Wednesday, April 24, 2024

కలిసిన కశ్మీర్ పార్టీలు

- Advertisement -
- Advertisement -

Kashmir Six Parties Political Crisis   నాలుగెద్దులు, సింహం కథ గుర్తొచ్చే సందర్భమిది. తాము కోల్పోయిన 370, 35 ఎ అధికరణల ప్రత్యేక ప్రతిపత్తిని, రాష్ట్ర హోదాను తిరిగి సాధించుకోడానికి విభేదాలు మరచి ఐక్యంగా పోరాడాలని జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఆరు ప్రధాన రాజకీయ పక్షాలు తీసుకున్న నిర్ణయం ఈ కోవలోనిదే. గత ఏడాది ఆగస్టు 5వ తేదీన పార్లమెంటు ఆమోదంతో జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత అక్కడ నెలకొని కొనసాగుతున్న నిర్బంధ వాతావరణం ఈ ఆరు రాజకీయ పార్టీలలో గాఢమైన ఆత్మవిమర్శకు దారి తీసిందని బోధపడుతున్నది. ఒకదాని తర్వాత ఒకటిగా జమ్మూ కశ్మీర్‌ను పాలిస్తూ వచ్చిన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పిడిపి) లతో పాటు కాంగ్రెస్, సిపిఎం, జమ్మూ కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్, ఆవామీ నేషనల్ కాన్ఫరెన్స్‌లు కూడా ఈ నిర్ణయ పత్రంపై సంతకాలు చేశాయి. పిడిపి అధ్యక్షురాలు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు.

ఆమె తరపున ఆమె కుమార్తె ఈ నిర్ణయానికి మద్దతు తెలిపినట్టు వార్తలు చెబుతున్నాయి. కేంద్ర పాలక పక్షం భారతీయ జనతా పార్టీ మినహా మిగతా దాదాపు అన్ని పార్టీలు ఏడాదిగా అక్కడ నెలకొన్న సరికొత్త రాజకీయ స్వరూప స్వభావాలను వ్యతిరేకిస్తున్నాయని వెల్లడవుతున్నది. ఈ పరిస్థితిని ఇక ఎంత మాత్రం కొనసాగనీయరాదన్న దీక్ష వాటిలో దృఢతరమైనట్టు రుజువవుతున్నది. ఈ పార్టీలు గత ఏడాది ఆగస్టు 4వ తేదీన విడుదల చేసిన గుప్కార్ ప్రకటనకు కట్టుబడి ఉంటామని తాజా నిర్ణయంలో స్పష్టం చేశాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన 2019 ఆగస్టు 5వ తేదీకి ఒక రోజు ముందు శ్రీనగర్‌లోని గుప్కార్ గల మాజీ ముఖ్యమంత్రి ఫారూఖ్ అబ్దుల్లా నివాసంలో ఈ పార్టీలన్నీ సమావేశమై ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడుకోవాలని ప్రతిజ్ఞ చేశాయి.

అదే గుప్కార్ డిక్లరేషన్‌గా ప్రసిద్ధి పొందింది. ఈ పార్టీల తాజా నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ సహజంగానే వ్యతిరేకించింది. 370, 35ఎ రాజ్యాంగ అధికరణల పునరుద్ధరణ కల్ల అని, ఆ రెండూ జమ్మూ కశ్మీర్‌లో ద్వేషాన్ని పెంచి అభివృద్ధిని అడ్డుకున్నాయని స్థానిక బిజెపి అధ్యక్షుడు చేసిన ప్రకటన ఈ పరిణామం పట్ల జాతీయ పాలక పక్షం అయిష్టాన్ని, అసంతృప్తిని చాటుతున్నది. వాస్తవానికి బిజెపి చెబుతున్నట్టు ప్రత్యేక ప్రతిపత్తి, విశేష హక్కుల రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ ప్రజలు సుఖసంతోషాలతో మనుగడ సాగిస్తూ ఉంటే, అక్కడ ప్రజాస్వామ్యం పరిఢవిల్లి అభివృద్ధి ఆకాశాన్ని అంటుతూ ఉంటే సంతోషించనివారెవరూ ఉండరు. ఏ ప్రాంతంలోనైనా అక్కడి ప్రజల అభీష్టం మేరకే పాలన జరగాలి గాని వేరే విధంగా సాగడం ప్రజాస్వామికం కాదు. కాని గత ఏడాదిగా అక్కడ నెలకొన్న వాతావరణం ఇందుకు పూర్తి విరుద్ధ స్థితిని ప్రతిబింబిస్తున్నది.

అయితే జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తికి, ప్రత్యేక హక్కులకు బిజెపి సైద్థాంతికంగా బద్ధ వ్యతిరేకి అని, వాటిని రద్దు చేయడాన్ని అది తన ప్రముఖ లక్షాల్లో ఒకటిగా చేసుకున్నదని తెలిసి కూడా అక్కడి ప్రధాన రాజకీయ పక్షాలైన నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపిలు వేర్వేరు కాలాల్లో దానితో కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. అక్కడ పిడిపితో ఐక్య సంఘటన పాలనకు బిజెపి 2018 జూన్‌లో స్వస్తి చెప్పింది. దానితో తెగతెంపులు చేసుకున్నది. ఆ తర్వాత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, గవర్నర్ పాలన విధింపు, అసెంబ్లీ రద్దు, చివరికి 2019 ఆగస్టు 5 నాటి పరిణామాలు తెలిసినవే. గత ఏడాదిగా కొనసాగుతున్న పరమ అప్రజాస్వామిక వాతావరణం, స్వేచ్ఛల హరణానికి తోడు సరిహద్దుల్లో చైనా సేనలతో రక్త సిక్త ఘర్షణ వంటి పరిణామాలు కూడా దేశానికి అత్యంత కీలకమైన, సున్నితమైన చోట పరిస్థితులు మరింత దిగజారిపోయాయనే అభిప్రాయానికి తావు కలిగించాయి.

కేంద్రంలోని ఎన్‌డిఎ పాలకులు ఆశించినట్టు జమ్మూకశ్మీర్ విభజన అక్కడ టెర్రరిజం అంతానికి కూడా దారి తీయలేదు. ఒక్క కశ్మీర్‌లోనే రూ. 40 వేల కోట్ల వ్యాపారం నష్టపోయిందని చెబుతున్నారు. దీనిని బట్టి అభివృద్ధి ఎంతగా కుంటుపడిందో చెప్పుకోనక్కర లేదు. 2018 అక్టోబర్‌లో జరిపించామనిపించుకున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కశ్మీర్ లోయలో కేవలం ఐదారు శాతం ఓట్లు మాత్రమే పడడంగాని, బాకీ పడిన పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఇప్పటి వరకు సాధ్యపడకపోడంగాని అక్కడ ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందనే చెబుతున్నాయి. అటువంటి చోట కేవలం బలగాల అండతో ఎంతకాలం నెట్టుకురాగలరు? గత ఏడాది ఆగస్టు 5 నాటికి పూర్వమున్న పరిస్థితిని పునరుద్ధరింప చేసుకునేందుకు ఒక్క పిడికిలై కలిసి నడవాలని జమ్మూకశ్మీర్‌లోని ఆరు ప్రధాన రాజకీయ పక్షాలు చేసిన ప్రతిజ్ఞ సమీప భవిష్యత్తులో సఫలమయ్యే అవకాశాలు బొత్తిగా లేనప్పటికీ ఈ నిర్ణయంలో అక్కడి ప్రజల అభీష్టం ప్రతిబింబిస్తున్న మాట వాస్తవం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News