి ఈ రాష్ట్రం భారతదేశం నుంచి విడిపోతుందనే నిజాన్ని గ్రహించేందుకు ఆయన సిద్ధపడ్డారనే అనుకుంటాను. అప్పుడు వారు మెహబూబా ముఫ్తీ నాయకత్వంలో జరిగే భారీ పోరాటానికి సిద్ధపడాల్సి ఉంటుంది. అంతేకాదు…2020లో జమ్మూకశ్మీర్ కూడా దేశానికి డెడ్‌లైన్ విధిస్తోంది’ అని ఆమె సవాల్ విసిరారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకంగా ప్రధాని ఉండాలన్న అంశంపై మాట్లాడుతూ ముఫ్తీ… నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు షేక్ అబ్దుల్లా 1975 ఒప్పందంపై సంతకం చేసేటప్పుడు ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఒకప్పటి కశ్మీర్ ప్రధానమంత్రి పదవిని పునరుద్దరించాలని కోరారు’ అని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆ పార్టీకి ఇన్నేళ్లుగా మూడింట రెండొంతుల మెజారిటీ ఉన్నా చేసిందేమీలేదని విమర్శించారు. ఆర్టికల్ 370కి మద్దతుగా రాష్ట్రం మొత్తం ఒక్కటిగా నిలుస్తుందని ముఫ్తీ దృఢంగా చెప్పారు.

Kashmir is unfair in India says Mehabuba mufti