Friday, April 19, 2024

‘నవ కశ్మీర్’ కు ఏడాది

- Advertisement -
- Advertisement -

Kashmiris celebrate one year of abrogation of Article 370 జమ్ము కశ్మీర్ విశేషాభరణాలైన 370, 35ఎ రాజ్యాంగ అధికరణలను తొలగించి, ఆ రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి నేటితో ఏడాది పూర్తవుతుంది. రాజ్యసభలో మెజారిటీ లేని పాలక భారతీయ జనతా పార్టీ పలు కాంగ్రెసేతర పక్షాల మద్దతు సమీకరించి పార్లమెంటులో చట్టం ద్వారా కశ్మీర్ స్వరూప స్వభావాలను సమూలంగా మార్చివేసిన ఈ అసాధారణ చర్య తీసుకున్నది. కీలక సరిహద్దు రాష్ట్రం, ఉగ్రవాద, వేర్పాటువాద, పాకిస్థాన్‌లో విలీనవాద శక్తులున్న రాష్ట్రం కావడం వల్ల ఈ సందర్భంగా భారీ బలగాలను అక్కడ దింపింది. ప్రజల మధ్య సమాచార సంబంధాలను బంద్ చేసింది. 4 జీ నెట్ సౌకర్యాన్ని ఇప్పటికీ పునరుద్ధరించలేదు. కీలక ప్రతిపక్ష రాజకీయ నాయకులను నిర్బంధంలో ఉంచింది.

నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు, తండ్రీ కొడుకులు ఫారూఖ్, ఒమర్ అబ్దుల్లాలను విడుదల చేసినప్పటికీ మరో మాజీ ముఖ్యమంత్రి, పిడిపి నాయకురాలు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు. ఆమె నిర్బంధాన్ని ఇటీవలే మరి మూడు మాసాలు పొడిగించారు. రెండు పదులకు మించిన పలువురు ఇతర నేతలు నిర్బంధంలో కొనసాగుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సైఫుద్దీన్ సోజ్ పాక్షిక నిర్బంధాన్ని అనుభవిస్తున్నట్టు స్పష్టపడుతున్నది. కశ్మీర్‌ను మిగతా దేశంతో సమానమైన స్థితికి తీసుకు వచ్చిన మోడీ ప్రభుత్వ చర్య ఏడాది దాటింతర్వాత కూడా అక్కడ సాధారణ స్థితిని పునరుద్ధరించలేకపోతున్నదని బోధపడుతున్నది. ఉగ్రవాద మూకల బెడద, అమిత బలగాల అవసరం తొలగలేదు.

అసలే కర్ఫూ వంటి వాతావరణం నెలకొన్న చోట కరోనా లాక్‌డౌన్ విరుచుకుపడడంతో విద్యార్థుల చదువుసంధ్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కశ్మీర్ పునర్వవస్థీకరణ చట్టం ద్వారా కేంద్ర పాలకులు ఆశించిన ఆర్థికాభివృద్ధి, దేశంలోని ఇతర ప్రాంతాలవారు వచ్చి అక్కడ నిరభ్యంతరంగా, నిర్భయంగా స్థిరపడడం బొత్తిగా మొదలు కాలేదు. టెర్రరిస్టు ముఠాలు నిరసన దినం పాటించకుండా చేయడానికి ఈ 4, 5 తేదీల్లో కశ్మీర్ లోయలో కర్ఫూ విధించారు. టెర్రరిస్టుల దాడులు, వారితో ఎన్‌కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా కేంద్రం తీసుకువచ్చిన పునర్వవస్థీకరణ చట్టానికి అనుగుణంగా కశ్మీర్ ప్రజల్లో మార్పు రాలేదని రూఢి అవుతున్నది. పలువురు ప్రతిపక్ష నేతలు నిర్బంధంలో కొనసాగుతున్నందున, విడుదలయిన వారికి పూర్తి వాక్ స్వాతంత్య్రం లేని వాతావరణం వల్ల రాజకీయ స్వేచ్ఛ కరువైపోయింది.

అసెంబ్లీ ఎన్నికలు జరగకపోడం, కేంద్ర పాలిత ప్రాంత పాలనా వ్యవస్థలో ఢిల్లీ పట్టు పెరగడంతో జన జీవనం స్వేచ్ఛారాహిత్యం నుంచి బయటపడలేదనిపిస్తున్నది. కొత్త రూపెత్తిన కశ్మీర్‌లో ఇతర ప్రాంతాల వారు ప్రవేశించి అక్కడ పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలలో విశేషంగా పెట్టుబడులు పెట్టేలా చూడాలని కేంద్రం ఆశించింది. అది జరగడానికి పూర్తి అనుకూలమైన వాతావరణం అక్కడ స్థిరపడితే కేంద్రం ఎదురు చూస్తున్నట్టు కశ్మీర్ ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకొని, యువతకు ఉద్యోగావకాశాలు విశేషంగా పెరుగుతాయి. అలాగే అది మొత్తం భారతీయులందరి ఉమ్మడి జీవన వేదికగా మారుతుంది. కాని అదనపు బలగాల మోహరింపు, 144వ సెక్షన్, కర్ఫూల విధింపు అవసరం లేని పరిస్థితి నెలకొననంత వరకు అటువంటి మార్పు రాదని ఏడాది కాలంగా ఏర్పడిన ప్రతిష్టంభన రుజువు చేస్తున్నది.

గత మార్చిలో జరిగి ఉండవలసిన పంచాయతీ ఎన్నికలను శాంతి భద్రతల పరిస్థితిని కారణంగా చూపి వాయిదా వేయవలసి వచ్చింది. భారతీయ జనతా పారీ,్ట ముఫ్తీ మొహమ్మద్ సయీద్ నాయకత్వంలోని పిడిపిల ఐక్య సంఘటన విచ్ఛిన్నమైన కారణంగా జమ్ము కశ్మీర్‌ను గవర్నర్ పాలనలో ఉంచారు. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత నేరుగా కేంద్రం ఆధీనంలోకి వచ్చింది. ప్రజాప్రాతినిధ్య పాలక వ్యవస్థను ఏర్పాటు చేయకుండా కశ్మీర్‌ను ఇలాగే కొనసాగనివ్వడం భారత ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం వన్నె తీసుకు రాదు. అవతల కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన లడఖ్‌లోనూ ప్రజలు సంతృప్తిగా లేరని సమాచారం. కేంద్ర పాలిత ప్రాంతంగా మారి కశ్మీర్ పాలకుల పట్టునుంచి బయటపడినందుకు లడఖ్ ప్రజలు ఆనందించినప్పటికీ, దానికి ప్రత్యేకించి అసెంబ్లీని మంజూరు చేయకపోడం, వారికి ఇబ్బందిగా ఉంది. రాజ్యాంగం 6వ షెడ్యూల్ కింద చేర్చి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Kashmiris celebrate one year of abrogation of Article 370

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News