Home కుమ్రం భీం ఆసిఫాబాద్ మారని కస్తూర్బా గాంధీ విద్యాలయ సమస్యల తీరు

మారని కస్తూర్బా గాంధీ విద్యాలయ సమస్యల తీరు

Kasturba Gandhi Education issues

మన తెలంగాణ/బెజ్జూర్ : పాఠశాలలు పునఃప్రారంభం అయినప్పటికి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో సమస్యలు తీరని పరిస్థితిగా మారింది. బెజ్జూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం అనేక సమస్యల వలయంగా మారింది. పాఠశాలల పునః ప్రారంభం మొదటి రోజు ప్రిన్సిపల్ అనూష రాకపోవడమే కాకుండా రెండవ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం వేడుకలకు ప్రిన్సిపల్  సయమానికి రాకపోవడంలో గదులు తాళాలు కూడా ప్రిన్సిపల్ వద్దనే ఉండడంతో సిబ్బంది చేసేదేమిలేక జెండా సామాగ్రి ఉన్న గది తాళాలను పగులగొట్టి వారే జెండా ఆవిష్కరించారు.  ఉదయం 10.30 గంటల సమయంలో ప్రిన్సిపల్ పాఠశాలకు వచ్చి గదుల తాళాలు ఎందుకు పగులగొట్టారని సిబ్బందిని నిలదీశారు. అంతే కాకుండా తాళాలు మీరే కొని తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు. పాఠశాలలో మరుగుదొడ్లు, స్నానపు గదులు ఉన్నప్పటికి కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయి. గతంలో పాఠశాలలో పలుమార్లు విష సర్పాలు రావడంతో విద్యార్థులు భయాభ్రాంతులకు గురికావల్సిన పరిస్థితి నెలకొంది. కిటికిలకు తలుపులు లేకపోవడంతో వర్షాకాలం వర్షపు నీరు గదులలో చేరడంతో రాత్రి సమయాల్లో గతంలో జాగరణలు ఉండాల్సిన పరిస్థితి అదే విధంగా చలి కాలంలో చలికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితిగా మారింది. మెనూ ప్రకారం భోజనం కూడా అందించని పరిస్థితి. ప్రహారి ఉన్నప్పటికి గేటు లేకపోవడంతో పశువులు, పందులు సైతం లోపలికి సంచరిస్తున్నాయి. ప్రిన్సిపల్ అనూష  పాఠశాలలో పనిచేస్తున్నప్పటి నుండి సమస్యలు పట్టించుకోవడం లేదని అప్పట్లో విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికి  అధికారులు మాత్రం సమస్యలు  పరిష్కరించడంలో విఫలమయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. పలుమార్లు అధికారులు తనికీలు నిర్వహించే సమయాల్లో ప్రిన్సిపల్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారే తప్పా ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వెల్లువిరుస్తున్నాయి. పాఠశాలలు పునః ప్రారంభం అయినప్పటికి ప్రిన్సిపల్ నిర్లక్షంతో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో సమస్యలు సరిచేయడంలో మాత్రం పట్టింపు కరువైందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపల్ తీరుకు విద్యార్థులకు సమస్యలు తప్పని తీరుగా మారింది. ఇప్పటికైనా అధికారులు సమస్యలు పరిష్కరించి విద్యార్థుల చదువులకు బంగారు బాటలు వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.