Home జాతీయ వార్తలు ఇన్సానియత్ జమ్హూరియత్ కశ్మీరియత్

ఇన్సానియత్ జమ్హూరియత్ కశ్మీరియత్

Kashmir theory has been proposed to pursue friendship with Pakistan

మన తెలంగాణ, న్యూఢిల్లీ: రావణాకాష్టంగా రగులుతున్న కశ్మీర్ సమస్యకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం రూపొందించిన సిద్ధాంతమే అనుసరణీయమని అప్పటి కాల పరిస్థితులు రుజువు చేశాయి. ఈ విషయాన్ని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట బురుజులపై నుంచి బుధవారం ప్రధాని మోదీయే స్వయంగా ధృవీకరించారు. గురువారం సాయంత్రం కన్నుమూసిన వాజ్‌పేయీ కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం, ప్రత్యేకించి పొరుగు దేశమైన పాకిస్తాన్‌తో స్నేహ సంబంధాలను కొనసాగించడానికి కశ్మీర్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ‘ఇన్సానియత్ (మానవీయత), జమ్హూరియత్ (శాంతి), కశ్మీరియత్ (కాశ్మీరీతత్వం)’ నినాదాన్ని వాజ్‌పేయి దేశ ప్రజలకు అందించారు. కశ్మీర్ లోయలో శాంతి, అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా వాజ్‌పేయీ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

వాజ్‌పేయీ ప్రభుత్వం రూపొందించిన ఈ సిద్ధాంతం ప్రపంచ వ్యాప్తంగా మన్నలతో పాటు ప్రత్యేకించి ఆ రాష్ట్రంలో తీవ్రవాద శక్తులు కూడా కొంతమేరకు అంగీకరించాయి. పాకిస్థాన్‌కు స్నేహ హస్తం అందిస్తూ 2003లో పార్లమెంట్‌లో వాజపేయి ఒక ప్రకటన కుడా చేసారు. ‘పాకిస్తాన్‌కు స్నేహహస్తాన్ని అందిం చాం. పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. సరిహద్దులలో తీవ్రవాదుల చొరబాటును నిరోధించడం, తీవ్రావాదుల స్థావరాలను ధ్వంసం చేయడం జరిగితే చర్చలకు ద్వారాలు తెరుచుకుంటాయి. కాశ్మీర్ సమస్యతో సహా చర్చలకు సిద్ధమే’ అని వాజపేయి ప్రకటించారు. ఒకవైపు స్నేహ హస్తం అందిస్తూనే, మరోవైపు యుద్ధమే అనివార్యమైతే తాము కూడా సమర్ధవంతంగా తిప్పికొట్టగల సత్తా ఉందనే సందేశాన్ని పోఖ్రాన్ 2 అణ్వాయుధ పరీక్ష ద్వారా స్పష్టం చేశారు. అదే సమయంలో తొలుత అణ్వాయుధాన్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లో వినియోగించబోదనే విధానాన్ని ప్రకటించారు. అయితే అంత మాత్రాన భారతదేశం చేతులు కట్టుకొని కూర్చోదనే అభిప్రాయాన్ని కూడా వాజపేయి కలిగించారు.

బిజెపి ఎన్నికల ప్రణాళిక లో పేర్కొన్న విధంగా 1998లో పోఖ్రాన్ అన్వయుధాల పరీక్షలు నిర్వహించారు.1974లో ఇందిరాగాంధీ నిర్వహించిన తర్వాత రెండవ సారి ఈ పరీక్షలు నిర్వహించి ప్రపంచానికి భారత్ సత్తాను వాజపేయి చాటిచెప్పారు. అయితే మొదట తాము వినియోగించబోమనే విధానాన్ని కూడా వాజపేయి ప్రకటించారు. ఆ తరవాత పాకిస్తాన్ కూడా ఇదే విధమై న  పరీక్షలు నిర్వహించడంతో ప్రపంచ దేశాల్లో కొంత అలజడి ఏర్పడింది. భారత దేశంపై అమెరికా తదితర దేశాలు ఆర్ధికపరమైన ఆంక్షలు విధించాయి. అంతే కాకుండా ఇరు దేశాలతో అమెరికా దౌత్యపరమైన చర్చలు జరిపిన ఫలితంగా  చర్చలకు ఇరు దేశాలు అంగీకరించాయి. ముందుగా చొరవ ప్రదర్శిస్తూ లాహోర్ బస్సు యాత్రను వాజపేయి చేపట్టారు. అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో కలిసి లాహోర్ ప్రకటనను వాజపేయి జారీచేశారు. అయితే ఆ తరువాత పాక్‌లో జరిగిన పరిణామాల్లో పర్వేజ్ ముష్రాఫ్ ఆ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి లాహోర్ ప్రకటనను చెత్తబుట్టలో వేశారు.

అంతటితో ఆగకుండా కాశ్మీర్‌లోని కార్గిల్ ప్రాంతంలో పాక్ సైన్యాలు చొరబడ్డాయి. అయితే భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ పేరిట 1999 జులైలో జరిపిన యుద్ధంలో విజయం సాధించింది. పాక్ సైన్యానికి దీటైన సమాధానం ఇచ్చింది. కార్గిల్ ఉదంతం తరవాత కూడా వాజపేయి తన శాంతి ఎజెండాను మానుకోలేదు. లాహోర్ ప్రకటన విఫలమైన తర్వాత పలు దౌత్య చర్చల తర్వాత 2001లో  ఆగ్రా సదస్సుకు రంగం సిద్ధమైంది. భారత, దేశాల మధ్య  సంబంధాలు మెరుగుపడడానికి అత్యంత కీలక అవకాశాలు ఈ సదస్సులో చేజారాయి. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు ముషార్రఫ్ నాలుగు అంశాల పరిష్కారాన్ని ప్రతిపాదించారు. పలు కోణాల నుంచి భారత ప్రభుత్వానికి ఈ ప్రతిపాదన అంగీకారంగా కనపడింది. వాజపేయి కూడా అందుకు సుముఖంగా వున్నారని మరుసటి రోజు సదస్సులో ‘ఆగ్రా డిక్లరేషన్’ వెలువడుతుందని అందరూ భావించారు.

భారత ప్రభుత్వంతో ఒక వైపు చర్చలు జరుపుతూనే భారత దేశానికి ప్రముఖ పాత్రికేయులతో అనధికార ఇష్టాగోష్టిని ముషార్రఫ్ నిర్వహించారు. అంతటితో ఆగకుండా దాదాపుగా గంటసేపు జరిగిన పాత్రికేయుల కార్యక్రమాన్ని  పూర్తిగా పాకిస్తాన్‌లో ప్రత్యక్ష ప్రసారం అయ్యేలా ముష్రాఫ్ చర్యలు చేపట్టారు. ఆ కార్యక్రమంలో  సరిహద్దు తీవ్రవాదంపై తమ అభిప్రాయాలను స్పష్టం చేయడమే కాకుండా భారత ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. దాంతో అప్పటి ఉప ప్రధాని లాల్ కిషన్ అద్వానీ చొరవ తీసుకోని అగ్ర వేదికకు స్వస్తి వాచకం పలికించారు. ఆ తరవాత అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం వాజపేయి సిద్ధాంతాన్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం మోడీ ఈ విషయాన్ని ఉటకించడంతో వాజపేయి సిద్ధాంతానికి అనుగుణంగా ఏ మాత్రం చర్చలు ముందుకు సాగుతాయో వేచి చూడాల్సి వుంది.