Sunday, July 21, 2024

త్వరలో టిఆర్‌ఎస్‌లోకి కౌశిక్‌రెడ్డి, పెద్దిరెడ్డి..?

- Advertisement -
- Advertisement -

Kaushik Reddy, Peddireddy to join TRS soon ..?

 

మన తెలంగాణ/హైదరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈటల రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. టిఆర్‌ఎస్‌ను వీడిన ఈటల తదనంతరం కాషాయ తీర్థం పుచ్చుకుని బిజెపి తరపున అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో ఈ ఉప ఎన్నికకు అత్యధిక ప్రాధాన్యత ఏర్పడింది. అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు ఈ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకున్నాయి. టిఆర్‌ఎస్ ఆది నుంచి ఇక్కడ వ్యూహ, ప్రతి వ్యూహాలను రచిస్తూ శరవేగంతో ముందుకు సాగుతోంది. గెలుపే లక్షంగా వడివడిగా అడుగులు వేస్తోంది. సరైన అభ్యర్థి ఎంపిక దిశగానూ టిఆర్‌ఎస్ నడుం బిగించింది. ఇదే క్రమంలో మాజీ మంత్రి బిజెపి ఇనుగాల పెద్దిరెడ్డి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సోమవారం పెద్దిరెడ్డి స్వయంగా కెప్టెన్ ఇంటికి వెళ్లి రెండు గంటల పాటు సమావేశమయ్యారు.

హుజురాబాద్ నుంచి గతంలో ఎంఎల్‌ఎగా ప్రాతినిధ్యం వహించిన పెద్దిరెడ్డి బిజెపి తరపున ఈసారి పోటీ చేయాలని భావించారు. ఈటల బిజెపిలో చేరడంతో ఆ అవకాశం కోల్పోయిన ఆయన బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పట్నించీ అంటీముట్టనట్టుగానే బిజెపితో ఉన్న పెద్దిరెడ్డి త్వరలోనే టిఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఆది, సోమవారాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఊహించని మలుపులు తిరిగాయి. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి పాడి కౌశిక్‌రెడ్డి ఫోన్ సంభాషణలు లీక్ అయిన వెంటనే వేగంగా పావులు కదిలాయి. కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, టిఆర్‌ఎస్‌లోకి వెళ్లేందుకు ముహూర్తం నిర్ణయించుకోవడం జరిగిపోయింది. ఈ నెల 16న హైదరాబాద్‌లోని టిఆర్‌ఎస్ భవన్‌లో సిఎం కెసిఆర్ సమక్షంలో కౌశిక్‌రెడ్డి టిఆర్‌ఎస్ కండువా కప్పుకోబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక ఇటీవల టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి, తెలంగాణ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్.రమణ సోమవారం టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చేతుల మీదుగా పార్టీ సభ్యత్వం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ విధంగా హుజురాబాద్ ఉప ఎన్నిక రాజకీయం క్షణక్షణం ఉత్సుకతను రేపుతోంది. ఇదే క్రమంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరవుతారు? అనేదానిపై సైతం తీవ్ర ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇక్కడ టిఆర్‌ఎస్‌బిజెపిల మధ్యే ప్రధాన పోటీ ఉండొచ్చని చెబుతున్నప్పటికీ మారుతున్న పరిణామాలతో తమకు కూడా పెచ్చు ఉండే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇప్పుడిప్పుడే చెప్పబోమని మరో వైపు టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించడం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News